వీధికుక్కకూ బతికే హక్కుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వీధి కుక్కలకూ బతికే హక్కుందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని చోట్ల వీధి కుక్కల ఏరివేత సాగుతోందని అయితే దానికి కూడా సరైన పద్ధతిని.. సమానత్వాన్ని పాటించాలని జస్టిస్ దీపక్ మిస్రా, జస్టిస్ ఆర్.బానుమతిలతో కూడిన న్యాయం స్థానం సూచించింది. దేశంలో ఉన్న వీధికుక్కలన్నింటిని నిర్మూలించాలని తాను భావిస్తున్నానంటూ పిటిషనర్లలోని ఓ వ్యక్తి పేర్కొనగా.. కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
‘వీధి కుక్కలను ఎవరూ పూర్తిగా నిర్మూలించలేరు.. వాటికీ బతికే హక్కుంది’అంటూ పేర్కొంది. కోర్టు నిర్ణయంతో అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) పింకీ ఆనంద్ కూడా ఏకీభవించారు. వీధికుక్కలు ప్రజలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయంటూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారించింది. ముఖ్యంగా కేరళ, ముంబై నుంచి ఎక్కువ సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. కేరళ నుంచి దాఖలైన ఓ పిటిషన్‌ను విచారిస్తూ.. ఒక కుక్క కరిచిందని అన్నింటిని చంపుతామనడం సమజసం కాదని.. అలా తీర్పునివ్వలేమని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే అది ప్రమాదంగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.