స్వలింగ సంపర్క చట్టంపై యూఎన్ చీఫ్ హర్షం
ఐక్యరాజ్యసమితి: అమెరికాలో స్వలింగ సంపర్క పెళ్లిళ్లకు చట్టబద్దత కల్పించడంపై ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరి బాన్ కీ మూన్ హర్షం వ్యక్తం చేశారు. యూఎస్ లోని 50 రాష్ట్రాల్లో స్వలింగ సంపర్క పెళ్లిళ్లకు ఆమోద ముద్ర లభించడం నిజంగానే మానవహక్కుల పరిరక్షణలో ఓ భాగమని ఆయన స్పష్టం చేశారు. గేలు మరియు లెస్బియన్స్ కు చట్టపరంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకారం లభించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆయన పేర్కొన్నారు.
స్వలింగ సంపర్క చట్టంపై అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశంలో నివసించే స్వలింగ సంపర్క పౌరులకు ఇది చట్టపరంగా లభించిన హక్కుగా తెలిపింది. ఇప్పటికీ 14 రాష్ట్రాల్లో స్వలింగ సంపర్క చట్టంపై నిషేధం కొనసాగడంపై ధర్మాసనం తనదైన శైలిలో స్పందించింది. వారిపై బలవంతంగా నిషేధం విధించాలని ప్రయత్నించినా అది ఎంతో కాలం నిలవదని పేర్కొంది. గత సంవత్సరం నవంబర్ లో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.