సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్పీకరించినప్పటి నుంచి మూడోకంటికి తెలియకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు, ఆందోళనలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా అనూహ్యమైన చర్యలను చేపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, పాకిస్తాన్‌పై మెరుపుదాడులు, బాలాకోట్‌పై వైమానిక దాడి వంటి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రత్తిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఈ చర్య దేశ ప్రజలనే కాక యావత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా పార్లమెంట్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. దీంతో మోదీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, దేనిపై తీసుకుంటారన్న అంశం ఉత్కంఠగా మారింది.
ఉమ్మడి పౌరస్మృతి..
ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు మోదీ సర్కారు తదుపరి అడుగు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టడం వైపేనా! ఆ దిశగా ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకోనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే వీటికి ‘ఔను’ అనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి.. ఇవన్నీ దశాబ్దాలుగా బీజేపీ ఎజెండాలో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యంకాలేదు. లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సరిపడ బలం లేకపోవడంతో సర్కార్ ఆచితూచి అడుగులు వేసింది. ప్రస్తుతం ఇలాంటి అనుమానాలకు అంతగా తావులేకుండా పార్లమెంట్‌లో ప్రత్యేమైన వ్యూహాలను రచిస్తున్నారు. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ ఉండటం, రాజ్యసభలో కూడా విపక్షాల నుంచి అంతోకొంత మద్దతు లభించడం కేంద్ర ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం.
ఊపునిచ్చిన ట్రిపుల్ తలాక్..
370 ఆర్టికల్‌ను మోదీ సర్కారు నిర్వీర్యం చేయడంతో బీజేపీ సర్కారు తన మేనిఫేస్టోలో ప్రకటించిన ‘హామీ’లను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో సంఖ్యాపరంగా, సిద్ధాంతపరంగా పరిమితులున్నా ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లు, 370 ఆర్టికల్‌ను రద్దు చేసే బిల్లు ఆమోదం పొందడం బీజేపీ సర్కారుకు ఊపునిచ్చింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేసేందుకు బీజేపీ ఇక ఎంత మాత్రం సందేహించకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.
మన దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంశం చాలాకాలంగా ఆలోచనల స్థాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకూ ఎలాంటి ఫలవంతంగా చర్చలు గానీ, నిర్ణయాలు గానీ జరగలేదు. ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంలో ఏకపంక్తి వాక్యంలో ప్రస్తావించారు. ప్రభుత్వం భారత భూ భాగమంతటా పౌరులందరికీ ఒకే విధమైన పౌరస్మృతి తీసుకొని రావటానికి ప్రయత్నించవలెను అని మాత్రమే రాసి ఉండడంతో దీనిపై ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకూ సరైన నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దేశంలో ఒక్క గోవాలో మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దీనిని దేశమంతా అమలు చేయండని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment