దివంగత సీఎం, అమ్మ జయలలితకు ఆస్పత్రిలో ఇచ్చిన ఆహారం పదార్థాల్లో తీపిఎక్కువగా ఉన్నట్టు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమెకు ఎవరు తీపి పదార్థాలు ఇచ్చారో అన్న ప్రశ్న బయలుదేరింది. ఆసుపత్రి వర్గాలు ఇచ్చా యా..? లేదా ఇందులో ఎవరి నిర్బంధమైనా ఉందా..? అన్న చర్చ తెర మీదకు వచ్చింది.
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఇపుడు ఆస్పత్రిలో ఉన్నపుడు జయలలితకు అందించిన మెనూ చర్చనీయాశంగా మారింది. దీనిపై విచారణ కమిషన్ ఏవిధంగా స్పందిస్తుందనే ప్రశ్న మొదలైంది. 2016 సెప్టెంబరు 22 వ తేదీ నుంచి డిసెంబరు ఐదో తేదీ వరకు అమ్మ జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఐదో తేదీన ఆమె గుండె పోటుతో మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే, ఆమె మరణంలో మిస్టరీ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగింది. ఈ కమిషన్ ఏ ఒక్కరినీ వదలిపెట్టడం లేదు. జయలలితతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరినీ విచారిస్తూ వస్తోంది. ఆస్పత్రి నుంచి నివేదికల మీద నివేదికల్ని ఆ కమిషన్ తెప్పించుకుంటోంది. అదే సమయంలో వాంగ్మూలం ఇచ్చిన వారి వద్ద జయ నెచ్చెలి, చిన్నమ్మ శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూరు పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ సైతం చేస్తున్నారు.
ఈ విచారణల్లో పలు అంశాలు తరచూ వెలుగులోకి రావడం చర్చకు దారితీస్తోంది. ఈనేపథ్యంలో జయలలిత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో శ్వాస సంబంధిత పరీక్షల సమయంలో జరిగిన ఆడియో రికార్డింగ్ శనివారం వెలుగులోకి వచ్చింది. అలాగే, అమ్మకు అందిన ఆహారపు మెనూ సైతం బయటపడింది. ఇందులో జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ అందించిన మెనుతో పాటు, ఆసుపత్రి వర్గాలు సమర్పించిన నివేదికలోనూ ఓ మెనూ ఉండడం చర్చకు దారితీసింది. రెండేళ్ల పాటు తన సూచన మేరకు జయలలితకు అందించిన ఆహార పదార్థాల గురించి శివకుమార్ కమిషన్ ముందు స్పష్టంచేశారు. అదే సమయంలో ఆస్పత్రిలో అందించిన ఆహార పదార్థాల్లో అత్యధికంగా తీపి ఉండడం చర్చకు దారి తీసింది.
అమ్మకు మధుమేహం
20 ఏళ్లుగా జయలలిత మధుమేహంతో బాధ పడుతున్నట్టుసంకేతాలున్నాయి. ఆమె ఆస్పత్రిలో చేరినప్పుడు షుగర్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఆస్పత్రిలో తీపి పదార్థాలు ఎలా ఇచ్చారో అన్న చర్చ ఊపందుకుంది. ఆసుపత్రి వర్గాలు సైతం ఎలా అనుమతించాయనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. మధుమేహంతో ఉన్న వ్యక్తికి అదుపు లేకుండా ఎలా తీపి పదార్థాలు ఇచ్చారన్న ప్రశ్నను కమిషన్ సైతం తెరమీదకు తీసుకు రావడమే కాదు, ఆ దిశగా ప్రత్యేక పరిశీలన, విచారణకు ఆర్ముగస్వామి కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.
అదేపనిగా ఇచ్చారా..?
డిసెంబరు రెండు, మూడు తేదీల్లో ఆపిల్, మిల్క్‌షేక్స్, వంటి తీపి కల్గిన ఘన, ద్రవ పదార్థాలను జయలలిత స్వీకరించినట్టు ఆ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే, నవంబర్ 22న లడ్డూ, గులాబ్ జాం, రసగుల్లా వంటి వాటిని సైతం అమ్మ స్వీకరించినట్టుగా మెనూ ద్వారా బయపడిందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే, ఆమెకు తీపి పదార్థాలు అదే పనిగా ఆస్పత్రిలో ఎవరైనా ఇచ్చారా..? వైద్యులకు ఈ సమాచారం తెలుసా.. తెలియదా? అనే ప్రశ్న బయలుదేరింది. మధుమేహంతో ఉన్న జయలలితకు ఎందుకు ఇంతగా తీపి పదార్థాలు ఇవ్వాల్సి వచ్చిందో అని చర్చించుకునే వాళ్లు ఎక్కువే. ఈ తీపి పదార్థాల్ని అంశంగా తీసుకుని ఇక, ఆర్ముగస్వామి కమిషన్ విచారణను ఏకోణంలో ముందుకు తీసుకెళుతుందో వేచి చూడాల్సిందే. అలాగే, డాక్టర్ శివకుమార్‌తో పాటు మరికొందరు కొన్ని ఆడియో, వీడియోలను కమిషన్ ముందు ఉంచినట్టు సమాచారం. ఇవన్నీ బయటకు వచ్చిన పక్షంలో చర్చ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి.
కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే!
తూత్తుకుడి కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే అమ్మ ఆడియో, మెనూ వ్యవహారాలను ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకురాలు సీఆర్ సరస్వతి ఆరోపించారు. ఇక, అమ్మ జయలలితకు అందించే ఆహారం గురించి వైద్యులు రాసి పెట్టుకోవడం సర్వ సాధరణమేనని, ఇదేమీ కొత్త కాదంటూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment