ఐదో రోజు అమ్మకు చికిత్స
Published Tue, Sep 27 2016 3:13 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
సాక్షి, చెన్నై: ఐదో రోజు సోమవారం అమ్మ జయలలితకు అపోలో ఆసుపత్రి వర్గా లు వైద్య చికిత్సలు అందించాయి. అమ్మకు సహకారంగా ఆసుపత్రి లో నెచ్చెలి శశికళ, బంధువు ఇలవరసి ఉన్నారు. అనారోగ్యంతో సీఎం జె.జయలలిత గురువారం రాత్రి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యపరిస్థితి అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన బయల్దేరింది. అయితే ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లతో ఊరట చెందారు. అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని, విశ్రాంతి నిమిత్తం ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అన్నాడీఎంకే వర్గాలు తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి చేరాలని కాంక్షిస్తూ సోమవారం కూడా ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
ఇక ఆరోగ్యం కుదుట పడడంతో సీఎం జయలలిత పరిపాలనా వ్యవహారాలపై ఆసుపత్రి నుంచే దృష్టి పెట్టినట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపరంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక నిమిత్తం సిద్ధం చేసిన నివేదికల్ని పరిశీలించి మరీ విడుదల చేసే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరిపాలన పరంగా దృష్టి పెట్టడంతోనే అరియలూరు ప్రమాదంపై
అమ్మ ది గ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదో రోజుగా ఆసుపత్రి వద్దకు అమ్మను పరామర్శించేందుకు ఆర్థికమంత్రి పన్నీరుసెల్వం, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతోపాటుగా పలువురు వ చ్చారు.ఇక, అమ్మకు సహకారంగా ఆసుపత్రిలో నెచ్చెలి శశికళ, బంధువు ఇలవరసి ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అమ్మ చికిత్స పొందుతున్న వార్డు, బ్లాక్ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు.
ప్రచారం చేయాల్సిన అవసరం లేదు
స్థానిక ఎన్నికల్లో అమ్మ జయలలిత ప్రచారం చేయాల్సినంత అవసరం లేదని, ప్రజలే తమకు పట్టం కడుతారని అన్నాడీఎంకే సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ వ్యాఖ్యానించారు. ఐదో రోజుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలితను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు ఉత్తర్వులపై సంతకాలు చేసినట్టు సమాచారం. తదుపరి మంత్రులు ఆర్‌బీ ఉదయకుమార్, నిలోఫర్ కబిల్, దురైకన్ను, స్పీకర్ ధనపాల్, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్‌లతో పాటుగా కూటమి పార్టీ నాయకులు జగన్‌మూర్తి, షేక్ దావూద్ తదితరులు అమ్మను పరామర్శించారు. అలాగే పార్టీ సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ అమ్మను పరామర్శించినానంతరం మీడియాతో మాట్లాడారు.
సీఎం జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం విశ్రాంతిలోనే ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అమ్మ ప్రచారం చేస్తారా..? అని మీడియా ప్రశ్నించగా, అంత అవసరం లేదని, ప్రజలే పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి తగ్గ సమయం ఇంకా ఉందని, అంతలోపు అమ్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత బుధవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
వదంతులు సృష్టిస్తే చర్యలు
సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎవరైనా వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది. అమ్మ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు హోరెత్తుతుండడంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు.
Advertisement
Advertisement