న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై కేంద్రం తన విధానాన్ని, రోడ్ మ్యాప్‌ను పార్లమెంట్‌లో ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాల పరిమితితో కూడిన కార్యాచరణ(డెడ్ లైన్ల) ఆధారంగా కాకుండా ప్రచారం (హెడ్ లైన్ల) కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆక్షేపించారు. వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టు మందలించినందున ఇకనైనా ప్రధాని మోదీ కుంభకర్ణుడి నిద్రను వీడాలని ఎద్దేవా చేశారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి అహంభావం, వైఫల్యాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ప్రధానిపై ఆయన మండిపడ్డారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవాలనుకునే వారు డబ్బులు ఎందుకు చెల్లించాలని నిలదీశారు. దేశ ప్రజలందరికీ కోవిడ్ టీకా ఉచితంగా ఇవ్వాలనీ, అందరికీ ఆన్‌లైన్ అందు బాటులో లేనందున వ్యాక్సినేషన్ కోసం కోవిన్ యాప్‌లో నమోదు తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరారు. వ్యాక్సినేషన్ విధానం, అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ప్రత్యేకంగా పార్లమెంట్‌ను సమావేశపర్చాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల కేటాయింపు లో కేంద్రం పారదర్శకత పాటించాలన్నారు. సమాఖ్య సహకార సూత్రాన్ని అనుసరిస్తూ వివక్షను వదలి, వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందజేయాలని సూచించారు.
చదవండి: ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం
Comments
Please login to add a commentAdd a comment