మెట్రో మోత.. | chennei metrorail collecting high parking chares | Sakshi

మెట్రో మోత..

Sep 29 2016 2:01 AM | Updated on Oct 16 2018 5:16 PM

మెట్రో చార్జీల కన్నా, పార్కింగ్ మోత అధికమైంది. గంట గంటకు రేటు పెరుగుతుండడంతో మెట్రో రైల్వేస్టేషన్లలో పార్కింగ్ చేయాలంటే వాహనదారుల జేబుకు చిల్లు పడినట్టే.

సాక్షి, చెన్నై : మెట్రో చార్జీల కన్నా, పార్కింగ్ మోత అధికమైంది. గంట గంటకు రేటు పెరుగుతుండడంతో మెట్రో రైల్వేస్టేషన్లలో పార్కింగ్ చేయాలంటే వాహనదారుల జేబుకు చిల్లు పడినట్టే. రైల్వే చార్జీల కన్నా, పార్కింగ్ చార్జీలు ఎక్కువగా ఉండడంతో, ఆ రైలు ఎక్కేందుకు వెనకడుగు వేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ కష్టాల నుంచి వాహన దారుల్ని గట్టెక్కించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విమానాశ్రయం నుంచి అన్నా సాలై మీదుగా సెంట్రల్ వరకు ఓ మార్గం, తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి ఎగ్మూరు, కోయంబేడులను కలుపుతూ సెయింట్థామస్ మౌంట్ వరకు మరో మార్గం అన్నట్టు ఈ పనులు సాగాయి.

కోయంబేడు నుంచి ఆలందూరు వరకు తొలి విడతగా పనులు ముగించి గత ఏడాది రైలును పట్టాలు ఎక్కించారు. గత వారం విమానాశ్రయం నుంచి చిన్న మలై వరకు పనులు ముగించి సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మార్గాల్లో రైలు చార్జీలు ఓ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు ఓ రేటు అన్నట్టుగా ఉంది. విమానాశ్రయం నుంచి కోయంబేడు, చిన్నమలైలకు రూ.50 చొప్పున చార్జీలను వసూళు చేస్తున్నారు. మధ్యలో వచ్చే స్టేషన్లకు ఒకటి తర్వాత మరొకటి చొప్పున రూ.10, రూ.20, రూ.30, రూ.40 చొప్పున చార్జీలను వసూళ్లు చేస్తున్నారు.

 కోయంబేడు-ఆలందరూ, చిన్నమలై-విమానాశ్రయం మార్గాల్లో పదకొండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలోనూ పార్కింగ్ సౌకర్యం కల్పించి ఉన్నారు. అయితే, ఈ పార్కింగ్ చార్జీలు రైల్వే చార్జీల కన్నా ఎక్కువే అన్నట్టుగా మోత మోగుతుండడంతో వాహనదారులు బెంబెలెత్తుతున్నారు. కోయంబేడు నుంచి విమానాశ్రయం వైపుగా లేదా, అక్కడి నుంచి చిన్నమలై వైపుగా పయనం సాగించే వాళ్లు ఆయా రైల్వే స్టేషన్లలోని పార్కింగ్‌లను ఉపయోగించుకుంటారు. అయితే, ఇక్కడ చార్జీలు గంట గంటకు పెరుగుతుండడం వాహన దారులకు మరింత భారంగా మారింది.

పార్కింగ్ మోత : మెట్రో స్టేషన్లలో పార్కింగ్ పది నిమిషాల నుంచి రెండు గంటల వరకు ద్విచక్ర వాహనాలకు రూ.25, నాలుగు చక్రాల వాహనాలకు రూ.150 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఆ తర్వాత గంట గంటకు చార్జీలు పెరుగుతుంటాయి. ఆ మేరకు ఒక గంటకు రూ.25 చొప్పున ద్విచక్ర వాహనాలకు, రూ.150 చొప్పున నాలుగు చక్రాల వాహనాలకు చార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఇక, నెలసరి చార్జీలు అయితే, ద్విచక్ర వాహనాలకు రూ.వెయ్యి, కార్లకు రూ.ఏడు వేలు.

ఈ మోత చెన్నై నగరంలోని అతి పెద్ద మాల్స్‌లో సాగుతున్న పార్కింగ్ దోపిడీలను తలపించే విధంగా సాగుతుండడంతో వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు. ఇక, మెట్రో ఎక్కడం కన్నా, తమ వాహనాల్లోనే ముందుకు సాగవచ్చన్న భావన వారిలో కలుగుతోంది. కోయంబేడు నుంచి విమానాశ్రయానికి మెట్రోలో ఇద్దరు వెళ్లి రావాలంటే రూ.రెండు వందలు అవుతుంది. పార్కింగ్‌కు రూ.25. ఆ తర్వాత  జరిగే ఆలస్యం మేరకు గంట గంటకు మోత మోగుద్ది.

 ఈ లెక్కల్ని బేరీజు వేసుకుంటే, మొత్తం సుమారు రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. అదే కోయంబేడు నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే, రూ.50కి పెట్రోల్ కొట్టిస్తే చాలు దూసుకెళ్లొచ్చు. ఈ దృష్ట్యా, పార్కింగ్ మోత, రైల్వే చార్జీల్ని పరిగణలోకి తీసుకుని ఎక్కువ శాతం మంది మెట్రో కన్నా, వాహనమే మిన్నా అన్నట్టుగా ద్విచక్ర వాహనాల్లో దూసుకెళ్తోండడం గమనార్హం. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్‌లోనే 24 గంటల పార్కింగ్‌కు రూ.30, చెన్నై ఎలక్ట్రిక్ ైరె ల్వే స్టేషన్లలో పన్నెండు గంటలకు రూ10 నుంచి రూ. 20 వరకు వసూళు చేస్తుంటే, మెట్రోలో మాత్రం పార్కింగ్ మోత అధికంగా ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement