సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో దోషులైన పురుషులకు మేజిస్ర్టేట్ బెయిల్ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి బెయిల్ నిబంధన విపక్ష పార్టీల ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం.
తాజా సవరణ ప్రకారం మేజిస్ట్రేట్‌కు బెయిల్ మంజూరు చేసే అధికారాలుంటాయి. ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ర్టేట్‌ను ఆశ్రయించవచ్చు. మేజిస్ట్రేట్ నిర్ణయానుసారం మైనర్ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది.
ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదంకోసం సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. పెద్దల సభలో బిల్లు ఆమోదానికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లును బీజేపీ పార్లమెంట్‌లో ప్రవేశపెడితే మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మహిళా సాధికారత అంటూ మాటలు చెబుతున్న ప్రధాని మహిళా బిల్లుపై ఎందుకు వెనుకాడుతున్నారని రాహుల్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment