నేను పులిని.. రెచ్చగొడితే పంజా విసురుతా
" నేను పులిని...నన్ను రెచ్చగొట్టొదు...పంజా విసురుతా.."అని పార్టీలో తనను విమర్శిస్తున్న వారిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు హెచ్చరించారు. ఆమె ఖ్యలతో గ్రూపు నేతల మద్దతు మహిళా నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయ వివాదం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌ను పదవీచ్యుతుడ్ని చేయడానికి గ్రూపు నేతలు రచించిన పథకం అధికార ప్రతినిధి కుష్భు రూపంలో బెడిసి కొట్టిందని చెప్పవచ్చు.
కాంగ్రెస్‌లో కీలక నేతగా అవతరిస్తున్న కుష్భుకు ఢిల్లీ పెద్దల వద్ద మంచి గుర్తింపు ఉంది. ఆమె సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏఐసీసీ సిద్ధం అయింది. ఈ సమయంలో ఈవీకేఎస్‌కు అండగా అధిష్టానం పెద్దల వద్ద కుష్భు వాదన విన్పించినట్టు సమాచారం. కుష్భు అండతో ఈవీకేఎస్‌కు పదవీ గండం తాత్కాలికంగా తప్పినట్టు అయింది. కుష్భు మీద విమర్శలు ఎక్కుపెట్టే పనిలో గ్రూపుల నేతల మద్దతు మహిళా నాయకులు సిద్ధమయ్యారు.
కొందరు మహిళా నాయకులు కుష్భుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలను సంధించారు. వారికి సమాధానం ఇస్తూ 'నేను పులిని...నాతో పరాచకాలు వద్దు...రెచ్చగొడితే పంజా విసురుతా' అంటూ కాంగ్రెస్ కొంగు మహానాడులో కుష్బు తీవ్రంగానే స్పందించారు. ఈరోడ్ వేదికగా శుక్రవారం జరిగి మహానాడులో కుష్భు తనదైన శైలిలో తీవ్రంగానే స్పందించారు. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో కార్యకర్తల సందడే కన్పించేది కాదని, ఈవీకేఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత రోజుకు మూడు వందల మంది వరకు కార్యకర్తలు వచ్చి వెళ్తున్నారని వివరించారు.
పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నందునే ఈవీకేఎస్‌కు తాను అండగా నిలిచానని స్పష్టం చేశారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ కార్యకర్తలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలన్న కాంక్ష వారిలో ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాను చాటుకునే రీతిలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తమ నేత రాహుల్ గాంధీ ప్రజల్లో తిరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల్లో మునిగి ఉన్నారని విమర్శించారు.
డీఎంకే అధినేత కరుణానిధి అంటే తనకు ఎంతో మర్యాద అని, తాను ఆ పార్టీలో నుంచి ఎందుకు బయటకు వచ్చాననే విషయం ఆయనకు తెలుసునని, ప్రత్యేకంగా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నానని చెప్పారు. కుష్భు ప్రసంగానికి మహానాడులో హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి. ఈవీకేఎస్ మద్దతు వర్గం ఆనందం వ్యక్తం చేసింది.