evks
-
మళ్లీ పదవులు
సాక్షి, చెన్నై: రాష్ర్ట కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ వర్గానికి చెక్ పెట్టేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఈవీకేఎస్ హయాంలో ఉద్వాసనలకు గురైన జిల్లాల అధ్యక్షులకు మళ్లీ పదవులు కట్ట బెట్టారు. ఢిల్లీ నుంచి రాగానే, ఆగమేఘాలపై కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కొత్త ప్రకటనల్ని చేయడం గమనార్హం. ఇక, స్థానిక ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులకు పార్టీ తరపున దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన మూడు నెలలకు కొత్త అధ్యక్షుడ్ని ఏఐసీసీ పెద్దలు నియమించారు. అయితే, రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ ఇక తమ గుప్పెట్లో ఉండే విధంగా, తాము ఇచ్చే సూచనలు, ఆదేశాల మేరకు కొత్త అధ్యక్షుడు నడుచుకునే రీతిలో వ్యూహ రచన చేసి ఆ పదవిని సీనియర్ నాయకుడు తిరునావుక్కరసర్‌కు కట్టబెట్టారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తిరునావుక్కరసర్ ఢిల్లీ పెద్దల నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టుంది. ఆదివారం ఢిల్లీ వెళ్లొచ్చిన ఆయన సోమవారం మీడియా సమావేశం పెట్టారు. ఇందులో ఈవీకేఎస్ హయంలో ఉద్వాసనలకు గురైన, అకారణంగా తొలగించబడ్డ అధ్యక్షులకు మళ్లీ పదవులు కట్ట బెట్టే విధంగా ప్రకటన చేయడం ఆలోచించాల్సిందే. ఈ నిర్ణయాలు ఈవీకేఎస్ వర్గంలో గుబులు రేపినట్టు అయింది. మళ్లీ పదవులు: సత్యమూర్తి భవన్లో రాష్ర్ట పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాజీ ఎంపీ విశ్వనాథన్, ముఖ్య నాయకులు కరాటే త్యాగరాజన్, వల్లల్ పెరుమాల్, హసీనా సయ్యద్‌లతో కలిసి తిరునావుక్కరసర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయం, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ ఆదేశాల మేరకు ఓ ప్రకటన చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈవీకేఎస్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో తొలగించ బడ్డ తిరువళ్లురు, తిరుప్పూర్, నాగపట్నం, తిరునల్వేలి, కన్యాకుమారి తదితర జిల్లాల అధ్యక్షుల్ని మళ్లీ అదే పదవుల్లో నియమిస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణగిరి, మధురై మహానగరం తదితర ప్రాంతాల్లోని ఇన్‌చార్జ్‌లను తొలగిస్తున్నట్టు వివరించారు. ఇక, ఉత్తర చెన్నై పార్టీ అధ్యక్ష పదవికి రాయపురం మనో చేసిన రాజీనామా లేఖను తిరస్కరించామన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్‌ను పార్టీ నుంచి తొలగించి ఉన్నారని, ఆ ఉత్తర్వుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఇద్దరు పూర్వం ఉన్న పదవుల్లోనే కొనసాగుతారని తెలిపారు. దరఖాస్తులు: స్థానిక ఎన్నికల్ని డీఎంకేతో కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యామన్నారు. ఈ ఎన్నికల కోసం పర్యవేక్షకుల కమిటీని నియమించామని, ఈ కమిటీ నేతృత్వంలో ఆయా జిల్లాల నేతలు డీఎంకే వర్గాలతో చర్చించి ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీకి చర్యలు తీసుకుంటారన్నారు. ఆగమేఘాలపై నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంటూ, ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే వారికి దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇది వరకు తొలగించ బడ్డ వారి మీద లిఖిత పూర్వకంగా అధిష్టానానికి ఎలాంటి ఫిర్యాదులు వెళ్ల లేదని, అందుకే వారందర్నీ మళ్లీ నియమిస్తూ ఆదేశాలు వచ్చాయన్నారు. -
నేను పులిని.. రెచ్చగొడితే పంజా విసురుతా
" నేను పులిని...నన్ను రెచ్చగొట్టొదు...పంజా విసురుతా.."అని పార్టీలో తనను విమర్శిస్తున్న వారిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు హెచ్చరించారు. ఆమె ఖ్యలతో గ్రూపు నేతల మద్దతు మహిళా నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయ వివాదం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌ను పదవీచ్యుతుడ్ని చేయడానికి గ్రూపు నేతలు రచించిన పథకం అధికార ప్రతినిధి కుష్భు రూపంలో బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో కీలక నేతగా అవతరిస్తున్న కుష్భుకు ఢిల్లీ పెద్దల వద్ద మంచి గుర్తింపు ఉంది. ఆమె సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏఐసీసీ సిద్ధం అయింది. ఈ సమయంలో ఈవీకేఎస్‌కు అండగా అధిష్టానం పెద్దల వద్ద కుష్భు వాదన విన్పించినట్టు సమాచారం. కుష్భు అండతో ఈవీకేఎస్‌కు పదవీ గండం తాత్కాలికంగా తప్పినట్టు అయింది. కుష్భు మీద విమర్శలు ఎక్కుపెట్టే పనిలో గ్రూపుల నేతల మద్దతు మహిళా నాయకులు సిద్ధమయ్యారు. కొందరు మహిళా నాయకులు కుష్భుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలను సంధించారు. వారికి సమాధానం ఇస్తూ 'నేను పులిని...నాతో పరాచకాలు వద్దు...రెచ్చగొడితే పంజా విసురుతా' అంటూ కాంగ్రెస్ కొంగు మహానాడులో కుష్బు తీవ్రంగానే స్పందించారు. ఈరోడ్ వేదికగా శుక్రవారం జరిగి మహానాడులో కుష్భు తనదైన శైలిలో తీవ్రంగానే స్పందించారు. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్లో కార్యకర్తల సందడే కన్పించేది కాదని, ఈవీకేఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత రోజుకు మూడు వందల మంది వరకు కార్యకర్తలు వచ్చి వెళ్తున్నారని వివరించారు. పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నందునే ఈవీకేఎస్‌కు తాను అండగా నిలిచానని స్పష్టం చేశారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ కార్యకర్తలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలన్న కాంక్ష వారిలో ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాను చాటుకునే రీతిలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తమ నేత రాహుల్ గాంధీ ప్రజల్లో తిరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల్లో మునిగి ఉన్నారని విమర్శించారు. డీఎంకే అధినేత కరుణానిధి అంటే తనకు ఎంతో మర్యాద అని, తాను ఆ పార్టీలో నుంచి ఎందుకు బయటకు వచ్చాననే విషయం ఆయనకు తెలుసునని, ప్రత్యేకంగా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నానని చెప్పారు. కుష్భు ప్రసంగానికి మహానాడులో హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి. ఈవీకేఎస్ మద్దతు వర్గం ఆనందం వ్యక్తం చేసింది. -
సవాళ్లు.. ప్రతి సవాళ్లు
సాక్షి, చెన్నై : కాంగ్రెస్‌లో సవాళ్లు...ప్రతి సవాళ్ల వార్ నడుస్తోంది. ఈవీకేఎస్, ప్రత్యర్థి వర్గం మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఈవీకేఎస్ ఆరోపణలకు గురువారం తంగబాలు ప్రతి సవాల్ విసిరారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు కాంగ్రెస్ వాదులు ఏకంగా చెన్నై పోలీసు కమిషనర్‌కు ఈవీకేఎస్‌పై ఫిర్యాదు చేశారు. రాష్ర్ట కాంగ్రెస్‌లో పదవీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ను పదవీచ్యుతుడ్ని చేయించి, ఆ కుర్చీని తమలో ఎవరో ఒకరు దక్కించుకోవాలని 11 మందితో కూడిన గ్రూపు నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్లి వచ్చింది. పార్టీ రాష్ట్ర నేతల తీరుపై అధిష్టానం పెద్దలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు మూడు రోజులుగా ఈవీకేఎస్ను పదవి నుంచి తప్పించడం కోసం గ్రూపు నేతలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఈ వ్యవహారం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, సవాళ్లకు దారితీస్తోంది. తన మీద ఫిర్యాదు చేసినట్టు బహిరంగంగా మాజీ అధ్యక్షుడు తంగబాలు ప్రకటించడంతో ఆయనపై ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యక్తిగత ఆరోపణలతో నోరు జారారు. దీంతో కాంగ్రెస్ నేతల అక్రమార్జన చర్చ తెరమీదకు వచ్చింది. నువ్వింత సంపాదించావంటే కాదు నువ్వింత సంపాదించావని ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు తీవ్రంగానే స్పందించారు. చర్చకు రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. తంగబాలు మీడియాతో మాట్లాడుతూ తానేదో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్ని కబ్జా చేసి, ఇంజినీరింగ్ కళాశాలలు కట్టినట్టుగా ఆరోపిస్తున్న ఆ పెద్ద మనిషి, తనతో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. జానపద కళాకారుడు కోవన్ తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలతో కూడిన పాటల్ని గతంలో పాడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి ఉన్నారని, ఆ అరెస్టును ఖండిస్తూ, కోవన్కు మద్దతుగా ఈవీకేఎస్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆ విషయమై చర్చించడానికే ఢిల్లీ వెళ్లామని చెప్పారు. ఎవర్నో పదవి నుంచి తప్పించాలనో, మరెవర్నో కూర్చోబెట్టాలనో తాము ఢిల్లీకి వెళ్లలేదని అన్నారు. ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే రీతిలో వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు ఈవీకేఎస్ దిగడాన్ని ఖండించారు. తాను ఒక్క సె.మీ స్థలాన్ని కూడా ఆక్రమించలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని హితవుపలికారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ వాదులు కొందరు ఏకంగా ఈవీకేఎస్, ఆ పార్టీ మరో నేత గోపన్నపై గురువారం చెన్నై కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఆరాధ్యుడు పొసుం పొన్ ముత్తురామ దేవర్‌కు వ్యతిరేకంగా గోపన్న పార్టీ కార్యక్రమంలో స్పందించారని, ఇందుకు ఈవీకేఎస్ ఎలాంటి అడ్డు చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తమ ఆరాధ్య నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారం ఈవీకేఎస్‌కు ఎలాంటి ఇబ్బంది తెచ్చి పెడుతుందో చూడాలి. ఆయనకు మద్దతుగా పార్టీ అధికార ప్రతినిధి కుష్భు మాత్రం ఢిల్లీ పెద్దల వద్ద స్పందించి ఉండటం విశేషం.