సాక్షి, చెన్నై : చెన్నైకు తెలుగు గంగ నీటి విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీంతో కొంత మేరకు నీటి బెంగ తీరినట్టే. అయితే, రెండు టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేయనున్న దృష్ట్యా, పూర్తి స్థాయిలో కొరతను అధిగమించేనా వేచిచూడాల్సిందే. తమిళనాడు రాజధాని నగరం చెన్నైకు తాగునీటిని అందిస్తున్న పుళల్, సెంబరంబాక్కం, పూండి చెరువుల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఎక్కడ నీటి ఎద్దడి చవి చూడాల్సి వస్తుందో అన్న ఆందోళన నెలకొంది. తమిళనాడుకు వాటాగా విడుదల చేయాల్సిన కృష్ణా జలాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా పన్నెండు టీఎంసీల మేరకు నీటి ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని పంపిణీ చేయాల్సి ఉంది.
ఈ నీటిని తొలుత పుళల్ చెరువులో తదుపరి సెంబరంబాక్కం, పూండి చెరువులకు మళ్లించడం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విన్నవించుకునేందుకు అధికారులు తీవ్రంగానే ప్రయత్నించారు. చెన్నైలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కనీసం మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ వర్గాలు లేఖలు రాశాయి. చివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అక్కడి అధికారులతో ఫోన్ ద్వారా జరిపిన సంప్రదింపులు ఫలితాన్నిచ్చాయి.
ప్రస్తుతానికి చెన్నైకు కండలేరు నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా రెండు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడంతో కొంత మేరకు నీటి బెంగ తీరినట్టే. తదుపరి మరో టీఎంసీ నీటిని విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం పరిశీలన సాగించిన పక్షంలో ప్రస్తుతానికి నీటి తిప్పల నుంచి చెన్నై గట్టెక్కినట్టే. అయితే, పూర్తి స్థాయిలో నీటి సమస్యను అధిగమించడం అనుమానమే. కాగా, ఈ నెల ఇరవై నుంచి ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో గండం నుంచి పూర్తిగా గట్టెక్కే అవకాశాలున్నాయి. లేని పక్షంలో గంగే దిక్కు.
తీరనున్న బెంగ !
Published Mon, Oct 10 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement
Advertisement