ఫీజుల మోత
Published Tue, Sep 27 2016 3:09 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
సాక్షి ప్రతినిధి, చెన్నై: అవకాశాలు, ఫీజుల భారం పరంగా ఇప్పటికే ఆకాశాన్ని అంటిన వైద్య విద్య సామాన్యులకు మరింత దూరం కానుంది. ఫీజులు రెండింతలు పెంచుతూ ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఫీజులు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానున్నాయి. ఉన్నత విద్యలన్నింటిలోకి వైద్యవిద్య అంటే అధికశాతం మందికి క్రేజ్. డాక్టరు కావాలన్నది విద్యార్థుల మదిలో ఒక పెద్ద డ్రీమ్. మరి ఈ కలను సాకారం చేసుకోవాలంటే రెండే మార్గాలు.
ఒకటి కష్టపడి ప్రభుత్వ కళాశాలల్లో సీటు సంపాదించడం. రెండోది పెద్దలపై ఒత్తిడి తెచ్చి ప్రయివేటు కళాశాల్లో కోట్లాది రూపాయలు కుమ్మరించడం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు జాతీయస్థాయిలో గట్టి పోటీ నెలకొని ఉండడం, సీట్ల సంఖ్య పరిమితం కావడంతో అధికశాతం విద్యార్థులు ప్రయివేటు వైద్య కళాశాలలపైనే ఆధారపడుతుంటారు. ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో అడ్మిషన్లకు జాతీయస్థాయిలో ‘నీట్’ ప్రవేశపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే నీట్ పరీక్షల నిర్వహణలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు లభించింది. మినహాయింపును అదునుగా తీసుకుని విద్యార్థుల నుంచి డొనేషన్లు వసూలు చేయరాదని షరతు విధించింది.
ఈ షరతుకు మింగుడు పడని ప్రయివేటు వైద్య కళాశాల యాజమాన్యాలు డొనేషన్లకు బదులుగా ఫీజులు పెంచాలని తీర్మానించుకున్నాయి. పెంచిన ఫీజులు చెల్లిస్తేనే అడ్మిషన్లు పొందగలరని రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలు విద్యార్థులకు చెబుతున్నాయి. ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న చెన్నైలోని ఒక ప్రముఖ వైద్య కళాశాలలో గత సంవత్సరం ఏడాదికి రూ.10 లక్షలు వసూలు చేయగా, ఈ ఏడాది రూ.20 లక్షలుగా పెంచారు. నాలుగేళ్లూ పూర్తిచేసి పట్టభద్రుడుగా సర్టిఫికెట్లతో బైటకు రావాలంటే రూ.94.50 కోట్లు ఖర్చుకాగలదు. ఇది కాక, పుస్తకాలు, హాస్టల్, ఆహారం ఖర్చులు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర రాష్ట్రాల్లోనే ఫీజులు చౌక
ఇతర రాష్ట్రాల్లో ఫీజులు పరిశీలిస్తే, ఏడాదికి రాజస్థాన్‌లో రూ.9 వేలు, పంజాబ్‌లో రూ.4.4 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో అత్యధిక ఫీజులు రాబడుతున్నారు. ఏడాదికి కనీసం రూ.16.8 లక్షల నుంచి రూ.21.9 లక్షలు వసూలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలతో పోలిస్తే గుజరాత్‌లో చాలా తక్కువగా ఉంది. గుజరాత్‌లోని ప్రయివేటు వైద్య కళాశాలల్లో రూ.1.9 లక్షల నుంయి రూ.4.5 లక్షల్లో వైద్యపట్టభద్రులు కావచ్చు. అదే ప్రభుత్వ వైద్యకళాశాలైతే రూ.9వేలు మాత్రమే.
పంజాబ్‌లో రూ.4.4 లక్షలు చెల్లిస్తే వైద్యకోర్సును పూర్తి చేయవచ్చు. గత ఏడాది రూ.9 లక్షలు వసూలు చేసిన చెన్నై శివార్లలోని ఒక వైద్యకళాశాల ఈ ఏడాది రూ.15లక్షలకు పెంచింది. చెన్నై పోరూరులోని ఒక వైద్య కళాశాలలో 50 శాతం మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఎంపిక చేయబడిన 212 మంది విద్యార్థుల్లో వంద మంది మాత్రమే తమిళనాడుకు చెందిన వారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు 25 శాతం మంది, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన వారు 10 శాతం మంది ఉన్నారు.ై
వెద్యకళాశాలల్లో ఫీజుల మొత్తాన్ని సుప్రీం కోర్టు నియమించిన అధికారిక బృందమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ బృందం పరిధిలో అనేక ప్రయివేటు వైద్య కళాశాలలు కూడా వస్తాయి. మరి తమిళనాడులో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను పెంచిన వైద్యకళాశాలలు సుప్రీం బృందం కిందకు వస్తాయో రావో పెంచిన ఫీజులే త్వరలో తెలియజేస్తాయి.
Advertisement
Advertisement