chennei
-
చెన్నైలో గోగో టెక్నాలజీ కేంద్రం
ముంబై: విమానాల్లోపల ఇంటర్నెట్, వినోద సర్వీసులు అందించే అంతర్జాతీయ సంస్థ గోగో తాజాగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. చెన్నైలో టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా ఇది అందుబాటులోకి రాగలదని గోగో ఈవీపీ ఆనంద్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. 30 మంది ఇంజనీర్స్, డెవలపర్స్‌తో ప్రారం భించి.. 2018 ఆఖరు నాటికి సిబ్బంది సంఖ్య ను సుమారు 100కి పెంచుకోనున్నట్లు వెల్లడించారు. భారత్‌లో టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయడం.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని కస్టమర్లకు సేవలు మెరుగుపర్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని చారి వివరించారు. దేశీ, విదేశీ రూట్లలోని విమానాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలని టెలికం విభాగం యోచిస్తున్న నేపథ్యంలో దేశీ మార్కెట్లోకి గోగో ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
తీరనున్న బెంగ !
సాక్షి, చెన్నై : చెన్నైకు తెలుగు గంగ నీటి విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీంతో కొంత మేరకు నీటి బెంగ తీరినట్టే. అయితే, రెండు టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేయనున్న దృష్ట్యా, పూర్తి స్థాయిలో కొరతను అధిగమించేనా వేచిచూడాల్సిందే. తమిళనాడు రాజధాని నగరం చెన్నైకు తాగునీటిని అందిస్తున్న పుళల్, సెంబరంబాక్కం, పూండి చెరువుల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఎక్కడ నీటి ఎద్దడి చవి చూడాల్సి వస్తుందో అన్న ఆందోళన నెలకొంది. తమిళనాడుకు వాటాగా విడుదల చేయాల్సిన కృష్ణా జలాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా పన్నెండు టీఎంసీల మేరకు నీటి ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నీటిని తొలుత పుళల్ చెరువులో తదుపరి సెంబరంబాక్కం, పూండి చెరువులకు మళ్లించడం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విన్నవించుకునేందుకు అధికారులు తీవ్రంగానే ప్రయత్నించారు. చెన్నైలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కనీసం మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ వర్గాలు లేఖలు రాశాయి. చివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అక్కడి అధికారులతో ఫోన్ ద్వారా జరిపిన సంప్రదింపులు ఫలితాన్నిచ్చాయి. ప్రస్తుతానికి చెన్నైకు కండలేరు నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా రెండు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడంతో కొంత మేరకు నీటి బెంగ తీరినట్టే. తదుపరి మరో టీఎంసీ నీటిని విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం పరిశీలన సాగించిన పక్షంలో ప్రస్తుతానికి నీటి తిప్పల నుంచి చెన్నై గట్టెక్కినట్టే. అయితే, పూర్తి స్థాయిలో నీటి సమస్యను అధిగమించడం అనుమానమే. కాగా, ఈ నెల ఇరవై నుంచి ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో గండం నుంచి పూర్తిగా గట్టెక్కే అవకాశాలున్నాయి. లేని పక్షంలో గంగే దిక్కు. -
మెట్రో మోత..
సాక్షి, చెన్నై : మెట్రో చార్జీల కన్నా, పార్కింగ్ మోత అధికమైంది. గంట గంటకు రేటు పెరుగుతుండడంతో మెట్రో రైల్వేస్టేషన్లలో పార్కింగ్ చేయాలంటే వాహనదారుల జేబుకు చిల్లు పడినట్టే. రైల్వే చార్జీల కన్నా, పార్కింగ్ చార్జీలు ఎక్కువగా ఉండడంతో, ఆ రైలు ఎక్కేందుకు వెనకడుగు వేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ కష్టాల నుంచి వాహన దారుల్ని గట్టెక్కించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విమానాశ్రయం నుంచి అన్నా సాలై మీదుగా సెంట్రల్ వరకు ఓ మార్గం, తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి ఎగ్మూరు, కోయంబేడులను కలుపుతూ సెయింట్థామస్ మౌంట్ వరకు మరో మార్గం అన్నట్టు ఈ పనులు సాగాయి. కోయంబేడు నుంచి ఆలందూరు వరకు తొలి విడతగా పనులు ముగించి గత ఏడాది రైలును పట్టాలు ఎక్కించారు. గత వారం విమానాశ్రయం నుంచి చిన్న మలై వరకు పనులు ముగించి సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మార్గాల్లో రైలు చార్జీలు ఓ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు ఓ రేటు అన్నట్టుగా ఉంది. విమానాశ్రయం నుంచి కోయంబేడు, చిన్నమలైలకు రూ.50 చొప్పున చార్జీలను వసూళు చేస్తున్నారు. మధ్యలో వచ్చే స్టేషన్లకు ఒకటి తర్వాత మరొకటి చొప్పున రూ.10, రూ.20, రూ.30, రూ.40 చొప్పున చార్జీలను వసూళ్లు చేస్తున్నారు. కోయంబేడు-ఆలందరూ, చిన్నమలై-విమానాశ్రయం మార్గాల్లో పదకొండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలోనూ పార్కింగ్ సౌకర్యం కల్పించి ఉన్నారు. అయితే, ఈ పార్కింగ్ చార్జీలు రైల్వే చార్జీల కన్నా ఎక్కువే అన్నట్టుగా మోత మోగుతుండడంతో వాహనదారులు బెంబెలెత్తుతున్నారు. కోయంబేడు నుంచి విమానాశ్రయం వైపుగా లేదా, అక్కడి నుంచి చిన్నమలై వైపుగా పయనం సాగించే వాళ్లు ఆయా రైల్వే స్టేషన్లలోని పార్కింగ్‌లను ఉపయోగించుకుంటారు. అయితే, ఇక్కడ చార్జీలు గంట గంటకు పెరుగుతుండడం వాహన దారులకు మరింత భారంగా మారింది. పార్కింగ్ మోత : మెట్రో స్టేషన్లలో పార్కింగ్ పది నిమిషాల నుంచి రెండు గంటల వరకు ద్విచక్ర వాహనాలకు రూ.25, నాలుగు చక్రాల వాహనాలకు రూ.150 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఆ తర్వాత గంట గంటకు చార్జీలు పెరుగుతుంటాయి. ఆ మేరకు ఒక గంటకు రూ.25 చొప్పున ద్విచక్ర వాహనాలకు, రూ.150 చొప్పున నాలుగు చక్రాల వాహనాలకు చార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఇక, నెలసరి చార్జీలు అయితే, ద్విచక్ర వాహనాలకు రూ.వెయ్యి, కార్లకు రూ.ఏడు వేలు. ఈ మోత చెన్నై నగరంలోని అతి పెద్ద మాల్స్‌లో సాగుతున్న పార్కింగ్ దోపిడీలను తలపించే విధంగా సాగుతుండడంతో వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు. ఇక, మెట్రో ఎక్కడం కన్నా, తమ వాహనాల్లోనే ముందుకు సాగవచ్చన్న భావన వారిలో కలుగుతోంది. కోయంబేడు నుంచి విమానాశ్రయానికి మెట్రోలో ఇద్దరు వెళ్లి రావాలంటే రూ.రెండు వందలు అవుతుంది. పార్కింగ్‌కు రూ.25. ఆ తర్వాత జరిగే ఆలస్యం మేరకు గంట గంటకు మోత మోగుద్ది. ఈ లెక్కల్ని బేరీజు వేసుకుంటే, మొత్తం సుమారు రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. అదే కోయంబేడు నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే, రూ.50కి పెట్రోల్ కొట్టిస్తే చాలు దూసుకెళ్లొచ్చు. ఈ దృష్ట్యా, పార్కింగ్ మోత, రైల్వే చార్జీల్ని పరిగణలోకి తీసుకుని ఎక్కువ శాతం మంది మెట్రో కన్నా, వాహనమే మిన్నా అన్నట్టుగా ద్విచక్ర వాహనాల్లో దూసుకెళ్తోండడం గమనార్హం. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్‌లోనే 24 గంటల పార్కింగ్‌కు రూ.30, చెన్నై ఎలక్ట్రిక్ ైరె ల్వే స్టేషన్లలో పన్నెండు గంటలకు రూ10 నుంచి రూ. 20 వరకు వసూళు చేస్తుంటే, మెట్రోలో మాత్రం పార్కింగ్ మోత అధికంగా ఉండడం గమనార్హం. -
మళ్లీ పదవులు
సాక్షి, చెన్నై: రాష్ర్ట కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ వర్గానికి చెక్ పెట్టేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఈవీకేఎస్ హయాంలో ఉద్వాసనలకు గురైన జిల్లాల అధ్యక్షులకు మళ్లీ పదవులు కట్ట బెట్టారు. ఢిల్లీ నుంచి రాగానే, ఆగమేఘాలపై కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కొత్త ప్రకటనల్ని చేయడం గమనార్హం. ఇక, స్థానిక ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులకు పార్టీ తరపున దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన మూడు నెలలకు కొత్త అధ్యక్షుడ్ని ఏఐసీసీ పెద్దలు నియమించారు. అయితే, రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ ఇక తమ గుప్పెట్లో ఉండే విధంగా, తాము ఇచ్చే సూచనలు, ఆదేశాల మేరకు కొత్త అధ్యక్షుడు నడుచుకునే రీతిలో వ్యూహ రచన చేసి ఆ పదవిని సీనియర్ నాయకుడు తిరునావుక్కరసర్‌కు కట్టబెట్టారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తిరునావుక్కరసర్ ఢిల్లీ పెద్దల నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టుంది. ఆదివారం ఢిల్లీ వెళ్లొచ్చిన ఆయన సోమవారం మీడియా సమావేశం పెట్టారు. ఇందులో ఈవీకేఎస్ హయంలో ఉద్వాసనలకు గురైన, అకారణంగా తొలగించబడ్డ అధ్యక్షులకు మళ్లీ పదవులు కట్ట బెట్టే విధంగా ప్రకటన చేయడం ఆలోచించాల్సిందే. ఈ నిర్ణయాలు ఈవీకేఎస్ వర్గంలో గుబులు రేపినట్టు అయింది. మళ్లీ పదవులు: సత్యమూర్తి భవన్లో రాష్ర్ట పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాజీ ఎంపీ విశ్వనాథన్, ముఖ్య నాయకులు కరాటే త్యాగరాజన్, వల్లల్ పెరుమాల్, హసీనా సయ్యద్‌లతో కలిసి తిరునావుక్కరసర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయం, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ ఆదేశాల మేరకు ఓ ప్రకటన చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈవీకేఎస్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో తొలగించ బడ్డ తిరువళ్లురు, తిరుప్పూర్, నాగపట్నం, తిరునల్వేలి, కన్యాకుమారి తదితర జిల్లాల అధ్యక్షుల్ని మళ్లీ అదే పదవుల్లో నియమిస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణగిరి, మధురై మహానగరం తదితర ప్రాంతాల్లోని ఇన్‌చార్జ్‌లను తొలగిస్తున్నట్టు వివరించారు. ఇక, ఉత్తర చెన్నై పార్టీ అధ్యక్ష పదవికి రాయపురం మనో చేసిన రాజీనామా లేఖను తిరస్కరించామన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్‌ను పార్టీ నుంచి తొలగించి ఉన్నారని, ఆ ఉత్తర్వుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఇద్దరు పూర్వం ఉన్న పదవుల్లోనే కొనసాగుతారని తెలిపారు. దరఖాస్తులు: స్థానిక ఎన్నికల్ని డీఎంకేతో కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యామన్నారు. ఈ ఎన్నికల కోసం పర్యవేక్షకుల కమిటీని నియమించామని, ఈ కమిటీ నేతృత్వంలో ఆయా జిల్లాల నేతలు డీఎంకే వర్గాలతో చర్చించి ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీకి చర్యలు తీసుకుంటారన్నారు. ఆగమేఘాలపై నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంటూ, ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే వారికి దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇది వరకు తొలగించ బడ్డ వారి మీద లిఖిత పూర్వకంగా అధిష్టానానికి ఎలాంటి ఫిర్యాదులు వెళ్ల లేదని, అందుకే వారందర్నీ మళ్లీ నియమిస్తూ ఆదేశాలు వచ్చాయన్నారు. -
ఐదో రోజు అమ్మకు చికిత్స
సాక్షి, చెన్నై: ఐదో రోజు సోమవారం అమ్మ జయలలితకు అపోలో ఆసుపత్రి వర్గా లు వైద్య చికిత్సలు అందించాయి. అమ్మకు సహకారంగా ఆసుపత్రి లో నెచ్చెలి శశికళ, బంధువు ఇలవరసి ఉన్నారు. అనారోగ్యంతో సీఎం జె.జయలలిత గురువారం రాత్రి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యపరిస్థితి అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన బయల్దేరింది. అయితే ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్లతో ఊరట చెందారు. అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని, విశ్రాంతి నిమిత్తం ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అన్నాడీఎంకే వర్గాలు తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి చేరాలని కాంక్షిస్తూ సోమవారం కూడా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇక ఆరోగ్యం కుదుట పడడంతో సీఎం జయలలిత పరిపాలనా వ్యవహారాలపై ఆసుపత్రి నుంచే దృష్టి పెట్టినట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపరంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక నిమిత్తం సిద్ధం చేసిన నివేదికల్ని పరిశీలించి మరీ విడుదల చేసే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరిపాలన పరంగా దృష్టి పెట్టడంతోనే అరియలూరు ప్రమాదంపై అమ్మ ది గ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదో రోజుగా ఆసుపత్రి వద్దకు అమ్మను పరామర్శించేందుకు ఆర్థికమంత్రి పన్నీరుసెల్వం, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతోపాటుగా పలువురు వ చ్చారు.ఇక, అమ్మకు సహకారంగా ఆసుపత్రిలో నెచ్చెలి శశికళ, బంధువు ఇలవరసి ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అమ్మ చికిత్స పొందుతున్న వార్డు, బ్లాక్ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రచారం చేయాల్సిన అవసరం లేదు స్థానిక ఎన్నికల్లో అమ్మ జయలలిత ప్రచారం చేయాల్సినంత అవసరం లేదని, ప్రజలే తమకు పట్టం కడుతారని అన్నాడీఎంకే సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ వ్యాఖ్యానించారు. ఐదో రోజుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలితను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు ఉత్తర్వులపై సంతకాలు చేసినట్టు సమాచారం. తదుపరి మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, నిలోఫర్ కబిల్, దురైకన్ను, స్పీకర్ ధనపాల్, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్‌లతో పాటుగా కూటమి పార్టీ నాయకులు జగన్మూర్తి, షేక్ దావూద్ తదితరులు అమ్మను పరామర్శించారు. అలాగే పార్టీ సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ అమ్మను పరామర్శించినానంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం విశ్రాంతిలోనే ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అమ్మ ప్రచారం చేస్తారా..? అని మీడియా ప్రశ్నించగా, అంత అవసరం లేదని, ప్రజలే పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి తగ్గ సమయం ఇంకా ఉందని, అంతలోపు అమ్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత బుధవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వదంతులు సృష్టిస్తే చర్యలు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎవరైనా వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది. అమ్మ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు హోరెత్తుతుండడంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు. -
ఫీజుల మోత
సాక్షి ప్రతినిధి, చెన్నై: అవకాశాలు, ఫీజుల భారం పరంగా ఇప్పటికే ఆకాశాన్ని అంటిన వైద్య విద్య సామాన్యులకు మరింత దూరం కానుంది. ఫీజులు రెండింతలు పెంచుతూ ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఫీజులు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానున్నాయి. ఉన్నత విద్యలన్నింటిలోకి వైద్యవిద్య అంటే అధికశాతం మందికి క్రేజ్. డాక్టరు కావాలన్నది విద్యార్థుల మదిలో ఒక పెద్ద డ్రీమ్. మరి ఈ కలను సాకారం చేసుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి కష్టపడి ప్రభుత్వ కళాశాలల్లో సీటు సంపాదించడం. రెండోది పెద్దలపై ఒత్తిడి తెచ్చి ప్రయివేటు కళాశాల్లో కోట్లాది రూపాయలు కుమ్మరించడం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు జాతీయస్థాయిలో గట్టి పోటీ నెలకొని ఉండడం, సీట్ల సంఖ్య పరిమితం కావడంతో అధికశాతం విద్యార్థులు ప్రయివేటు వైద్య కళాశాలలపైనే ఆధారపడుతుంటారు. ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో అడ్మిషన్లకు జాతీయస్థాయిలో ‘నీట్’ ప్రవేశపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే నీట్ పరీక్షల నిర్వహణలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు లభించింది. మినహాయింపును అదునుగా తీసుకుని విద్యార్థుల నుంచి డొనేషన్లు వసూలు చేయరాదని షరతు విధించింది. ఈ షరతుకు మింగుడు పడని ప్రయివేటు వైద్య కళాశాల యాజమాన్యాలు డొనేషన్లకు బదులుగా ఫీజులు పెంచాలని తీర్మానించుకున్నాయి. పెంచిన ఫీజులు చెల్లిస్తేనే అడ్మిషన్లు పొందగలరని రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలు విద్యార్థులకు చెబుతున్నాయి. ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న చెన్నైలోని ఒక ప్రముఖ వైద్య కళాశాలలో గత సంవత్సరం ఏడాదికి రూ.10 లక్షలు వసూలు చేయగా, ఈ ఏడాది రూ.20 లక్షలుగా పెంచారు. నాలుగేళ్లూ పూర్తిచేసి పట్టభద్రుడుగా సర్టిఫికెట్లతో బైటకు రావాలంటే రూ.94.50 కోట్లు ఖర్చుకాగలదు. ఇది కాక, పుస్తకాలు, హాస్టల్, ఆహారం ఖర్చులు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనే ఫీజులు చౌక ఇతర రాష్ట్రాల్లో ఫీజులు పరిశీలిస్తే, ఏడాదికి రాజస్థాన్‌లో రూ.9 వేలు, పంజాబ్‌లో రూ.4.4 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో అత్యధిక ఫీజులు రాబడుతున్నారు. ఏడాదికి కనీసం రూ.16.8 లక్షల నుంచి రూ.21.9 లక్షలు వసూలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలతో పోలిస్తే గుజరాత్లో చాలా తక్కువగా ఉంది. గుజరాత్‌లోని ప్రయివేటు వైద్య కళాశాలల్లో రూ.1.9 లక్షల నుంయి రూ.4.5 లక్షల్లో వైద్యపట్టభద్రులు కావచ్చు. అదే ప్రభుత్వ వైద్యకళాశాలైతే రూ.9వేలు మాత్రమే. పంజాబ్‌లో రూ.4.4 లక్షలు చెల్లిస్తే వైద్యకోర్సును పూర్తి చేయవచ్చు. గత ఏడాది రూ.9 లక్షలు వసూలు చేసిన చెన్నై శివార్లలోని ఒక వైద్యకళాశాల ఈ ఏడాది రూ.15లక్షలకు పెంచింది. చెన్నై పోరూరులోని ఒక వైద్య కళాశాలలో 50 శాతం మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఎంపిక చేయబడిన 212 మంది విద్యార్థుల్లో వంద మంది మాత్రమే తమిళనాడుకు చెందిన వారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు 25 శాతం మంది, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన వారు 10 శాతం మంది ఉన్నారు.ై వెద్యకళాశాలల్లో ఫీజుల మొత్తాన్ని సుప్రీం కోర్టు నియమించిన అధికారిక బృందమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ బృందం పరిధిలో అనేక ప్రయివేటు వైద్య కళాశాలలు కూడా వస్తాయి. మరి తమిళనాడులో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను పెంచిన వైద్యకళాశాలలు సుప్రీం బృందం కిందకు వస్తాయో రావో పెంచిన ఫీజులే త్వరలో తెలియజేస్తాయి. -
చెన్నైలో కల్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూంలు
టీనగర్: ప్రముఖ జ్యువెలరీ సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ నగరంలోని అన్నానగర్, వేళచ్చేరిలలో కొత్తగా తమ నాలుగు, ఐదో షోరూంలను ఆదివారం ప్రారంభించింది. ప్రముఖ సినీతారలు నటుడు ప్రభు గణేశన్, నటి సోనమ్ కపూర్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో కల్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎస్.కల్యాణరామన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్స్ రాజేష్ కల్యాణరామన్, రమేష్ కల్యాణరామన్, కల్యాణ్ డెవలపర్స్, మేనేజింగ్ డెరైక్టర్ ఆర్ కార్తిక్‌లు వేళచ్చేరిలో ఏర్పాటైన షోరూం వద్దకు ముందుగా చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున హాజరైన ప్రజలతో ముచ్చటించారు. అక్కడ నుంచి సినీతారలు, కల్యాణ్ సీనియర్ మేనేజ్మెంట్ అన్నానగర్ షోరూం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రజల నుంచి వీరికి అనూహ్య స్పందన లభించింది. దీంతో ప్రజలకు కృతజ్ఞతగా తమ అభివాదాలను తెలిపారు. అన్నానగర్‌లో ప్రజల నుద్దేశించి నటుడు ప్రభు మాట్లాడుతూ ప్రస్తుతం కల్యాణ్ జ్యువెలర్స్ అన్నానగర్, వేలచ్చేరిలలో కొత్తగా షోరూంలను ఏర్పాటుచేయడం ద్వారా భారత్, మధ్య ఆసియాలో ఈ షోరూంల సంఖ్య 102కు చేరుకుందన్నారు. కల్యాణ్ జ్యువెలర్స్ తమ ఆరో షోరూం ప్రారంభించినప్పటి నుంచి ఆ సంస్థతో తనకు అనుబంధం ఉందన్నారు. నటి సోనం కపూర్‌ను చిన్న వయసులో చూశానని, ఆమె ప్రస్తుతం కల్యాణ్ జ్యువెలర్స్ ఫ్యామిలీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కల్యాణ్ జ్యువెలర్స్ మరింతగా అభివృద్ధి సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నటి సోనం కపూర్ మాట్లాడుతూ కల్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకో ప్రత్యేకతని తెలిపారు.