న్యూఢిల్లీ: మానసిక, ఆర్థిక సమస్యలతో 26 వారాల గర్బాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనుమతినివ్వాలంటూ ఒక వివాహిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానసిక కుంగుబాటుతో ఉన్న తాను ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా ఇంకో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా లేనని, అబార్షన్ చేసుకునేందుకు అనుమతించాలని ఏడోనెల గర్భంతో ఉన్న మహిళ ఒకరు కోర్టును ఆశ్రయించింది.
అయితే గర్భాన్ని కొనసాగించడంపై నిర్ణయం తల్లిదే అయినప్పటికీ జీవంతో కూడిన, అన్ని రకాలుగానూ సవ్యంగా ఉన్న పిండాన్ని విచ్చిన్నం చేయడం కూడా అంత సరైన నిర్ణయం కాదని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒక శిశువును చంపలేము’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తల్లిగా ఆమెకున్న హక్కులకు, బతికేందుకు ఆ శిశువుకు ఉన్న హక్కుకు మధ్య సమతౌల్యత పాటించాల్సిన అవసరముందని చెబుతూ అబార్షన్‌ను నిరాకరించారు. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇరవై ఆరు వారాల గర్భంతో ఉన్న మహిళ అబార్షన్‌కు అనుమతించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 9న విచారించిన ధర్మాసనం అబార్షన్‌కు అనుమతినిచ్చింది. అయితే మరుసటి రోజు ఏయిమ్స్ అధికారులు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి లేఖ రాశారు. గర్భంలో పిండం ఆరోగ్యంగా ఉందని, విచ్చిన్నం చేసినా సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. సుప్రీం ఉత్తర్వులను రీకాల్ చేయాలని కోరుతూ కేంద్రం మరో పిటిషన్ వేసింది.
ఈ కేసు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ గర్భంలోని పిండం గుండెను నిలిపివేసేలా న్యాయస్థానం ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులను ఆదేశించాలని పిటిషర్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది. గర్భం ఒకరి బలవంతంమీద కొనసాగిస్తున్నా.. బిడ్డ పుడితే వచ్చే పరిణామాలను అర్థం చేసుకోలేని మైనర్ విషయంలోనైనా అబార్షన్‌కు అనుమతించవచ్చునని ధర్మాసనం సూచించింది.
ఈ కేసులోనూ పిటిషనర్ అభ్యర్థనను మన్నిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ దశలో వైద్య నివేదికలు చెప్పిన విషయంతో ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అబార్షన్ చేయాల్సి వస్తే పిండం గుండె కొట్టుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని వైద్య నివేదికలు తెలిపాయి. దీంతో జస్టిస్ హిమా కోహ్లీ తన మునుపటి నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బతికి ఉన్న పిండం గుండెను నిలిపేయాల్సిందిగా ఏ న్యాయస్థానమూ చెప్పజాలదని వ్యాఖ్యానించారు.
అబార్షన్‌కు అనుమతించలేమని చెప్పారు. మరోవైపు జస్టిస్ బి.వి.నాగరత్న మాత్రం గర్భం కొనసాగింపుపై సర్వహక్కులు తల్లివే అన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో కేసు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అక్టోబరు 11వ తేదీ అంటే గురువారం దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ అబార్షన్‌ను తోసిపుచ్చుతూనే బతికి ఉన్న పిండాన్ని చంపలేమని, ఇరువురి హక్కుల మధ్య సమతౌల్యత పాటించాలని సూచించారు. 26 వారాలుగా గర్భాన్ని మోసిన ఆమె మరికొన్ని వారాలు మోస్తే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉందని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది.
దీనిపై ఆ మహిళతో మాట్లాడి నచ్చజెప్పాలని పేర్కొంది. ఆ బాధ్యతని పిటిషనర్ లాయర్‌కి, కేంద్రానికి అప్పగిస్తూ కేసుని శుక్రవారానికి వాయిదా వేసింది. దేశంలో చట్టప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 24 వారాల వరకు గర్భ విచ్ఛిన్నానికి అవకాశం ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment