shugar levels
-
చపాతీ ఎఫెక్ట్.. చూపు కోల్పోయిన బాలుడు
భోపాల్: ‘‘అతి సర్వత్రా వర్జయేత్’’ అన్నారు పెద్దలు... అంటే దేనిని అతిగా చేయడం మంచిది కాదని అర్థం. ముఖ్యంగా తిండి విషయంలో.. ఎంత రుచిగా ఉన్నా.. మన కడుపుకు సరిపోయేంతనే తినాలి తప్ప.. అతిగా లాగించకూడదు. కాదని బాగా తింటే.. ఎంతటి తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో ఇది చదివితే అర్థం అవుతుంది. పన్నెండేళ్ల కుర్రాడికి చపాతీలు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే రోజుకు 40 చపాతీలు తినేవాడు. ఫలితంగా కంటి చూపు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వైద్యులు ఆ బాలుడికి సర్జరీ చేసి చూపు ప్రసాదించారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ శిప్పూరి జిల్లా ఖోడ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సందీప్ కంటి చూపు క్రమంగా మందగించడం ప్రారంభం అయ్యింది. ఓ రోజు పూర్తిగా చూపు కోల్పోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి.. పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సందీప్ శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయడం మానేశాయి. అతడు కేవలం ఊపిరి తీసుకోగల్గుతున్నాడు అంతే. అక్కడ సందీప్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడి రిపోర్టులు చూసి షాక్ తిన్నారు. వైద్యులను అంతలా ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే సందీప్ బ్లడ్ షుగర్ లెవల్స్ ఏకంగా 1206 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు గమనించారు. ఇంత చిన్న కుర్రాడికి ఇంత పెద్ద మొత్తంలో షుగర్ లెవల్స్ ఉండటం ఏంటని ఆశ్చర్యపోయి.. అతడి ఆహారం గురించి ఆరా తీశారు. సందీప్ రోజుకు 40 చపాతీలు తినేవాడని అతడి తండ్రి తెలిపాడు. ఇంత పెద్ద మొత్తంలో చపాతీలు తినడం వల్ల సందీప్‌లో షుగర్ లెవల్స్ పెరగడమే కాక మెదడులో చీము చేరింది. దాని వల్ల అతడు కంటి చూపు కోల్పోవడమే కాక.. శరీరంలోని మిగతా అవయవాల పని చేయడం మానేశాయి. ఈ క్రమంలో వైద్యులు సందీప్ తలకు సర్జరీ చేసి 720 మిల్లీ లీటర్ల చీము తొలగించారు. చక్కెర స్థాయిలను తగ్గించడం కోసం ప్రతి రోజు సందీప్‌కు 6 యూనిట్ల ఇన్సులిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చాక.. కంటి వైద్యుడు సందీప్‌ను పరీక్షించి.. ఆ బాలుడు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నాడని తెలిపారు. వీలైనంత త్వరగా సందీప్‌కు సర్జరీ చేస్తే.. అతడికి కంటి చూపును తిరిగి తెప్పించవచ్చన్నారు. సందీప్ తల్లిదండ్రులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్ చేశారు. ఇప్పుడు సందీప్ చూడగల్గుతున్నాడు. ప్రస్తుతం సందీప్‌కు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. అతడిని అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. -
కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే!
దివంగత సీఎం, అమ్మ జయలలితకు ఆస్పత్రిలో ఇచ్చిన ఆహారం పదార్థాల్లో తీపిఎక్కువగా ఉన్నట్టు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమెకు ఎవరు తీపి పదార్థాలు ఇచ్చారో అన్న ప్రశ్న బయలుదేరింది. ఆసుపత్రి వర్గాలు ఇచ్చా యా..? లేదా ఇందులో ఎవరి నిర్బంధమైనా ఉందా..? అన్న చర్చ తెర మీదకు వచ్చింది. సాక్షి, చెన్నై : తమిళనాడులో ఇపుడు ఆస్పత్రిలో ఉన్నపుడు జయలలితకు అందించిన మెనూ చర్చనీయాశంగా మారింది. దీనిపై విచారణ కమిషన్ ఏవిధంగా స్పందిస్తుందనే ప్రశ్న మొదలైంది. 2016 సెప్టెంబరు 22 వ తేదీ నుంచి డిసెంబరు ఐదో తేదీ వరకు అమ్మ జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఐదో తేదీన ఆమె గుండె పోటుతో మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే, ఆమె మరణంలో మిస్టరీ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగింది. ఈ కమిషన్ ఏ ఒక్కరినీ వదలిపెట్టడం లేదు. జయలలితతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరినీ విచారిస్తూ వస్తోంది. ఆస్పత్రి నుంచి నివేదికల మీద నివేదికల్ని ఆ కమిషన్ తెప్పించుకుంటోంది. అదే సమయంలో వాంగ్మూలం ఇచ్చిన వారి వద్ద జయ నెచ్చెలి, చిన్నమ్మ శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూరు పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ సైతం చేస్తున్నారు. ఈ విచారణల్లో పలు అంశాలు తరచూ వెలుగులోకి రావడం చర్చకు దారితీస్తోంది. ఈనేపథ్యంలో జయలలిత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో శ్వాస సంబంధిత పరీక్షల సమయంలో జరిగిన ఆడియో రికార్డింగ్ శనివారం వెలుగులోకి వచ్చింది. అలాగే, అమ్మకు అందిన ఆహారపు మెనూ సైతం బయటపడింది. ఇందులో జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ అందించిన మెనుతో పాటు, ఆసుపత్రి వర్గాలు సమర్పించిన నివేదికలోనూ ఓ మెనూ ఉండడం చర్చకు దారితీసింది. రెండేళ్ల పాటు తన సూచన మేరకు జయలలితకు అందించిన ఆహార పదార్థాల గురించి శివకుమార్ కమిషన్ ముందు స్పష్టంచేశారు. అదే సమయంలో ఆస్పత్రిలో అందించిన ఆహార పదార్థాల్లో అత్యధికంగా తీపి ఉండడం చర్చకు దారి తీసింది. అమ్మకు మధుమేహం 20 ఏళ్లుగా జయలలిత మధుమేహంతో బాధ పడుతున్నట్టుసంకేతాలున్నాయి. ఆమె ఆస్పత్రిలో చేరినప్పుడు షుగర్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఆస్పత్రిలో తీపి పదార్థాలు ఎలా ఇచ్చారో అన్న చర్చ ఊపందుకుంది. ఆసుపత్రి వర్గాలు సైతం ఎలా అనుమతించాయనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. మధుమేహంతో ఉన్న వ్యక్తికి అదుపు లేకుండా ఎలా తీపి పదార్థాలు ఇచ్చారన్న ప్రశ్నను కమిషన్ సైతం తెరమీదకు తీసుకు రావడమే కాదు, ఆ దిశగా ప్రత్యేక పరిశీలన, విచారణకు ఆర్ముగస్వామి కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం. అదేపనిగా ఇచ్చారా..? డిసెంబరు రెండు, మూడు తేదీల్లో ఆపిల్, మిల్క్‌షేక్స్, వంటి తీపి కల్గిన ఘన, ద్రవ పదార్థాలను జయలలిత స్వీకరించినట్టు ఆ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే, నవంబర్ 22న లడ్డూ, గులాబ్ జాం, రసగుల్లా వంటి వాటిని సైతం అమ్మ స్వీకరించినట్టుగా మెనూ ద్వారా బయపడిందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే, ఆమెకు తీపి పదార్థాలు అదే పనిగా ఆస్పత్రిలో ఎవరైనా ఇచ్చారా..? వైద్యులకు ఈ సమాచారం తెలుసా.. తెలియదా? అనే ప్రశ్న బయలుదేరింది. మధుమేహంతో ఉన్న జయలలితకు ఎందుకు ఇంతగా తీపి పదార్థాలు ఇవ్వాల్సి వచ్చిందో అని చర్చించుకునే వాళ్లు ఎక్కువే. ఈ తీపి పదార్థాల్ని అంశంగా తీసుకుని ఇక, ఆర్ముగస్వామి కమిషన్ విచారణను ఏకోణంలో ముందుకు తీసుకెళుతుందో వేచి చూడాల్సిందే. అలాగే, డాక్టర్ శివకుమార్‌తో పాటు మరికొందరు కొన్ని ఆడియో, వీడియోలను కమిషన్ ముందు ఉంచినట్టు సమాచారం. ఇవన్నీ బయటకు వచ్చిన పక్షంలో చర్చ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే! తూత్తుకుడి కాల్పుల ఘటనను దారి మళ్లించేందుకే అమ్మ ఆడియో, మెనూ వ్యవహారాలను ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకురాలు సీఆర్ సరస్వతి ఆరోపించారు. ఇక, అమ్మ జయలలితకు అందించే ఆహారం గురించి వైద్యులు రాసి పెట్టుకోవడం సర్వ సాధరణమేనని, ఇదేమీ కొత్త కాదంటూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. -
డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త
డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త మీరు ఓ పదిమందిని పలకరిస్తే.. అందులో ఐదుగురికి డయాబెటిస్ ఉంటున్న రోజులివి. తప్పనిసరిగా దాదాపు ప్రతిరోజూ దీనికి మందులు వాడాలి. కానీ, మందులు ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్టులు ఉంటాయన్న భయం, దానికితోడు మందుల ఖర్చు కూడా ఎక్కువే. వీటన్నింటికీ పరిష్కారంగా.. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా, ఎఫెక్టివ్‌గా పనిచేసే ఆయుర్వేద ఔషధం ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాని ధర కూడా తక్కువే. ఒక్కో టాబ్లెట్ ఖరీదు ఐదు రూపాయలు మాత్రమే. నాలుగు రకాల ఔషధ మొక్కలను ఉపయోగించి లక్నోలోని సీఎస్ఐఆర్, ఎన్బీఆర్ఐ, సిఎమ్ఏపీ సంస్థలు సంయుక్తంగా 'బీజీఆర్-34' ఔషదాన్ని తయారుచేశాయి. ఇది పూర్తిగా ఆయుర్వేద ఔషధం. దీనిని వాడిన వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు తెలిపారు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్( ఎన్బీఆర్ఐ) 62 వ వార్షికోత్సవం సందర్భంగా దీని ప్రొడక్షన్‌ను ప్రారంభించారు. 'బీజీఆర్-34' ఔషధం క్లినికల్ ట్రయల్ పరీక్షలలో 67 శాతం విజయం సాధించినట్లు తెలిపారు. ఈ మందు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ రావత్ తెలిపారు. త్వరలోనే మార్కెట్లో ఈ ఔషదం లభించనుంది. నేడు 'ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం' సందర్భంగా డయాబెటిస్ వ్యాధిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మారుతున్న ఆధునిక జీవనశైలి డయాబెటీస్ వ్యాధికి లోనవడానికి గల అవకాశాలను పెంచుతుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి మొదలుకొని అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటీస్ వ్యాధి.. టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ అసమతుల్యత వల్ల కలిగితే. టైప్-2 డయాబెటీస్ వెయిట్ మేనేజ్మెంట్కు సంబంధించినది. ఇది ప్రాణాపాయాన్ని కలిగించేంత ప్రమాదకరమైనది. దీనిని తినకముందు రక్తంలో ఉన్నటువంటి చెక్కెర స్థాయిని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు. టైప్-2 డయాబెటీస్ ముదిరితే గుండే, కిడ్నీలు, కళ్లపై తీవ్ర దుష్పరిణామాలను చూపుతుంది. శరీరంలో షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి కలిగించే విపరీత పరిణామాల నుండి బయటపడొచ్చు.డయాబెటీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అహారం ఒకే సారిగా కాకుండా కొంచెం కొంచెంగా క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. త్వరగా జీర్ణమయ్యే బియ్యం, వైట్ బ్రెడ్ల లాంటి సరళమైన కార్బోహైడ్రేట్ల స్థానంలో రాగి, ఓట్స్ లాంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అహారంలో ఉండేలా చూసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు గల రోటీ, కూరగాయలు, సలాడ్లు రోజు వారి అహార మెనూలో ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రోజుకి తగినంత వ్యాయామం శరీరానికి అందేలా చూసుకోవడం ఎంతో అవసరం. శరీర బరువుని నియంత్రణలో ఉంచుకోవడం డయాబెటీస్ చికిత్సలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మెడిటేషన్ లాంటి మానసిక ప్రశాంతతను చేకూర్చే చర్యల వలన దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకుంటూ డాక్టర్లు నిర్థేశించిన మోతాదులో ఇన్సులిన్‌ను వాడాలి.