హస్తంలో ఫొటోల కలకలం | Gnanadesikan quits as TNCC chief | Sakshi
Sakshi News home page

హస్తంలో ఫొటోల కలకలం

Published Fri, Oct 31 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

హస్తంలో ఫొటోల కలకలం

హస్తంలో ఫొటోల కలకలం

 సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌కు గతంలో విశిష్ట సేవల్ని అందించిన నేతలు ఏఐసీసీకి భారంగా మారినట్టున్నారు. సభ్యత్వం దరఖాస్తుల్లో దివంగత నేతలు కామరాజర్, మూపనార్ బొమ్మల్ని తొలగించాల్సిందేనని అధిష్టానం స్పష్టం చేసింది. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ వాదుల్లో, మూపనార్ మద్దతుదారుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. తన మద్దతు దారులతో మూపనార్ తనయుడు, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ మంతనాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ర్ట కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, ముఖ్యమంత్రిగా విశిష్ట సేవల్ని అందించిన నేత కామరాజ నాడార్. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులు ముందుకు సాగుతున్నారు.
 
 కాంగ్రెస్‌ను రెండుగా చీల్చి ఏఐసీసీకి ముచ్చెమటలు పట్టించడమే కాకుండా, అత్యధిక శాతం కాంగ్రెస్‌వాదుల మద్దతుగణాన్ని కల్గిన నేత జీకే మూపనార్. ఈ ఇద్దరు రాష్ట్ర కాంగ్రెస్‌కు రెండు కళ్లుగా చెప్పవచ్చు. జీకే  మూపనార్ వారసుడిగా కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపు నేతగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యధిక శాతం మద్దతుదారులు ఈ గ్రూపుకే ఉన్నారు. మూపనార్ తమకు ఆదర్శం అంటూ ఆ గ్రూపు నేతలు తమ పయనాన్ని కాంగ్రెస్‌లో కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు దివంగత నేతలు ఏఐసీసీకి భారంగా మారినట్టున్నారు. కాంగ్రెస్ సభ్యత్వ దరఖాస్తులో ఏళ్ల తరబడి ఉంటున్న ఆ ఇద్దరు నేతల బొమ్మల్ని తొలగించాల్సిందేనని ఏఐసీసీ స్పష్టం చేయడం కాంగ్రెస్‌వాదులకు మింగుడు పడటం లేదు. అదే సమయంలో ఏఐసీసీ చర్యలు వాసన్ వర్గంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయిభారంగా నేతలు : రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గం మధ్య ఆధిపత్య సమరం సాగుతున్న విషయం తెలిసిందే.
 
 అధ్యక్ష పగ్గాలు లక్ష్యంగా సాగుతున్న ఈ సమరంలో భాగంగానే ఆ నేతల బొమ్మల్ని తొలగించేందుకు చిదంబరం వర్గం పావులు కదిపినట్టుగా వాసన్ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏఐసీసీలో పలుకుబడి కల్గిన నేతగా చిదంబరం ఉన్న దృష్ట్యా, తన రాజతంత్రాన్ని ప్రయోగించి ఆ ఇద్దరి నేతల బొమ్మల్ని తొలగించే యత్నం చేసినట్టు, ఇందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి సైతం అంగీకరించడాన్ని వాసన్ వర్గం జీర్ణించుకోలేకున్నది. మరి కొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆరంభం కానున్న వేళ ఏఐసీసీ నిర్ణయం కాంగ్రెస్‌లోని నాడర్ సామాజిక వర్గం నేతల్ని సైతం ఆగ్రహానికి గురి చేస్తున్నది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏఐసీసీ నిర్ణయాన్ని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, మాజీ మంత్రి జీకే వాసన్‌లు తీవ్రంగానే వ్యతిరేకించారు. అయినా, ఆ బొమ్మలు దరఖాస్తులో భారంగా ఉన్నాయన్నట్టుగా అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో తదుపరి కార్యాచరణపై వాసన్ దృష్టి పెట్టినట్టున్నారు.
 
 మంతనాల్లో వాసన్: చెన్నైలో తన మద్దతుదారులతో వాసన్ మంతనాల్లో ముని గినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో తన తండ్రికి సంక్లిష్ట పరిస్థితులు పార్టీలో ఎదురైన వేళ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అదే తరహాలో స్పందించే విధంగా వ్యూహ రచనలో వాసన్ ఉన్నట్టు సమాచారం. గతంలో తన తండ్రి నేతృత్వంలో నెల కొల్పి, కాంగ్రెస్‌లో విలీనం చేసిన తమిళ మానిల  కాంగ్రెస్‌ను మళ్లీ తెరపైకి  తీసుకురావచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇప్పటికిప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోవాలా? లేదా, అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఆ ఇద్దరు నేతల బొమ్మలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలా? అన్న ఆలోచనతోను మంతనాలు సాగిస్టున్న ట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. వాసన్ మంతనాలు ఓ వైపు ఉంటే, మరో వైపు ఆయన మద్దతుదారులు చిదంబరం వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలతో పోస్టర్ల సమరానికి సిద్ధమయ్యారు. ఆ ఇద్దరు నేతల బొమ్మల తొలగింపును ఖండిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు హల్‌చల్ చేస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయోనన్న ఉత్కంఠ బయలు దేరింది.  
 
 జ్ఞాన దేశికన్ రాజీనామా!
 తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జ్ఞానదేశికన్ రాజీనామా చేశారు. గురువారం రాత్రి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. జ్ఞానదేశికన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గం పట్టబడుతూ వస్తోంది. రాష్ట్రంలో అతి పెద్ద గ్రూపుగా ఉన్న జీకే వాసన్ మద్దతుదారుడు జ్ఞానదేశికన్ కావడంతో ఆయన్ను కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో  మూపనార్, కామరాజర్ బొమ్మల్ని తొలగించేందుకు ఏఐసీసీ నిర్ణయించ డం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఉన్నట్టుండి తాను పదవి నుంచి వైదొలగుతున్నట్టు జ్ఞాన దేశికన్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement