ముస్లిం మహిళలపై వివక్ష చూపుతున్న తలాక్ పద్ధతి చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి నాలుగు నెలలు కావస్తోంది. ఈ విషయంలో తామొక చట్టం తీసుకురాదల్చుకున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే సర్కారు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించిన ఆ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మన రాజ్యాంగం పౌరులందరినీ సమానంగా చూడాలని..కుల, మత, లింగ ప్రాతిపదికనగానీ... పుట్టిన ప్రాంతాన్ని బట్టిగానీ వివక్ష చూపరాదని చెబుతోంది. అయినా ఏదో ఒక రూపంలో అన్నిటా ఇలాంటి వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళల పట్ల ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. ముస్లింలలో కొద్దిమందే ఆచరిస్తూ ఉండొచ్చుగానీ...మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే విధానం మన దేశంలో అమలు చేస్తున్నవారు, అందువల్ల ఇబ్బందిపడుతున్న మహిళలు ఉన్నారు. అలాంటి మహిళలు అయి దుగురు సుప్రీంకోర్టును ఆశ్రయించబట్టే ఆ విధానం చెల్లుబాటు కాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తలాక్‌కు సంబంధించి అమలులో ఉన్న నిర్దిష్ట విధానాలను కూడా తోసిరాజని ఇష్టానుసారం అమలు చేయడం కూడా పెరిగింది. ఫోన్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ మాధ్యమాలద్వారా చెప్పేవరకూ వెళ్లింది. తలాక్ విధానం చెల్లదని మొన్న ఆగస్టులో 3–2 మెజారిటీతో అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు ఇచ్చినప్పుడు అప్పటి చీఫ్ జస్టిస్ ఖేహార్, మరో న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు దాంతో ఏకీభవించకుండా 1,400 ఏళ్లనుంచి అమలవుతున్న విధానంలో జోక్యం చేసుకోవడం మతపరమైన స్వేచ్ఛకు హామీ పడుతున్న రాజ్యాంగంలోని 25(1) అధికరణకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
పెళ్లనేది ఇద్దరి జీవితాలతోపాటు...రెండు కుటుంబాలను ఏకం చేసే వ్యవస్థ. పెళ్లంటే ఆడా మగా మధ్య ఏర్పడే భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు... విస్తృతార్ధంలో ఇద్దరూ కలిసి ఉమ్మడిగా పౌర సమాజం పట్ల నెరవేర్చవలసిన బాధ్యత. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం లేనప్పుడు అది వివాహ వ్యవస్థలోనూ ప్రతిఫలిస్తుంది. వివక్ష, ఆధిపత్య ధోరణులు సంసారాల్లోకి చొరబడతాయి. అత్యధిక సందర్భాల్లో మహిళలనే బాధితులుగా మారుస్తాయి. రాజ్యాంగమైనా, చట్టాలైనా ఇలాంటి వివక్షనూ, ఆధిపత్య ధోరణులనూ అంగీకరించవు. మన చట్టాలు భిన్న మతాలకుండే వైయక్తిక చట్టాలను (పర్సనల్ లా) గుర్తించాయి. కానీ అవి రాజ్యాంగం నిర్వచించిన... చట్టాలు నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే అమలు కావాలన్నది తలాక్ విధానంపై వెలువడిన మెజారిటీ తీర్పు భావన. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసు కురాదల్చుకున్న చట్టం ఆ భావనకు అనుగుణంగా ఉందా? ఈ పిటిషన్లపై మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు లింగ సమానత్వాన్ని, మహి ళల గౌరవాన్ని దెబ్బతీసే ఆచారాలు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి లోబడి చట్టం తీసుకురాదల్చుకుంటే... తలాక్ ద్వారా వివాహబంధాన్ని రద్దు చేసుకోవడం చెల్లుబాటు కాదని ప్రకటిస్తే సరిపోతుంది.
కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొంచెం ముందుకెళ్లింది. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ బిల్లును రూపొందించింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లులోని అంశాలేమిటన్నది మంత్రి శివశంకర్ ప్రసాద్ వివరంగా చెప్పకపోయినా... ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా అకస్మాత్తుగా మూడుసార్లు తలాక్ చెప్పడం ‘చట్టవిరుద్ధం, చెల్లుబాటుకానిది’ అని బిల్లు నిర్దేశిస్తున్నదని వివరించారు. దీన్ని ఆచరిస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటాయని అన్నారు. తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పాక దానికింద విడాకులివ్వడం భర్తలకు సాధ్యం కాదు. పెళ్లనేది భార్యాభర్తల మధ్య ఏర్పడే సివిల్ ఒప్పందం. తాజా తీర్పు తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం భర్తకు సాధ్యం కాదు. అలా చేస్తే దాంపత్య హక్కుల్ని పరిరక్షించుకోవడానికి భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. తలాక్ మాటున భార్యను వేధించినా, హింసించినా, ఆమెకున్న హక్కుల్ని కాలరాసినా అది గృహహింస చట్టం పరిధిలోకొస్తుంది. ఇలాంటి అవ కాశాలున్నప్పుడు మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని దానికదే శిక్షార్హమైన నేరమనడం ఎంత వరకూ సబబు? ఇందువల్ల రాజీ మార్గాలు మూసుకుపోవా? దాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చి, భర్తను జైలుకు పంపితే ఆ భార్యాభర్తలు మళ్లీ కలిసే అవకాశం ఉంటుందా? విడిపోవడానికి సిద్ధపడిన మహిళకు సైతం ఇలాంటి పరిణామాలు ప్రశాంతతనిస్తాయా? సుప్రీంకోర్టు కూడా శిక్షార్హమైన నేరంగా పరి గణించాలని సూచించలేదు. అయితే ఆ తీర్పు వెలువడ్డాక ఇంతవరకూ ఇలాంటి 67 కేసులు తన దృష్టికొచ్చాయని కేంద్రం అంటున్నది. తీర్పు వెలువడినాకో, చట్టం చేశాకో... వెనువెంటనే అందరికీ వాటిపై అవగాహన ఏర్పడుతుందనుకోవడం సరి కాదు. అందుకు సమయం పడుతుంది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) అకస్మాత్తుగా విడాకులిచ్చే పద్ధతికి వ్యతిరేకంగా మొన్న ఏప్రిల్‌లో తీర్మానం చేసింది. ఈ విధానాన్ని పాటించేవారిపై సాంఘిక బహిష్కరణ అమలు చేయాలని పిలుపునిచ్చింది. అటువంటి సంస్థలు, ముస్లిం వర్గాల్లో పలుకుబడిగల ప్రముఖుల సాయంతో తాజా తీర్పుపై అందరిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాల అనంతరం పరిస్థి తేమిటో సమీక్షించి బాధిత మహిళలతో, మహిళా హక్కుల సంఘాలతో, మత సంస్థలతో చర్చించి బిల్లు రూపొందించి ఉంటే బాగుండేది. నిర్భయ ఉదంతం తర్వాత ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ పనిచేసిన తీరును ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. బిల్లుపై పార్లమెంటులో ఎటూ చర్చ ఉంటుంది. కానీ అంతకన్నా ముందు భిన్న వర్గాలతో మాట్లాడితే ప్రభుత్వానికి ఈ సమస్యపై మరింత స్పష్టత ఏర్పడేది. న్యాయం కలగజేయాలన్న ఆత్రుత మంచిదే. కానీ ఆ ఆత్రుతలో మౌలిక ఉద్దేశమే దెబ్బ తినకూడదు.
Comments
Please login to add a commentAdd a comment