
కోల్‌కతా: దుర్గా పూజలు జరిగే ఈ నాలుగు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జైళ్లలో ఖైదీలకు ప్రత్యేక మెనూను అందిస్తున్నారు. దుర్గా పూజల ఆనందాన్ని పంచేందుకు కరెక్షనల్ ఫెసిలిటీలోని ఖైదీల కోసం ప్రత్యేక మోనూ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బిర్యానీతో పాటు పండుగ రోజులలో (సోమవారం నుండి గురువారం వరకు) ఖైదీల మెనూలో చైనీస్ వంటకాలు ఉండనున్నాయి. ఉదయం స్నాక్ మెనూలో లుచి-పూరి (డీప్-ఫ్రైడ్, మెత్తటి ఫ్లాట్ బ్రెడ్) అందించనున్నారు.
సాధారణంగా దుర్గాపూజలను కుటుంబ సభ్యులు సామూహికంగా జరుపుకుంటారు. అయితే ఖైదీలు నాలుగు గోడల మధ్య ఉంటూ, బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. దీనిని గుర్తించిన జైళ్ల అధికారులు.. ఖైదీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం దుర్గా పూజ జరిగే నాలుగు రోజుల్లో కరెక్షనల్ ఫెసిలిటీలలో మెనూ మారుతుంటుంది. ఈసారి కూడా ఖైదీలకు దుర్గా పూజల రోజుల్లో రుచికరమైన వంటకాలను అందిస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు. పూజ జరిగే నాలుగు రోజుల్లో ఉదయం ఫలహారం నుంచి రాత్రి భోజనం వరకు వారికి వివిధ మెనూలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఖైదీలకు వెజ్ బిర్యానీ, పనీర్, పెరుగు, ఐస్ క్రీం, స్వీట్లు అందిస్తారని, అల్పాహారంలో చౌమీన్, గుడ్డు టోస్ట్ ఉంటాయని అధికారి తెలిపారు.