రెచ్చగొట్టిన నగ్మా... మౌనంగా కుష్బు
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో ఇద్దరు స్టార్స్ మధ్య వార్ వెలుగులోకి వచ్చింది. వేదికపై పక్క పక్కనే ఒకటిగా కూర్చున్న వాళ్లు, ఆ తర్వాత కయ్యానికి కాలు దువ్వుకోవడం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఈ స్టార్స్ ఎవరో కాదు, ఒకరు కుష్బు, మరొకరు నగ్మా. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నగ్మా స్పందిస్తే... కళ్లతో చూడలేదు, చెవులతో వినలేదంటూ కుష్బు దాట వేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతల్ని ఏకం చేసి ఒకే వేదిక మీద కూర్చోబెట్టడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. పార్టీలో సినీ స్టార్స్‌గా, జాతీయస్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నాయకుల్ని సైతం ఆ వేదిక మీదకు ఎక్కించి, ఐక్యత అంటే తమదే అని చాటుకున్నారు.
ఉదయం సాగిన ఐక్యత, అదే రోజు సాయంత్రానికి పటాపంచలు అయినట్టుంది. శుక్రవారం ఉదయం నిరసనకు హాజరైన కుష్బు.. సాయంత్రం నగ్మా నేతృత్వంలో సత్యమూర్తి భవన్ వేదికగా సాగిన మహిళా కాంగ్రెస్ సమాలోచనకు గైర్హాజరైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన నగ్మా.. సమాలోచన సమావేశంలో కుష్బును ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడింది. అంతేకాకుండా.. ఉమ్మడి పౌర స్మృతి గురించి కుష్బు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి నగ్మా సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధిష్టానం వైఖరికి భిన్నంగా ఉమ్మడి పౌరస్మృతిపై కుష్బు స్పందించిన విషయం తెలిసిందే.
స్టార్ వార్: కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతలు తాజాగా ఒకే వేదిక మీదకు రాగా.. జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నేతలు మాత్రం ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకోవడం పార్టీలో కొత్త చర్చకు తెర లేపింది. మహిళా కాంగ్రెస్ సమావేశంలో నగ్మా తీవ్రంగా స్పందించిన వ్యాఖ్యలకు కొన్ని తమిళ పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సినిమాల్లో బొట్టు పెట్టుకుని నటించవచ్చు కానీ, వాస్తవిక జీవితంలో ఏ ముస్లిం మహిళ అలా చేయదని, అయినా, హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న వాళ్లకు ముస్లిం చట్టాల గురించి ఏమి తెలుసునంటూ కుష్బును ఉద్దేశించి నగ్మా మండిపడ్డారు. షరియత్ గురించి అసలు ఏమి తెలుసునని, ఉమ్మడి పౌర స్మృతికి మద్దతుగా కుష్బు ఆ వ్యాఖ్యలు చేశారో తెలుపాలంటూ మండిపడ్డారు. ఉదయం జరిగిన నిరసనకు హాజరైన వాళ్లకు , సాయంత్రం జరిగిన సమావేశానికి వచ్చే తీరిక లేదా..? అని కుష్బుపై నగ్మా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వాళ్లకు పదవులు అంటూ తీవ్రంగానే నగ్మా స్పందించినా, కుష్బు మాత్రం కళ్లతో చూడలేదు...చెవులతో వినలేదంటూ ఆమె వ్యాఖ్యలను తోసిపుచ్చడం గమనార్హం.