మహిళా నేతల ముష్టియుద్ధం
చెన్నై: పురుషులకు తామేమీ తీసి పోమన్నట్టుగా మహిళా కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు ముష్టియుద్ధానికి దిగారు. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్ వేదికగా బుధవారం సాగిన మహిళా నేతల కొట్లాట అక్కడున్న నాయకులను విస్మయానికి గురిచేసింది. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ చెన్నైకు వచ్చినప్పుడు మహిళా కాంగ్రెస్ తరపున సత్యమూర్తి భవన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు పెట్టారు. తిరువళ్లూరు జిల్లాకు చెందిన మహిళా నేత గౌరి గోపాల్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మహిళా విభాగం జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ పేరు, ఫోటో గల్లంతయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరి గోపాల్‌ను పదవి నుంచి హసీనా తొలగించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, బుధవారం ఉదయం సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో హసీనా సయ్యద్ నోరు జారారు. తనను విస్మరిస్తే, ఏంజరిగిందో చూశారుగా అంటూ వ్యాఖ్యానించడంతో వివాదం రాజుకుంది. గౌరి గోపాల్‌కు మద్దతుగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ రాణి స్పందించడంతో వాగ్వాదం మొదలైంది. అదే సమయంలో అక్కడే ఉన్న గౌరి గోపాల్ మద్దతుదారులు హసీనా సయ్యద్‌పై తిరగబడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హసీనా సయ్యద్, ఝాన్సీ రాణి ముష్టియుద్ధానికి దిగడంతో వారించేందుకు వారి భర్తలు రంగంలోకి దిగారు. ఈ సమయంలో హసీనా సయ్యద్ భర్త ఉమర్‌ను టార్గెట్ చేసిన గౌరి గోపాల్, ఝాన్సీ రాణిలు చేయి చేసుకున్నారు. అనంతరం హసినా, ఉమర్‌లను సమావేశ మందిరం నుంచి తరిమి కొట్టడంతో బయటకు పరుగులు తీశారు.
హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అక్కడున్న పార్టీ వర్గాలు కంగుతిన్నాయి. చివరకు పోలీసులు రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దారు. భద్రత నడుమ హసీనా సయ్యద్ అక్కడి నుంచి బయటకు వెళ్లి పోయారు. తన మీద పనిగట్టుకుని దాడి చేశారంటూ ఢిల్లీకి ఫిర్యాదు చేయడానికి ఆమె సిద్ధం అయ్యారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సమక్షంలో ఈ గొడవ మొదలైనట్టు సమాచారం. ఆయన తప్పుకోవడంతో మహిళలు మరింతగా రెచ్చి పోయారని సత్యమూర్తి భవన్ వర్గాల్లో చర్చ. ఈ ఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటానని తిరునావుక్కరసర్ పేర్కొన్నారు.