Tamil Nadu Congress
-
మహిళా నేతల ముష్టియుద్ధం
చెన్నై: పురుషులకు తామేమీ తీసి పోమన్నట్టుగా మహిళా కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు ముష్టియుద్ధానికి దిగారు. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్ వేదికగా బుధవారం సాగిన మహిళా నేతల కొట్లాట అక్కడున్న నాయకులను విస్మయానికి గురిచేసింది. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ చెన్నైకు వచ్చినప్పుడు మహిళా కాంగ్రెస్ తరపున సత్యమూర్తి భవన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు పెట్టారు. తిరువళ్లూరు జిల్లాకు చెందిన మహిళా నేత గౌరి గోపాల్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మహిళా విభాగం జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ పేరు, ఫోటో గల్లంతయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరి గోపాల్‌ను పదవి నుంచి హసీనా తొలగించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, బుధవారం ఉదయం సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో హసీనా సయ్యద్ నోరు జారారు. తనను విస్మరిస్తే, ఏంజరిగిందో చూశారుగా అంటూ వ్యాఖ్యానించడంతో వివాదం రాజుకుంది. గౌరి గోపాల్‌కు మద్దతుగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ రాణి స్పందించడంతో వాగ్వాదం మొదలైంది. అదే సమయంలో అక్కడే ఉన్న గౌరి గోపాల్ మద్దతుదారులు హసీనా సయ్యద్‌పై తిరగబడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హసీనా సయ్యద్, ఝాన్సీ రాణి ముష్టియుద్ధానికి దిగడంతో వారించేందుకు వారి భర్తలు రంగంలోకి దిగారు. ఈ సమయంలో హసీనా సయ్యద్ భర్త ఉమర్‌ను టార్గెట్ చేసిన గౌరి గోపాల్, ఝాన్సీ రాణిలు చేయి చేసుకున్నారు. అనంతరం హసినా, ఉమర్‌లను సమావేశ మందిరం నుంచి తరిమి కొట్టడంతో బయటకు పరుగులు తీశారు. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అక్కడున్న పార్టీ వర్గాలు కంగుతిన్నాయి. చివరకు పోలీసులు రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దారు. భద్రత నడుమ హసీనా సయ్యద్ అక్కడి నుంచి బయటకు వెళ్లి పోయారు. తన మీద పనిగట్టుకుని దాడి చేశారంటూ ఢిల్లీకి ఫిర్యాదు చేయడానికి ఆమె సిద్ధం అయ్యారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సమక్షంలో ఈ గొడవ మొదలైనట్టు సమాచారం. ఆయన తప్పుకోవడంతో మహిళలు మరింతగా రెచ్చి పోయారని సత్యమూర్తి భవన్ వర్గాల్లో చర్చ. ఈ ఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటానని తిరునావుక్కరసర్ పేర్కొన్నారు. -
రెచ్చగొట్టిన నగ్మా... మౌనంగా కుష్బు
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో ఇద్దరు స్టార్స్ మధ్య వార్ వెలుగులోకి వచ్చింది. వేదికపై పక్క పక్కనే ఒకటిగా కూర్చున్న వాళ్లు, ఆ తర్వాత కయ్యానికి కాలు దువ్వుకోవడం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఈ స్టార్స్ ఎవరో కాదు, ఒకరు కుష్బు, మరొకరు నగ్మా. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నగ్మా స్పందిస్తే... కళ్లతో చూడలేదు, చెవులతో వినలేదంటూ కుష్బు దాట వేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతల్ని ఏకం చేసి ఒకే వేదిక మీద కూర్చోబెట్టడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. పార్టీలో సినీ స్టార్స్‌గా, జాతీయస్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నాయకుల్ని సైతం ఆ వేదిక మీదకు ఎక్కించి, ఐక్యత అంటే తమదే అని చాటుకున్నారు. ఉదయం సాగిన ఐక్యత, అదే రోజు సాయంత్రానికి పటాపంచలు అయినట్టుంది. శుక్రవారం ఉదయం నిరసనకు హాజరైన కుష్బు.. సాయంత్రం నగ్మా నేతృత్వంలో సత్యమూర్తి భవన్ వేదికగా సాగిన మహిళా కాంగ్రెస్ సమాలోచనకు గైర్హాజరైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన నగ్మా.. సమాలోచన సమావేశంలో కుష్బును ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడింది. అంతేకాకుండా.. ఉమ్మడి పౌర స్మృతి గురించి కుష్బు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి నగ్మా సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధిష్టానం వైఖరికి భిన్నంగా ఉమ్మడి పౌరస్మృతిపై కుష్బు స్పందించిన విషయం తెలిసిందే. స్టార్ వార్: కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతలు తాజాగా ఒకే వేదిక మీదకు రాగా.. జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నేతలు మాత్రం ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకోవడం పార్టీలో కొత్త చర్చకు తెర లేపింది. మహిళా కాంగ్రెస్ సమావేశంలో నగ్మా తీవ్రంగా స్పందించిన వ్యాఖ్యలకు కొన్ని తమిళ పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సినిమాల్లో బొట్టు పెట్టుకుని నటించవచ్చు కానీ, వాస్తవిక జీవితంలో ఏ ముస్లిం మహిళ అలా చేయదని, అయినా, హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న వాళ్లకు ముస్లిం చట్టాల గురించి ఏమి తెలుసునంటూ కుష్బును ఉద్దేశించి నగ్మా మండిపడ్డారు. షరియత్ గురించి అసలు ఏమి తెలుసునని, ఉమ్మడి పౌర స్మృతికి మద్దతుగా కుష్బు ఆ వ్యాఖ్యలు చేశారో తెలుపాలంటూ మండిపడ్డారు. ఉదయం జరిగిన నిరసనకు హాజరైన వాళ్లకు , సాయంత్రం జరిగిన సమావేశానికి వచ్చే తీరిక లేదా..? అని కుష్బుపై నగ్మా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వాళ్లకు పదవులు అంటూ తీవ్రంగానే నగ్మా స్పందించినా, కుష్బు మాత్రం కళ్లతో చూడలేదు...చెవులతో వినలేదంటూ ఆమె వ్యాఖ్యలను తోసిపుచ్చడం గమనార్హం. -
కొత్త కాంక్ష !
సాక్షి, చెన్నై : ప్రజాహితాన్ని కాంక్షించే రీతిలో తమిళనాడు కాంగ్రెస్ సరికొత్త అంశాలతో మేనిఫెస్టోను రూపొందించింది. డీఎంకే సూచించిన కొన్ని అంశాల్ని క్రోడీకరించి, మరికొన్ని కొత్త నినాదాలతో ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం ప్రకటించారు. డీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కాంగ్రెస్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డీఎంకే మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతోంది. ఈ పరిస్థితుల్లో తమకంటూ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందించింది. కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ నేతృత్వంలో రూపొందించిన ప్రజాహిత మేనిఫెస్టోను ఉదయం సత్యమూర్తి భవన్లో విడుదల చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ మేనిఫెస్టో విడుదల చేయగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్, అధికార ప్రతినిధి కుష్బు, నేతలు కృష్ణస్వామి, తంగబాలు, కృష్ణమూర్తి, గోపన్న, రంగభాష్యం అందుకున్నారు. తదుపరి ఆ మేని ఫెస్టోలోని అంశాలను వివరించారు. మేనిఫెస్టోలో కొన్ని... రాష్ట్రంలో మళ్లీ పెద్దల సభ పునరుద్ధరణకు చర్యలు. ఇందులో హిజ్రాలు, అంధులకు ప్రాతినిథ్యం. లోకాయుక్తా ఏర్పాటుకు చర్యలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాగానే, తొలి సంతకంగా మద్యనిషేధం అమలు లక్ష్యంగా ఒత్తిడి మద్యం బానిసుల పునరావాసానికి మండలానికి ఒక కేంద్రం ఏర్పాటు. సారా తయారు చేస్తే కఠిన చర్యలకు చట్టాలు. బిందు సేద్యానికి వంద శాతం రాయితీ. కరువు, విపత్తులతో తల్లడిల్లుతున్న అన్నదాతలు జాతీయ, సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాల మాఫీకి చర్యలు సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తికి వంద శాతం రాయితీ. 60 ఏళ్లు పైబడ్డ అన్నదాతలకు నెలకు రూ.రెండు వేలు పింఛన్. చెరువులు, కాలువలు, నదీ పరివాహక ప్రదేశాల్లో పూడికతీత. ఆ మట్టి పంట పొలాలకు ఉచితంగా తరలింపు ఫ్రీ కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య లక్ష్యంగా చర్యలు. విద్యా వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక. జిల్లాకు ఒక నవోదయ స్కూల్ ఏర్పాటు విద్యుత్ ఉత్పత్తి పెంపునకు చర్యలు. అన్నదాతలకు ఇచ్చే తరహాలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌కు చర్యలు. చేనేత ఉత్పత్తుల పెంపునకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు మహిళా రిజర్వేషన్ 33 నుంచి 50 శాతం పెంపునకు చర్యలు స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల రాయితీ కల్పనకు చర్యలు తమిళ జాలర్లకు నిషేధ కాలంలో రోజుకు రూ. 150 చొప్పున, 45 రోజులకు రూ. 6500 వర్తింపునకు ఒత్తిడి ఉప్పు ఉత్పత్తి కార్మికులకు వర్షా కాలంలో సహాయం. ప్రమాదాల్లో మరణించే కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. ఐదు లక్షలు పంపిణీకి చర్యలు ఉద్యోగ అవకాశాల్లో వికలాంగులకు మూడు శాతం కేటాయింపు. ఉద్యోగాలు లేని వికలాంగులకు నెలకు రూ.1,500 పింఛన్. వృద్ధాప్య పింఛన్ రూ.రెండు వేలకు పెంపు. ఉచిత బస్సు పయనం. హిజ్రాలకు రెండు శాతం కేటాయింపులు కూవం నది పునరుద్ధరణ. తిరుచ్చి,కోయంబత్తూరు, మదురై, సేలం నగరాలకు మెట్రో రైలు విస్తరణ. నడిగర్ తిలగం శివాజీ గణేషన్‌కు మణి మండపం. అక్టోబరు ఒకటి ఆయన జయంతిని కళాదినోత్సవంగా ప్రకటనకు చర్యలు. కోర్టు సూచనలతో మెరీనా తీరంలోని మహాత్మాగాంధీ, దివంగత కామరాజర్‌ల విగ్రాహలకు మధ్యలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు. నదుల అనుసంధానం తదితర అంశాలను తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. -
జైలుకెళ్లేందుకు సిద్ధమే!
►అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిమయం ► 25 శాఖల్లో అవినీతిపై పుస్తకం విడుదల చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి సామ్రాజ్యమనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఈ విషయంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ సవాల్ విసిరారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో 25 శాఖలు అవినీతిమయమని పేర్కొంటూ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. చెన్నై రాయపేటలోని సత్యమూర్తి భవన్లో గురువారం జరిగిన పార్టీ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి వివరాలతో గత ఏడాది మేలో రాష్ట్ర గవర్నర్ కే రోశయ్యకు ఒక వినతిపత్రం సమర్పించానని తెలిపారు. అయితే ఫిర్యాదు చేసి ఏడునెలలు దాటినా ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. దీంతో మరో పట్టికను తయారుచేసి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అవినీతి వివరాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళుతున్నామని చెప్పారు. పుస్తకాన్ని బాగా చదివితే అవినీతి ఆరోపణలపై ఆధారాలు లభిస్తాయని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ అవినీతి చర్యలను వెల్లడి చేయడం ఎంతమాత్రం తప్పుకాదని ఆయన అన్నారు. గవర్నర్ ఏదైనా చర్యలు తీసుకుంటారని ఆశించి భంగపడ్డామని వ్యాఖ్యానించారు. వ్యవసాయాధికారి ముత్తుకుమారస్వామి ఆత్మహత్య కేసులో ఆశాఖ మంత్రిని మాత్రమే తొలగించారు, సీబీఐ విచారణకు ఆదేశించలేదేమని ప్రశ్నించారు. అవినీతి వ్యవహారాలపై ప్రజాకోర్టులోనే చర్చించి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమెనామని తెలిపారు. న్యాయస్థానాల కంటే ప్రజాస్థానాలనే తాను ఎక్కువగా నమ్ముతానని అన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం పరువునష్టం దావాలు, బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. మీడియా గొంతును సైతం నొక్కుతోందని అన్నారు. అయితే తాను ఎంతమాత్రం బెదిరేది లేదు అవసరమైతే కోర్టు, జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమని ఇళంగోవన్ సవాల్ చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన అవినీతి పుస్తకంలో సీఎం జయ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖలతో కలుపుకుని మొత్తం 25 శాఖల పేర్లను ప్రస్తావించారు. -
నేను పులిని.. రెచ్చగొడితే పంజా విసురుతా
" నేను పులిని...నన్ను రెచ్చగొట్టొదు...పంజా విసురుతా.."అని పార్టీలో తనను విమర్శిస్తున్న వారిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు హెచ్చరించారు. ఆమె ఖ్యలతో గ్రూపు నేతల మద్దతు మహిళా నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయ వివాదం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌ను పదవీచ్యుతుడ్ని చేయడానికి గ్రూపు నేతలు రచించిన పథకం అధికార ప్రతినిధి కుష్భు రూపంలో బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో కీలక నేతగా అవతరిస్తున్న కుష్భుకు ఢిల్లీ పెద్దల వద్ద మంచి గుర్తింపు ఉంది. ఆమె సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏఐసీసీ సిద్ధం అయింది. ఈ సమయంలో ఈవీకేఎస్‌కు అండగా అధిష్టానం పెద్దల వద్ద కుష్భు వాదన విన్పించినట్టు సమాచారం. కుష్భు అండతో ఈవీకేఎస్‌కు పదవీ గండం తాత్కాలికంగా తప్పినట్టు అయింది. కుష్భు మీద విమర్శలు ఎక్కుపెట్టే పనిలో గ్రూపుల నేతల మద్దతు మహిళా నాయకులు సిద్ధమయ్యారు. కొందరు మహిళా నాయకులు కుష్భుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలను సంధించారు. వారికి సమాధానం ఇస్తూ 'నేను పులిని...నాతో పరాచకాలు వద్దు...రెచ్చగొడితే పంజా విసురుతా' అంటూ కాంగ్రెస్ కొంగు మహానాడులో కుష్బు తీవ్రంగానే స్పందించారు. ఈరోడ్ వేదికగా శుక్రవారం జరిగి మహానాడులో కుష్భు తనదైన శైలిలో తీవ్రంగానే స్పందించారు. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్లో కార్యకర్తల సందడే కన్పించేది కాదని, ఈవీకేఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత రోజుకు మూడు వందల మంది వరకు కార్యకర్తలు వచ్చి వెళ్తున్నారని వివరించారు. పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నందునే ఈవీకేఎస్‌కు తాను అండగా నిలిచానని స్పష్టం చేశారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ కార్యకర్తలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలన్న కాంక్ష వారిలో ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాను చాటుకునే రీతిలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తమ నేత రాహుల్ గాంధీ ప్రజల్లో తిరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల్లో మునిగి ఉన్నారని విమర్శించారు. డీఎంకే అధినేత కరుణానిధి అంటే తనకు ఎంతో మర్యాద అని, తాను ఆ పార్టీలో నుంచి ఎందుకు బయటకు వచ్చాననే విషయం ఆయనకు తెలుసునని, ప్రత్యేకంగా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నానని చెప్పారు. కుష్భు ప్రసంగానికి మహానాడులో హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి. ఈవీకేఎస్ మద్దతు వర్గం ఆనందం వ్యక్తం చేసింది. -
గ్రూపు రచ్చ
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో గ్రూపుల రచ్చ ఢిల్లీకి చేరింది. చిదంబరం ఫిర్యాదుతో రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీకి పరుగులు తీశారు. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లతో చిదంబరం మద్దతు దారులు దాడికి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఈ వివాదాలే ఆ పార్టీకి గడ్డు పరిస్థితులను కల్పించాయి. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ తమిళ మానిల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం మరింత తగ్గింది. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ బాధ్యతలు చేపట్టిన క్షణాల్లో వాసన్ వ్యతిరేక శక్తులందరూ ఏకమయ్యారు. తామంతా ఐక్యతతో బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ప్రగల్బాలు పలికారు. ఈ ఐక్యతను చాటుకుని నెలలు గడవక ముందే, మళ్లీ గ్రూపులు రచ్చకెక్కాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గానికి షాక్‌లు ఇచ్చేరీతిలో ఈవీకేఎస్ మద్దతు దారులు గళాన్ని పెంచారు. ఈ వ్యాఖ్యల యుద్ధం చివరకు తారా స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో మరో మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్‌కు టాటా చెప్పడంతో పాటుగా అటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ మీద దుమ్మెత్తి పోసి వెళ్లారు. ఇందుకు స్పందించిన ఈవీకేఎస్ నోరు జారారు. చిదంబరంతో కయ్యానికి కాలు దువ్వుతూ తీవ్రంగానే స్పందించడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. చిదంబరం ఫిర్యాదు : జయంతి నటరాజన్ బయటకు వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టం లేదని ఈవీకేఎస్ వ్యాఖ్యానించారు. ఆమె బాటలోనే తండ్రి, తనయుడు నడిస్తే రాష్ర్ట కాంగ్రెస్‌కు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని పరోక్షంగా చిదంబరం, ఆయన తనయుడు కార్తీలను ఉద్దేశించి ఈవీకేఎస్ వ్యాఖ్యానించ డం ఢిల్లీకి చేరింది. తనను, తన కుమారుడిని పార్టీ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించే అధికారం ఈవీకేఎస్‌కు ఎవరు ఇచ్చారంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చిదంబరం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఫలితంగా, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఓ పెద్ద గ్రూపే బయలుదేరడం గమనార్హం. ఢిల్లీకి పరుగు : ఈవీకేఎస్ను తప్పించాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఢిల్లీకి ఫిర్యాదులు చేశారుు. ఈవీకేఎస్ రూపంలో వాసన్ బయటకు వెళ్లాల్సి వచ్చిందని, జయంతి నటరాజన్ అదే బాటలో పయనించారని పేర్కొన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఢిల్లీకి నుంచి పిలుపు రావడంతో ఆగమేఘాలపై విమానం ఎక్కాల్సిన పరిస్థితి ఈవీకేఎస్‌కు ఏర్పడింది. ఉదయాన్నే ఢిల్లీకి పరుగులు తీసిన ఈవీకేఎస్ అధినేత్రిని, యువరాజును కలుసుకుని తన వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. సోనియా , రాహుల్ గాంధీ ఈవీకేఎస్‌కు తీవ్రంగానే క్లాస్ పీకినట్టుగా వచ్చిన సంకేతాలతో చిదంబరం వర్గం పోస్టర్ల హల్చల్ సృష్టించే పనిలో పడింది. పోస్టర్లతో : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఈవీకేఎస్ను ఉద్దేశించి తీవ్రంగానే ఆ పోస్టర్లలో స్పందించారు. ఈవీకేఎస్ను ఖండించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోస్టర్లు వెలిశారుు. చిదంబరం మద్దతు నాయకుడు ఎస్ఎం కుమార్ పేరిట చెన్నై నగరంలో పలు చోట్ల గోడలకెక్కిన ఈ పోస్టర్లు ఈవీకేఎస్ వర్గంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నారుు. ఈ పోస్టర్ల వివాదం మరిన్ని ఎపిసోడ్లుగా సాగబోతుందో వేచి చూడాల్సిందే. తమ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి వచ్చిన పిలుపుతో ఢిల్లీకి వెళ్ల లేదని ఈవీకేఎస్ వర్గం పేర్కొంటోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈవీకేఎస్, మహిళా నాయకురాలు, నటి కుష్భు ప్రచారం చేపట్టబోతున్నారని, అందుకే ఆ ఇద్దరు వేర్వేరుగా ఢిల్లీ బాట పట్టినట్టు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్‌లో ముసలం
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు కాంగ్రెస్‌లో చిదంబరం రూపంలో కొత్త ముసలం బయలుదేరింది. మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ కొత్త పార్టీ స్థాపనతో బలహీనపడిన రాష్ట్రశాఖ, పీ చిదంబరం వేరుకుంపటితో మరో చీలిక ఏర్పడనుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్, పీ చిదంబరం, తంగబాలు, కృష్ణస్వామి, ఇళంగోవన్ ఇలా అనేక వర్గాలు ఉన్నాయి. ఎవరి బలాలు వారికున్నాయి. జీకేవీ అనుచురుడైన జ్ఞానదేశికన్ టీఎన్సీసీఅధ్యక్షులుగా ఉన్నపుడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనియర్ నేత జీకే మూపనార్ బొమ్మలను ప్రచారాల్లో వాడరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ ఆదేశాలు కామరాజర్, మూపనార్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించారుు. ఇదే అదనుగా మూపనార్ తనయుడు జీకే వాసన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఏకంగా వేరే పార్టీనే పెట్టేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే పార్టీలో చేరిపోయారు. జీకే వాసన్ వేరుకుంపటి కారణంగా వలసబాట పట్టిన 23 జిల్లాల్లోని అధ్యక్ష స్థానాలను తనవర్గం వారితో భర్తీ చేయాలని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్‌ను పీ చిదంబరం కోరారు. అయితే ఇందుకు ఇళంగోవన్‌తోపాటూ ఇతర వర్గ నేతలు సైతం సమ్మతించలేదు. తన మాటను కాదన్నారన్న అక్కసుతో ఇళంగోవన్‌పై అధిష్టానానికి చిదంబరం ఫిర్యాదులు చేశారు. అధిష్టానం చిదంబరం ఫిర్యాదులను లెక్కచేయకపోగా మందలించినట్లు వ్యవహరించింది. రాష్ట్రంలో కామరాజనాడార్ పాలనను తీసుకువస్తామని చేస్తున్న కాంగ్రెస్ ప్రచారాలను కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తప్పుపట్టారు. పార్టీ సమావేశాల్లోనే విమర్శలు గుప్పించారు. ప్రజాకర్షణ కలిగిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడ అని వ్యాఖ్యానించారు. తన అనుచరులతో ఈనెల 22న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నారు. కార్తీ వ్యాఖ్యలు, ఇళంగోవన్ షోకాజ్ నోటీసు వెనుక ఇరువర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతున్న విషయం బట్టబయలైంది. తన కుమారుడి ముసుగులో అసంతృప్తిని వెళ్లగక్కిన చిదంబరం కాంగ్రెస్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త పార్టీ పెట్టడమా, గతంలో ఉన్న ప్రజా కమిటీని పునరుద్ధరించడమా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. చిదంబరం కొత్త పార్టీ ఆలోచనల సమాచారం తెలిసినందునే కార్తీకి ఇళంగోవన్ షోకాజ్ నోటీసు జారీచేశారని తెలుస్తోంది. అధిష్టానానికే ఆ హక్కు: కార్తీ తాను ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నా అధిష్టానానికి మాత్రమే తాను సంజాయిషీ ఇచ్చుకుంటానని కార్తీ చిదంబరం మంగళవారం వ్యాఖ్యానించారు. పార్టీకి విరుద్ధంగా తానేదైనా తప్పు చేసి ఉంటే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం టీఎన్‌సీసీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. చిదంబరానికి ఓట్లు పడవు : ఇళంగోవన్ కార్తీ చిదంబరం ఆశిస్తున్నట్లుగా ఆయన తండ్రి చిదంబరాన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కూడా ఓట్లు పడవని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ మంగళవారం ఎద్దేవా చేశారు. కామరాజనాడార్‌ను విమర్శించడమేగాక కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రిగా ఆయన పాలన ముగిసిన అనంతరం పుట్టిన కార్యకర్తలతో జీ 67 (1967) పేరుతో సమావేశం నిర్వహించడం శోచనీయమన్నారు. కామరాజర్ తరువాత సీఎం అభ్యర్థిగా ప్రకటించే స్థాయి గల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో లేడని ఆయన వ్యాఖ్యానించారు. పీ చిదంబరం పార్టీని వీడిపోయినా నష్టం లేదన్నారు. ఆనాడు రాజాజీ వెళితేనే పార్టీకి ఏమీ కాలేదని చెప్పారు. కాంగ్రెస్‌కు అంటూ రాష్ట్రంలో కొన్ని ఓట్లు ఉన్నాయని, చిదంబరంను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పడే ఓట్లు కూడా పడవని ఎద్దేవా చేశారు. -
నేడు జీకేవీ పార్టీ పతాకావిష్కరణ
తిరుచ్చిలో 28న పార్టీ ప్రకటన బహిరంగ సభ విజయవంతానికి భారీ సన్నాహాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు కాంగ్రెస్‌తో విభేదించి వెలుపలకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ నేడు (బుధవా రం) కొత్త పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 28న తిరుచ్చిరాపల్లిలో పార్టీపేరు ప్రకటనకు భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత జీకే మూపనార్ అధిష్టాన నిర్ణయాలను విబేధించి తమిళమానిల కాంగ్రెస్ (తమాకా)ను స్థాపించారు. కొన్నేళ్లపాటూ అప్రతిహతంగా సాగినప్పటికీ, మూపనార్ మరణం తరువాత ఆయన తనయుడు జీకే వాసన్ తమాకాను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా, జీకే వాసన్ వర్గీయుడైన టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్పై నిందలు మోపారు. అప్పటి నుంచి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న జీకే వాసన్ అవకాశం కోసం ఎదురుచూశారు. ఇటీవల టీఎన్‌సీసీలో సంస్థాగత సభ్యత్వ స్వీకరణ మొదలుకాగా, సభ్యత్వ కార్డులో మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, జీకే మూపనార్ బొమ్మలు తొలగించాలని అధిష్టానం ఆదేశించింది. తన తండ్రికి, కాంగ్రెస్ పితామహుడైన కామరాజనాడార్కు అవమానం జరిగిందనే భావనతో జీకేవాసన్, జ్ఞానదేశికన్ నెలక్రితం కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. కొత్త పార్టీకి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. పార్టీపేరుపై ఉత్కంఠ తమిళనాడు ప్రజలకు చిరపరిచితమైన తమిళ మానిల కాంగ్రెస్‌ను పునరుద్ధరిస్తారా లేక కొత్త పార్టీని పెడతారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జీకేవీ అనుచరులు రెండు అభిప్రాయాలను బలపరిచారు. తమాకా తమిళనాడు శాఖను కాంగ్రెస్‌లో విలీనం చేసినా పుదుచ్చేరి శాఖ మరో వ్యక్తి సారథ్యంలో కొనసాగడం జీకేవీని ఇరుకున పడేసింది. తమాకానే కావాలనుకుంటే పుదుచ్చేరి శాఖలో చేరి తమిళనాడుకు విస్తరించడం లేదా పుదుచ్చేరి శాఖను రద్దుచేయించడం.. ఈ రెండే మార్గాలని ఎన్నికల కమిషన్ జీకేవీకి సూచించింది. ఇంతకూ జీకే వాసన్ ఏ నిర్ణయం తీసుకున్నారో ఇప్పటివరకు వెల్లడించలేదు. నేడు పతాకావిష్కరణ ఈనెల 28వ తేదీన తిరుచ్చిలో పార్టీని ప్రకటిస్తున్న నేపథ్యంలో మంగళవారం చెన్నై మైలాపూర్‌లో కార్మికుల విభాగ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలపై రూపొందించిన సీడీని జీకేవీ ఆవిష్కరించగా, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తొలికాపీని అందుకున్నారు. అనంతరం జీకే వాసన్ మాట్లాడుతూ, తమ అభిమానులంతా తమిళ మానిల కాంగ్రెస్‌నే కోరుకుంటున్నారని, అయితే ఎన్నికల కమిషన్ ఆమోదంతో పార్టీని ప్రకటించనున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 10 గంటలకు చెన్నైలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుచ్చిలోని జీ కార్నర్ మైదానంలో పార్టీ ఆవిర్భావ బహిరంగ వేదిక నిర్మాణపు పనులు భారీ ఎత్తున సాగుతున్నాయి. పార్టీ నేతలు ఆశీనులయ్యేందుకు 20వేల కుర్చీలు సిద్ధం చేస్తున్నారు. 27వ తేదీన జీకేవాసన్ తిరుచ్చి చేరుకుంటున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో బహిరంగ సభను ప్రారంభించి రాత్రి 8 గంటలకు పార్టీ పేరును ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు కనీసం 2 లక్షల మంది హాజరయ్యేలా చూడాలని లక్ష్యం పెట్టుకున్నారు. -
హస్తంలో ఫొటోల కలకలం
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌కు గతంలో విశిష్ట సేవల్ని అందించిన నేతలు ఏఐసీసీకి భారంగా మారినట్టున్నారు. సభ్యత్వం దరఖాస్తుల్లో దివంగత నేతలు కామరాజర్, మూపనార్ బొమ్మల్ని తొలగించాల్సిందేనని అధిష్టానం స్పష్టం చేసింది. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ వాదుల్లో, మూపనార్ మద్దతుదారుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. తన మద్దతు దారులతో మూపనార్ తనయుడు, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ మంతనాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ర్ట కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, ముఖ్యమంత్రిగా విశిష్ట సేవల్ని అందించిన నేత కామరాజ నాడార్. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ను రెండుగా చీల్చి ఏఐసీసీకి ముచ్చెమటలు పట్టించడమే కాకుండా, అత్యధిక శాతం కాంగ్రెస్‌వాదుల మద్దతుగణాన్ని కల్గిన నేత జీకే మూపనార్. ఈ ఇద్దరు రాష్ట్ర కాంగ్రెస్‌కు రెండు కళ్లుగా చెప్పవచ్చు. జీకే మూపనార్ వారసుడిగా కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపు నేతగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యధిక శాతం మద్దతుదారులు ఈ గ్రూపుకే ఉన్నారు. మూపనార్ తమకు ఆదర్శం అంటూ ఆ గ్రూపు నేతలు తమ పయనాన్ని కాంగ్రెస్‌లో కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు దివంగత నేతలు ఏఐసీసీకి భారంగా మారినట్టున్నారు. కాంగ్రెస్ సభ్యత్వ దరఖాస్తులో ఏళ్ల తరబడి ఉంటున్న ఆ ఇద్దరు నేతల బొమ్మల్ని తొలగించాల్సిందేనని ఏఐసీసీ స్పష్టం చేయడం కాంగ్రెస్‌వాదులకు మింగుడు పడటం లేదు. అదే సమయంలో ఏఐసీసీ చర్యలు వాసన్ వర్గంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయిభారంగా నేతలు : రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గం మధ్య ఆధిపత్య సమరం సాగుతున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పగ్గాలు లక్ష్యంగా సాగుతున్న ఈ సమరంలో భాగంగానే ఆ నేతల బొమ్మల్ని తొలగించేందుకు చిదంబరం వర్గం పావులు కదిపినట్టుగా వాసన్ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏఐసీసీలో పలుకుబడి కల్గిన నేతగా చిదంబరం ఉన్న దృష్ట్యా, తన రాజతంత్రాన్ని ప్రయోగించి ఆ ఇద్దరి నేతల బొమ్మల్ని తొలగించే యత్నం చేసినట్టు, ఇందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి సైతం అంగీకరించడాన్ని వాసన్ వర్గం జీర్ణించుకోలేకున్నది. మరి కొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆరంభం కానున్న వేళ ఏఐసీసీ నిర్ణయం కాంగ్రెస్‌లోని నాడర్ సామాజిక వర్గం నేతల్ని సైతం ఆగ్రహానికి గురి చేస్తున్నది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏఐసీసీ నిర్ణయాన్ని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, మాజీ మంత్రి జీకే వాసన్లు తీవ్రంగానే వ్యతిరేకించారు. అయినా, ఆ బొమ్మలు దరఖాస్తులో భారంగా ఉన్నాయన్నట్టుగా అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో తదుపరి కార్యాచరణపై వాసన్ దృష్టి పెట్టినట్టున్నారు. మంతనాల్లో వాసన్: చెన్నైలో తన మద్దతుదారులతో వాసన్ మంతనాల్లో ముని గినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో తన తండ్రికి సంక్లిష్ట పరిస్థితులు పార్టీలో ఎదురైన వేళ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అదే తరహాలో స్పందించే విధంగా వ్యూహ రచనలో వాసన్ ఉన్నట్టు సమాచారం. గతంలో తన తండ్రి నేతృత్వంలో నెల కొల్పి, కాంగ్రెస్‌లో విలీనం చేసిన తమిళ మానిల కాంగ్రెస్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇప్పటికిప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోవాలా? లేదా, అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఆ ఇద్దరు నేతల బొమ్మలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలా? అన్న ఆలోచనతోను మంతనాలు సాగిస్టున్న ట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. వాసన్ మంతనాలు ఓ వైపు ఉంటే, మరో వైపు ఆయన మద్దతుదారులు చిదంబరం వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలతో పోస్టర్ల సమరానికి సిద్ధమయ్యారు. ఆ ఇద్దరు నేతల బొమ్మల తొలగింపును ఖండిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయోనన్న ఉత్కంఠ బయలు దేరింది. జ్ఞాన దేశికన్ రాజీనామా! తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జ్ఞానదేశికన్ రాజీనామా చేశారు. గురువారం రాత్రి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. జ్ఞానదేశికన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గం పట్టబడుతూ వస్తోంది. రాష్ట్రంలో అతి పెద్ద గ్రూపుగా ఉన్న జీకే వాసన్ మద్దతుదారుడు జ్ఞానదేశికన్ కావడంతో ఆయన్ను కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో మూపనార్, కామరాజర్ బొమ్మల్ని తొలగించేందుకు ఏఐసీసీ నిర్ణయించ డం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఉన్నట్టుండి తాను పదవి నుంచి వైదొలగుతున్నట్టు జ్ఞాన దేశికన్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు.