right to live
-
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ఓ ఇరవై ఏళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకునేందుకు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం(మే15) కీలక తీర్పిచ్చింది. తన గర్భం తొలగించుకునేందుకు అనుమతివ్వాలని యువతి చేసిన విజ్ఞప్తిని గతంలో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో యువతి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు ‘సారీ ఈ విషయంలో మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం’ అని తెలిపింది. యువతి తరపు న్యాయవాదికి సుప్రీం ప్రశ్నలివీ... గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కుంది. దీనికి మీరేమంటారు’ అని యువతి తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కేవలం తల్లి గురించే చెబుతోందని యువతి న్యాయవాది సమాధానమిచ్చారు.బెంచ్ తిరిగి స్పందిస్తూ ‘ఇప్పుడు గర్భం 7 నెలలు దాటింది. గర్భస్త శిశువుకు ఉన్న బతికే హక్కుపై మీరేం చెప్తారో చెప్పండి’ అని బెంచ్ మళ్లీ న్యాయవాదిని అడిగింది. ‘శిశువు జన్మించేదాకా అది తల్లి హక్కే తప్ప శిశువుకు ప్రత్యేక హక్కులేవీ ఉండవు.యువతి మానసికంగా చిత్రవధను అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఆమె ప్రస్తుతం నీట్ పరీక్ష క్లాసులు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె సమాజానికి ముఖం చూపించలేరు. యువతి మానసిక, శారీరక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి’అని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి బెంచ్ స్పందిస్తూ ‘సారీ’అని సమాధానమిచ్చింది. యువతి, ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఇప్పటికే సర్టిఫై చేసింది. కాగా, 24 వారాలు దాటిన గర్భం తీయించుకోవాలంటే తల్లికి, శిశువుకుగాని ఆరోగ్యపరంగా ఏదైనా హాని ఉంటేనే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద అనుమతిస్తారు. -
‘బెయిల్ చట్టం’ తీసుకురండి..
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో నిందితులను జైలు నుంచి విడుదల చేసే విషయంలో క్రమబద్ధత సాధించేందుకు బెయిల్ చట్టం తీసుకువచ్చే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. చట్టంలో పొందుపరిచిన స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలి, రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్వాతంత్య్రానికి పూర్వమున్న విధానానికి కొనసాగింపు మాత్రమేనని పేర్కొంది. దేశంలోని జైళ్లు విచారణ ఖైదీలతో కిక్కిరిసిపోయాయని తెలిపింది. గుర్తించదగిన నేరాన్ని నమోదు చేసినప్పటికీ వీరిలో ఎక్కువ మందిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై పోలీసు రాజ్యమనే ముద్ర పడరాదని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
‘గృహ హింస’ బాధితురాలికి ఊరట
న్యూఢిల్లీ: గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెలువరించింది. బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గృహ హింస(డొమెస్టిక్ వయోలెన్స్– డీవీ) చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ‘ఏ సమాజ అభివృద్ధి అయినా అక్కడి మహిళల హక్కులను రక్షించే, ప్రోత్సహించే సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. డీవీ చట్టంలో ‘ఉమ్మడి గృహం(షేర్డ్ హౌజ్హోల్డ్)’ నిర్వచనం బాధిత మహిళకు నివాస హక్కు కల్పించే విధంగా విస్తృతార్థంలో ఉంటుందని, దానికి గత తీర్పులో పేర్కొన్న వివరణ సరిగా లేదని తోసిపుచ్చింది. ‘బాధిత మహిళ భర్తకు వాటా ఉన్న ఉమ్మడి కుటుంబం నివసించే ఇల్లు’ అనే అర్థంలో మాత్రమే ఉమ్మడి గృహం నిర్వచనాన్ని తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఉమ్మడి గృహం అంటే బాధిత మహిళ నివసిస్తున్న, లేదా గతంలో భర్తతో కలిసి నివసించిన సొంత లేదా అద్దె ఇల్లు అనే అర్థం కూడా ఉంటుందని పేర్కొంది. దీన్ని బట్టి బాధిత మహిళకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. డీవీ క్రిమినల్ కేసు విచారణలో సంబంధిత ఉమ్మడి గృహంలో బాధిత మహిళకు కూడా హక్కు ఉంటుందని పేర్కొంటూ ఇచ్చిన మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను.. ఆ ఇంటి హక్కుకు సంబంధించిన సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించాలని సివిల్ కోర్టుకు సూచించింది. ఢిల్లీకి చెందిన 76 ఏళ్ల సతీశ్ చందర్ అహూజా వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఢిల్లీలోని స్వగృహం పూర్తిగా తనదేనని, దానిపై తన కుమారుడికి కానీ, కోడలుకు కానీ ఎలాంటి హక్కు లేదని పేర్కొంటూ అహూజా స్థానిక కోర్టులో దావా వేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు తన భార్య నుంచి విడాకులు కోరుతూ మరో కేసు దాఖలు చేశారు. మరోవైపు, ఆయన కోడలు గృహ హింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టారు. అహూజా వేసిన కేసుని విచారించిన స్థానిక సివిల్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ ఇంటినుంచి కోడలు వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనిపై ఆయన డిక్రీ తెచ్చుకున్నారు. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక క్రిమినల్ కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆమెను ఆ ఇంటినుంచి పంపివేయవద్దని తీర్పునిచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలనిచ్చింది. గృహ హింస చట్టం చరిత్రాత్మకం ఈ సందర్భంగా 2005లో వచ్చిన గృహ హింస చట్టం మహిళల రక్షణకై వచ్చిన మైలురాయి వంటి చట్టమని సుప్రీంకోర్టు ప్రశంసించింది. మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. ‘కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, భాగస్వామిగా, ఒంటరి మహిళగా.. జీవితాంతం స్త్రీ హింసను, వివక్షను, వేధింపులను భరిస్తూనే ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదులు అతి తక్కువగా వచ్చే హింస ఇదేనని, మెజారిటీ మహిళలు తప్పనిసరై మౌనంగా ఆ హింసను భరిస్తున్నారని వాపోయింది. ‘ఇళ్లల్లో హింసను భరించే మహిళలకు, ఆ హింసను ఎదిరించే చట్టపరమైన స్పష్టమైన మార్గాలు 2005 వరకు ఎక్కువగా లేవు. ఆ తరువాత వచ్చిన గృహ హింస చట్టం ఆ లోటు తీర్చింది’ అని పేర్కొంది. -
వీధికుక్కకూ బతికే హక్కుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వీధి కుక్కలకూ బతికే హక్కుందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని చోట్ల వీధి కుక్కల ఏరివేత సాగుతోందని అయితే దానికి కూడా సరైన పద్ధతిని.. సమానత్వాన్ని పాటించాలని జస్టిస్ దీపక్ మిస్రా, జస్టిస్ ఆర్.బానుమతిలతో కూడిన న్యాయం స్థానం సూచించింది. దేశంలో ఉన్న వీధికుక్కలన్నింటిని నిర్మూలించాలని తాను భావిస్తున్నానంటూ పిటిషనర్లలోని ఓ వ్యక్తి పేర్కొనగా.. కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘వీధి కుక్కలను ఎవరూ పూర్తిగా నిర్మూలించలేరు.. వాటికీ బతికే హక్కుంది’అంటూ పేర్కొంది. కోర్టు నిర్ణయంతో అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) పింకీ ఆనంద్ కూడా ఏకీభవించారు. వీధికుక్కలు ప్రజలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయంటూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారించింది. ముఖ్యంగా కేరళ, ముంబై నుంచి ఎక్కువ సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. కేరళ నుంచి దాఖలైన ఓ పిటిషన్ను విచారిస్తూ.. ఒక కుక్క కరిచిందని అన్నింటిని చంపుతామనడం సమజసం కాదని.. అలా తీర్పునివ్వలేమని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే అది ప్రమాదంగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.