న్యూఢిల్లీ: ఓ ఇరవై ఏళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకునేందుకు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం(మే15) కీలక తీర్పిచ్చింది.
తన గర్భం తొలగించుకునేందుకు అనుమతివ్వాలని యువతి చేసిన విజ్ఞప్తిని గతంలో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో యువతి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ‘సారీ ఈ విషయంలో మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం’ అని తెలిపింది.
యువతి తరపు న్యాయవాదికి సుప్రీం ప్రశ్నలివీ...
గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కుంది. దీనికి మీరేమంటారు’ అని యువతి తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కేవలం తల్లి గురించే చెబుతోందని యువతి న్యాయవాది సమాధానమిచ్చారు.
బెంచ్ తిరిగి స్పందిస్తూ ‘ఇప్పుడు గర్భం 7 నెలలు దాటింది. గర్భస్త శిశువుకు ఉన్న బతికే హక్కుపై మీరేం చెప్తారో చెప్పండి’ అని బెంచ్ మళ్లీ న్యాయవాదిని అడిగింది. ‘శిశువు జన్మించేదాకా అది తల్లి హక్కే తప్ప శిశువుకు ప్రత్యేక హక్కులేవీ ఉండవు.
యువతి మానసికంగా చిత్రవధను అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఆమె ప్రస్తుతం నీట్ పరీక్ష క్లాసులు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె సమాజానికి ముఖం చూపించలేరు. యువతి మానసిక, శారీరక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి’అని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి బెంచ్ స్పందిస్తూ ‘సారీ’అని సమాధానమిచ్చింది.
యువతి, ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఇప్పటికే సర్టిఫై చేసింది. కాగా, 24 వారాలు దాటిన గర్భం తీయించుకోవాలంటే తల్లికి, శిశువుకుగాని ఆరోగ్యపరంగా ఏదైనా హాని ఉంటేనే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment