ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
‘యూసీసీ గురించి మోదీ మాట్లాడుతూ ఇప్పటివరకు మనకు కమ్యూనల్ సివిల్ కోడ్ ఉందనటం చాలా అవమానకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మోదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానపరిచారు. చరిత్రను కించపర్చటంలో ప్రధాని మోదీకి ఎటువంటి హద్దు లేకుండా పోయింది. 1950లో అంబేద్కర్ హిందూ చట్టాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు ఆ సంస్కరణలను ఆర్‌ఎస్‌ఎస్, జన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించాయి’అని అన్నారు.
మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసగంలో.. ‘దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తనం మతపరమైన సివిల్ కోడ్‌తో 75 ఏళ్లు జీవించాం. ఇప్పుడు మనం సెక్యులర్ సివిల్ కోడ్ వైపు వెళ్లాలి. అప్పుడే దేశంలో మతపరమైన వివక్ష అంతం అవుతుంది. దీంతో సామాన్య ప్రజల మధ్య విభజన పరిస్థితులు దూరం అవుతాయి’అని అన్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మీడియాతో మట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విభజన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలమే తప్ప బలహీనత కాదు. మనకు స్వాతంత్య్రం తేలికగా వచ్చిందని కొందరు ప్రచారం చేస్తారు. కానీ, లక్షల మంది త్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment