‘గృహ హింస’ బాధితురాలికి ఊరట | Wife Entitled to Live In Property owned by Husband Relatives | Sakshi
Sakshi News home page

‘గృహ హింస’ బాధితురాలికి ఊరట

Published Fri, Oct 16 2020 3:56 AM | Last Updated on Fri, Oct 16 2020 3:56 AM

Wife Entitled to Live In Property owned by Husband Relatives - Sakshi

న్యూఢిల్లీ: గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెలువరించింది. బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గృహ హింస(డొమెస్టిక్‌ వయోలెన్స్‌– డీవీ) చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్‌ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా ‘ఏ సమాజ అభివృద్ధి అయినా అక్కడి మహిళల హక్కులను రక్షించే, ప్రోత్సహించే సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది’ అని  పేర్కొంది. డీవీ చట్టంలో ‘ఉమ్మడి గృహం(షేర్‌డ్‌ హౌజ్‌హోల్డ్‌)’ నిర్వచనం బాధిత మహిళకు నివాస హక్కు కల్పించే విధంగా విస్తృతార్థంలో ఉంటుందని, దానికి గత తీర్పులో పేర్కొన్న వివరణ సరిగా లేదని తోసిపుచ్చింది. ‘బాధిత మహిళ భర్తకు వాటా ఉన్న ఉమ్మడి కుటుంబం నివసించే ఇల్లు’ అనే అర్థంలో మాత్రమే ఉమ్మడి గృహం నిర్వచనాన్ని తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఉమ్మడి గృహం అంటే బాధిత మహిళ నివసిస్తున్న, లేదా గతంలో భర్తతో కలిసి నివసించిన సొంత లేదా అద్దె ఇల్లు అనే అర్థం కూడా ఉంటుందని పేర్కొంది. దీన్ని బట్టి బాధిత మహిళకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. డీవీ క్రిమినల్‌ కేసు విచారణలో సంబంధిత ఉమ్మడి గృహంలో బాధిత మహిళకు కూడా హక్కు ఉంటుందని పేర్కొంటూ ఇచ్చిన మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను.. ఆ ఇంటి హక్కుకు సంబంధించిన సివిల్‌ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించాలని సివిల్‌ కోర్టుకు సూచించింది.


ఢిల్లీకి చెందిన 76 ఏళ్ల సతీశ్‌ చందర్‌ అహూజా వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఢిల్లీలోని స్వగృహం పూర్తిగా తనదేనని, దానిపై తన కుమారుడికి కానీ, కోడలుకు కానీ ఎలాంటి హక్కు లేదని పేర్కొంటూ అహూజా స్థానిక కోర్టులో దావా వేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు తన భార్య నుంచి విడాకులు కోరుతూ మరో కేసు దాఖలు చేశారు. మరోవైపు, ఆయన కోడలు గృహ హింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టారు. అహూజా వేసిన కేసుని విచారించిన స్థానిక సివిల్‌ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ ఇంటినుంచి కోడలు వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనిపై ఆయన డిక్రీ తెచ్చుకున్నారు. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక క్రిమినల్‌ కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆమెను ఆ ఇంటినుంచి పంపివేయవద్దని తీర్పునిచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలనిచ్చింది.

గృహ హింస చట్టం చరిత్రాత్మకం
ఈ సందర్భంగా 2005లో వచ్చిన గృహ హింస చట్టం మహిళల రక్షణకై వచ్చిన మైలురాయి వంటి చట్టమని సుప్రీంకోర్టు ప్రశంసించింది. మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. ‘కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, భాగస్వామిగా, ఒంటరి మహిళగా.. జీవితాంతం స్త్రీ హింసను, వివక్షను, వేధింపులను భరిస్తూనే ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదులు అతి తక్కువగా వచ్చే హింస ఇదేనని,  మెజారిటీ మహిళలు తప్పనిసరై మౌనంగా ఆ హింసను భరిస్తున్నారని వాపోయింది. ‘ఇళ్లల్లో హింసను భరించే మహిళలకు, ఆ హింసను ఎదిరించే చట్టపరమైన స్పష్టమైన మార్గాలు 2005 వరకు ఎక్కువగా లేవు. ఆ తరువాత వచ్చిన గృహ హింస చట్టం ఆ లోటు తీర్చింది’ అని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement