న్యూఢిల్లీ: స్వలింగ బంధాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘లైంగిక లక్షణాలు, మొగ్గుదలల మీద వ్యక్తులకు అదుపు ఉండదు. అవి స్వతఃసిద్ధమైనవి. కనుక వాటి ప్రాతిపదికన ప్రభుత్వాలు ఎవరి పట్లా వివక్ష చూపజాలవు’’ అని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్లు పట్టణ, ఉన్నత వర్గ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
స్వలింగ ధోరణి పట్టణ, ఉన్నత వర్గాలకే పరిమితమైనదన్న వాదనను బలపరిచే సాక్ష్యాలేవీ కేంద్రం చూపలేకపోయిందని పేర్కొంది. ‘‘లైంగిక ధోరణి స్వతఃసిద్ధ భావనే తప్ప దానికి సామాజిక, వర్గ ప్రాతిపదికలేవీ ఉండవన్న సీనియర్ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి వాదనతో ఏకీభవిస్తున్నాం. స్వేచ్ఛాయుత వాతావరణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణులు ఎక్కువగా బయటికి కన్పిస్తుండవచ్చు’’ అని అభిప్రాయపడింది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే స్త్రీ పురుషుల పెళ్లీడు, దత్తత వంటివాటిపై పడే ప్రభావంతో పాటు తెరపైకి రాగల పలు ఇతర పరిణామాలను కూడా ధర్మాసనం లోతుగా చర్చించింది. ‘స్వలింగ జంట ఆడయినా, మగయినా పిల్లలను దత్తత తీసుకోవచ్చు. పెరిగే క్రమంలో తమ తల్లుల/తండ్రుల లైంగిక ధోరణి తాలూకు ప్రభావం ఆ పిల్లల మనసులపై ఎలా ఉంటుందన్నది ఆలోచించాల్సిన అంశమే’’ అని అభిప్రాయపడింది.
పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకే
సుప్రీంకోర్టే చొరవ తీసుకుని స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. 142వ అధికరణ కింద రాజ్యాంగం కల్పిచిన ప్లీనరీ అధికారాలను వినియోగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘‘అత్యున్నత న్యాయస్థానికి ఉన్న ప్రతిష్ట, నైతికత దృష్ట్యా సమాజమూ ఈ నిర్ణయాన్ని అంగీకరించి స్వలింగ వివాహాలను ఆమోదిస్తుందన్న విశ్వాసముంది. తద్వారా వారూ సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపగలరు. వితంతు వివాహాలకూ తొలుత సామాజిక ఆమోదం లేదు. కానీ చట్టం చేశాక ఆమోదం లభించింది’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.
కేసులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ వివాహాలపై వైఖరి తెలపాల్సిందిగా రాష్ట్రాలకు లేఖ రాశామని, వాటి అభిప్రాయాలతో నివేదిక సమర్పించేందుకు అనుమతించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment