నాదంటే నాదంటున్న నగ్మా, కుష్బు | kushboo and nagma fighting on mylapore constituency nomination papers | Sakshi
Sakshi News home page

నాదంటే నాదంటున్న నగ్మా, కుష్బు

Published Thu, Feb 18 2016 8:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

నాదంటే నాదంటున్న నగ్మా, కుష్బు - Sakshi

నాదంటే నాదంటున్న నగ్మా, కుష్బు

కాంగ్రెస్‌లో కుమ్ములాట
ముగిసిన దరఖాస్తుల పర్వం

 
 చెన్నై: డీఎంకేతో కూటమి ఖరారైందే అదనుగా ఒకే స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుమ్ములాట మొదలైంది. చెన్నై నగరం మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నాకంటే నాకంటూ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు కుమ్ములాటకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఇద్దరూ వెండితెర వేలుపులే కావడం విచిత్రం. చెన్నై మైలాపూర్ నియోజకవర్గాన్ని కూటమి పార్టీల కేటాయించడం డీఎంకేలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-బీజేపీ కూటమిగా ఏర్పడగా బీజేపీ అభ్యర్థి కేఎన్ లక్ష్మణన్ మైలాపూర్ స్థానం నుంచి గెలుపొందారు.
 
2011  అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే పొత్తులో మైలాపూర్‌ను కాంగ్రెస్‌కే కేటాయించారు. అయితే ఈ స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అగ్రనేత తంగబాలు పరాజయం పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్, డీఎంకేల మధ్య పొత్తును ఇటీవలే గులాంనబీ ఆజాద్ ఖరారు చేయడంతో రెండు పార్టీల నేతలు సీట్ల వెతుకులాటలో పడ్డారు. డీఎంకే సిద్ధాంతం ప్రకారం మైలాపూర్ స్థానం కాంగ్రెస్‌కేనని తేలిపోవడంతో ఇద్దరు నటీమణులు కన్నేశారు. నటి కుష్బు ఇల్లు ఇదే నియోజకవర్గ పరిధిలోని శాంతోమ్‌లో ఉంది.
 
 తాను నివాసం ఉంటున్న ప్రాం తం, ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తినపుడు సొంత ఖర్చుతో బాధితులకు సాయం చేయడం వంటి అనుకూలమైన అంశాలు ఉన్నందున కుష్బు కోరుతున్నారు. మైలాపూర్ నుండి కుష్బు పోటీచే సినట్లయితే గెలుపు ఖాయమని ఆమె అనుచరులు సైతం ఆశిస్తున్నారు. అంతేగాక మయిలై అశోక్ అనే కుష్బు అభిమాని ఆమె పేరున కాంగ్రెస్‌కు దరఖాస్తు కూడా దాఖలు చేసి ఉన్నా రు.    అలాగే నటి నగ్మా సైతం తన లెక్కలు తాను చెబుతున్నారు. నగ్మా సోదరి జ్యోతిక మైలాపూర్ నియోజవర్గం పరిధిలోని బీసెంట్ నగర్‌లో కాపురం ఉంటున్నారు.
 
 చెన్నైకి వచ్చినపుడల్లా సోదరి ఇంటిలోనే ఆమె ఉంటారు. ఈ కారణాన్ని చూపి మైలాపూర్ కోసం నగ్మా కూడా పట్టుదలతో ఉన్నారు. మైలాపూర్ నుంచి పోటీకి అనుమతివ్వాల్సిందిగా  జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షోబా ఓజాను నగ్మా కోరారు. అయితే ఆమె ఇందుకు తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సోనియా, రాహూల్ వద్దకు తీసుకెళ్లి ఒప్పించాలని నగ్మా ప్రయత్నాల్లో ఉన్నారు. మైలాపూర్ స్థానం కోసం పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం నగ్మా సిద్ధమయ్యారు. పార్టీ పరంగా చూసుకుంటే కుష్బు కంటే నగ్మా సీనియర్ నేత. ఒకే స్థానానికి ఇద్దరు మహిళా నేతలు, పైగా ఇద్దరూ వెండితెరను ఏలి ప్రజాబాహుళ్యంలో ప్రచారం ఉన్నవారు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ తలనొప్పిగా మారింది.
 
 
 సత్యమూర్తి భవన్‌లో సందడి: మైలాపూర్ స్థానానికి పోటీపడుతున్న నగ్మా, కుష్బులు బుధవారం సత్యమూర్తి భవన్‌లో తమ తమ వర్గంతో సందడి చేశారు. వీరిద్దరితోపాటు టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ కూడా ఉండి కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై అసెంబ్లీకి పోటీచేయగోరు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ఈనెల 10వ తేదీ నుంచి సత్యమూర్తి భవన్‌లో సాగుతోంది. డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదరగానే దరఖాస్తు చేసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఈనెల 15వ తేదీతో ముగిసిన గడువును బుధవారం (17వ తేదీ)వరకు పొడిగించారు. ఈ లెక్కన బుధవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్యమూర్తి భవన్‌కు చేరుకుని తమ దరఖాస్తులను అందజేశారు.
 
దీంతో దరఖాస్తుల పర్వం ముగిసింది. డీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తానని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నగ్మా ప్రకటించారు. రెండు అవినీతి పార్టీలు ఏకమయ్యాయంటూ డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విమర్శలు గుప్పించారు. అయితే డీఎండీకే తమ కూటిమిలో చేరుతుందని ఇళంగోవన్ విశ్వాసం వెలిబుచ్చారు. ప్రేమలత వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోం, ఎందుకంటే పార్టీ అధినేత విజయకాంత్ మాత్రమే, ఆయన మాతో వస్తారని నమ్మకం ఉందన్నారు.                      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement