డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త
మీరు ఓ పదిమందిని పలకరిస్తే.. అందులో ఐదుగురికి డయాబెటిస్ ఉంటున్న రోజులివి. తప్పనిసరిగా దాదాపు ప్రతిరోజూ దీనికి మందులు వాడాలి. కానీ, మందులు ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్టులు ఉంటాయన్న భయం, దానికితోడు మందుల ఖర్చు కూడా ఎక్కువే. వీటన్నింటికీ పరిష్కారంగా.. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా, ఎఫెక్టివ్గా పనిచేసే ఆయుర్వేద ఔషధం ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాని ధర కూడా తక్కువే. ఒక్కో టాబ్లెట్ ఖరీదు ఐదు రూపాయలు మాత్రమే.
నాలుగు రకాల ఔషధ మొక్కలను ఉపయోగించి లక్నోలోని సీఎస్ఐఆర్, ఎన్బీఆర్ఐ, సిఎమ్ఏపీ సంస్థలు సంయుక్తంగా 'బీజీఆర్-34' ఔషదాన్ని తయారుచేశాయి. ఇది పూర్తిగా ఆయుర్వేద ఔషధం. దీనిని వాడిన వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు తెలిపారు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్( ఎన్బీఆర్ఐ) 62 వ వార్షికోత్సవం సందర్భంగా దీని ప్రొడక్షన్ను ప్రారంభించారు. 'బీజీఆర్-34' ఔషధం క్లినికల్ ట్రయల్ పరీక్షలలో 67 శాతం విజయం సాధించినట్లు తెలిపారు. ఈ మందు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ రావత్ తెలిపారు. త్వరలోనే మార్కెట్లో ఈ ఔషదం లభించనుంది.
నేడు 'ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం' సందర్భంగా డయాబెటిస్ వ్యాధిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మారుతున్న ఆధునిక జీవనశైలి డయాబెటీస్ వ్యాధికి లోనవడానికి గల అవకాశాలను పెంచుతుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి మొదలుకొని అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటీస్ వ్యాధి.. టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ అసమతుల్యత వల్ల కలిగితే. టైప్-2 డయాబెటీస్ వెయిట్ మేనేజ్మెంట్కు సంబంధించినది. ఇది ప్రాణాపాయాన్ని కలిగించేంత ప్రమాదకరమైనది. దీనిని తినకముందు రక్తంలో ఉన్నటువంటి చెక్కెర స్థాయిని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు. టైప్-2 డయాబెటీస్ ముదిరితే గుండే, కిడ్నీలు, కళ్లపై తీవ్ర దుష్పరిణామాలను చూపుతుంది. శరీరంలో షుగర్ లెవల్స్ను బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి కలిగించే విపరీత పరిణామాల నుండి బయటపడొచ్చు.డయాబెటీస్
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అహారం ఒకే సారిగా కాకుండా కొంచెం కొంచెంగా క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. త్వరగా జీర్ణమయ్యే బియ్యం, వైట్ బ్రెడ్ల లాంటి సరళమైన కార్బోహైడ్రేట్ల స్థానంలో రాగి, ఓట్స్ లాంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అహారంలో ఉండేలా చూసుకోవాలి.
తక్కువ కార్బోహైడ్రేట్లు గల రోటీ, కూరగాయలు, సలాడ్లు రోజు వారి అహార మెనూలో ఉండేలా చూసుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారు రోజుకి తగినంత వ్యాయామం శరీరానికి అందేలా చూసుకోవడం ఎంతో అవసరం.
శరీర బరువుని నియంత్రణలో ఉంచుకోవడం డయాబెటీస్ చికిత్సలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
మెడిటేషన్ లాంటి మానసిక ప్రశాంతతను చేకూర్చే చర్యల వలన దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి.
క్రమం తప్పకుండా షుగర్ లెవల్స్ను చెక్ చేసుకుంటూ డాక్టర్లు నిర్థేశించిన మోతాదులో ఇన్సులిన్ను వాడాలి.