ఆమె గర్భం తొలగింపునకు అనుమతించం: సుప్రీం కీలక తీర్పు | Supreme Court Rejects Woman Request To Terminate 26 Week Pregnancy | Sakshi
Sakshi News home page

ఆమె గర్భవిచ్చిత్తికి అనుమతించం: చర్చనీయాంశంగా మారిన కేసులో కీలక తీర్పు

Published Mon, Oct 16 2023 3:49 PM | Last Updated on Mon, Oct 16 2023 4:31 PM

Supreme Court Rejects Woman Request To Terminate 26 Week Pregnancy - Sakshi

సాక్షి, ఢిల్లీ: తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆమె విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరస్కరించింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్‌ అనుమతి కోరుతున్నారా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని, వైద్య నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది.

‘‘గర్భం 26 వారాలు మరియు 5 రోజులు. ఇది పిండం అసాధారణతకు సంబంధించింది కాదు. ఏ రకంగానూ తల్లికి తక్షణ ప్రమాదమూ లేదు. కాబట్టి..  గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ తీర్పు ఇస్తే.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌లోని సెక్షన్‌ 3, సెక్షన్‌ 5లను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి.. ఆ గుండె చప్పుడును ఆపలేం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బిడ్డ పుట్టాక బాధ్యతల్ని ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారాయన. 

తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని.. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. ఈ పిటిషన్‌పై తొలుత విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. అయితే, ఆ మరుసటిరోజే ‘‘పిండం బతికే అవకాశాలు ఉన్నాయి’’ అని ఎయిమ్స్‌ వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఎయిమ్స్‌ నివేదికపై ద్విసభ్య ధర్మాసనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో.. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్రం చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ముందర పిటిషన్‌ దాఖలు చేసింది. 

దీంతో ఈ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ క్రమంలోనే గర్భవిచ్ఛిత్తి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ కొనసాగించింది. ‘‘తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్‌ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘‘ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు సూచించింది. తదనంతర వాదనలు.. పిండంలో ఎలాంటి అసాధారణతలు లేవని ఎయిమ్స్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి మహిళను అనుమతించబోమంటూ తీర్పు ఇవాళ ఇచ్చింది.

భిన్న తీర్పులు.. కీలక వ్యాఖ్యలు
అక్టోబర్‌ 9వ తేదీన మహిళ గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్‌ 10వ తేదీన ఎయిమ్స్‌ వైద్య బృందంలోకి ఓ డాక్టర్‌ కీలకాంశం వెల్లడించారు. పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. దీంతో.. ఈ అంశం ద్విసభ్య ధర్మాసనం ముందుకు మళ్లీ వచ్చింది. అయితే ఈ మధ్యలోనే ద్విసభ్య ధర్మాసనం తీర్పుపై కేంద్రం  చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ముందుకు వెళ్లింది. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి పిటిషన్‌ వేశారు. 

ఈ పరిణామంపై జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నలు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది సుప్రీం కోర్టు. ఇందులో ఏ బెంచ్‌ అయినా కీలకమే. మేం తీర్పు ఇచ్చాక.. మళ్లీ ఇదే పరిధిలోని బెంచ్‌ ముందుకు వెళ్లడం ఏంటి?.  కేంద్రమే ఇలా చేస్తే.. రేపు ప్రైవేట్‌ వ్యక్తులు ఇలా చేయరా?’’ అని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ఎయిమ్స్‌ వైద్యులు ఇచ్చిన నివేదికపై ఇద్దరు మహిళా జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

జస్టిస్‌నాగరత్న.. మహిళ మానసిక స్థితి ఆధారంగా గర్భవిచ్చిత్తికి అనుమతించిన గత తీర్పునే సమర్థించగా..  జస్టిస్‌ హిమా కోహ్లీ మాత్రం అంతరాత్మను అనుసరించి అందుకు అంగీకరించబోనని, గర్భంలోని పిండానికి హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో..  చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌.. ప్రకారం 24 వారాల్లోపు అబార్షన్‌కు అనుమతి ఉంటుంది. అంతకు మించి అబార్షన్‌ జరగాలంటే.. దివ్యాంగులు,  మైనర్‌ బాలికలు, రేప్‌ బాధితురాలు, మానసిక స్థితి సరిగా లేనివాళ్లు .. ఇలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చట్టం అనుమతిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement