మళ్లీ పదవులు
Published Tue, Sep 27 2016 3:18 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
సాక్షి, చెన్నై: రాష్ర్ట కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ వర్గానికి చెక్ పెట్టేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఈవీకేఎస్ హయాంలో ఉద్వాసనలకు గురైన జిల్లాల అధ్యక్షులకు మళ్లీ పదవులు కట్ట బెట్టారు. ఢిల్లీ నుంచి రాగానే, ఆగమేఘాలపై కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కొత్త ప్రకటనల్ని చేయడం గమనార్హం. ఇక, స్థానిక ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులకు పార్టీ తరపున దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన మూడు నెలలకు కొత్త అధ్యక్షుడ్ని ఏఐసీసీ పెద్దలు నియమించారు. అయితే, రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ ఇక తమ గుప్పెట్లో ఉండే విధంగా, తాము ఇచ్చే సూచనలు, ఆదేశాల మేరకు కొత్త అధ్యక్షుడు నడుచుకునే రీతిలో వ్యూహ రచన చేసి ఆ పదవిని సీనియర్ నాయకుడు తిరునావుక్కరసర్‌కు కట్టబెట్టారు.
అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తిరునావుక్కరసర్ ఢిల్లీ పెద్దల నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టుంది. ఆదివారం ఢిల్లీ వెళ్లొచ్చిన ఆయన సోమవారం మీడియా సమావేశం పెట్టారు. ఇందులో ఈవీకేఎస్ హయంలో ఉద్వాసనలకు గురైన, అకారణంగా తొలగించబడ్డ అధ్యక్షులకు మళ్లీ పదవులు కట్ట బెట్టే విధంగా ప్రకటన చేయడం ఆలోచించాల్సిందే. ఈ నిర్ణయాలు ఈవీకేఎస్ వర్గంలో గుబులు రేపినట్టు అయింది.
మళ్లీ పదవులు: సత్యమూర్తి భవన్‌లో రాష్ర్ట పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాజీ ఎంపీ విశ్వనాథన్, ముఖ్య నాయకులు కరాటే త్యాగరాజన్, వల్లల్ పెరుమాల్, హసీనా సయ్యద్‌లతో కలిసి తిరునావుక్కరసర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయం, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ ఆదేశాల మేరకు ఓ ప్రకటన చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈవీకేఎస్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో తొలగించ బడ్డ తిరువళ్లురు, తిరుప్పూర్, నాగపట్నం, తిరునల్వేలి, కన్యాకుమారి తదితర జిల్లాల అధ్యక్షుల్ని మళ్లీ అదే పదవుల్లో నియమిస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణగిరి, మధురై మహానగరం తదితర ప్రాంతాల్లోని ఇన్‌చార్జ్‌లను తొలగిస్తున్నట్టు వివరించారు.
ఇక, ఉత్తర చెన్నై పార్టీ అధ్యక్ష పదవికి రాయపురం మనో చేసిన రాజీనామా లేఖను తిరస్కరించామన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్‌ను పార్టీ నుంచి తొలగించి ఉన్నారని, ఆ ఉత్తర్వుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఇద్దరు పూర్వం ఉన్న పదవుల్లోనే కొనసాగుతారని తెలిపారు.
దరఖాస్తులు: స్థానిక ఎన్నికల్ని డీఎంకేతో కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యామన్నారు. ఈ ఎన్నికల కోసం పర్యవేక్షకుల కమిటీని నియమించామని, ఈ కమిటీ నేతృత్వంలో ఆయా జిల్లాల నేతలు డీఎంకే వర్గాలతో చర్చించి ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీకి చర్యలు తీసుకుంటారన్నారు.
ఆగమేఘాలపై నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంటూ, ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే వారికి దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇది వరకు తొలగించ బడ్డ వారి మీద లిఖిత పూర్వకంగా అధిష్టానానికి ఎలాంటి ఫిర్యాదులు వెళ్ల లేదని, అందుకే వారందర్నీ మళ్లీ నియమిస్తూ ఆదేశాలు వచ్చాయన్నారు.
Advertisement