న్యూఢిల్లీ: కరోనా సమయంలో సెంట్రల్ విస్టా పేరుతో రాజకీయాలు చేయటం మానుకోవాలని కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఆయన మంగళవారం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి నాలుగు పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలోనే నూతన పార్లమెంట్ కావాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. అదే విధంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సైతం కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్ నిర్మిస్తోందని తెలిపారు. కరోనా యోధులను అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన లేఖలో ప్రస్తావించారు. కరోనా విపత్తు సమయంలో కాంగ్రెస్ పార్టీ అనవసరమైన భయాలను సృష్టిస్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తోందన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో కాంగ్రెస్ నాయకులు వ్యాక్సిన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నడ్డా అన్నారు. కోవిడ్-19 మహమ్మారిని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నడ్డా ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ క్లిష్టసమయంలో విజ్ఞానశాస్త్రంపై నమ్మకం, ఆవిష్కరణలకు మద్దతు, కరోనా యోధుల సేవలకు గుర్తింపునిస్తూ తమ ప్రభుత్వం వైరస్ నియంత్రణలో ముందుకువెళుతుందని తెలిపారు.
కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు అర్థంలేని ఆరోపణలతో కరోనా వారియర్స్‌ను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. అయితే ఢిల్లీలో కోవిడ్‌కాలంలో కొనసాగుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నేరపూరిత వృథాగా సోమవారం సీడబ్ల్యూసీ అభివర్ణించింది. అదే విధంగా ప్రధాని మోదీ తన తప్పులను సరిదిద్దుకోవాలని, వ్యక్తిగత ఎజెండాను పక్కనబెట్టాలని దేశానికి సేవ చేయాలని సీబ్ల్యూసీ హితవుపలిన నేపథ్యంలో నడ్డా సోనియాకు లేఖ రాయటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment