
- తేజస్వీ యాదవ్ కు సీఎం నితీష్ స్ట్రాంగ్ కౌంటర్
- అసెంబ్లీ వేదికగా ఇరువురి మధ్య మాటల యుద్ధం
- బీహార్ కు ఏం చేశారంటూ తేజస్వీ నిలదీత
- మీ నాన్నను తయారు చేసింది నేనే అంటూ నితీష్ ఘాటు రిప్లై
- మీరు ప్రస్తుతాన్ని వదిలేసి.. గతాన్నే తవ్వుకుంటూ పబ్బం గడుపుతున్నారు: తేజస్వీ యాదవ్
పాట్నా: బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ హవా నడిస్తే.. ఇప్పుడు నితీష్ కుమార్ దే శాసనం. అటు ఇండియా కూటమిలో ఉండాలన్నా, అంతే త్వరగా దానికి ఎండ్ కార్డ్ వేసి ఎన్డీయే కూటమిలో చేరాలన్నా ఆయనకే చెల్లింది. ఆయన ఏ కూటమితో జట్టు కట్టినా తన సీఎం పదవికి ఢోకా లేకుండా చూసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు నితీష్ కుమార్.
అయితే ఇదే అంశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన ఆర్జేడీ నాయకుడు, తేజస్వీ యాదవ్.. అసెంబ్లీ వేదికగా లేవనెత్తారు. బీహార్ లో నితీష్ పాలన ‘పొలిటికల్ షిప్ట్స్’ మాదిరిగా ఉంది అంటూ విమర్శించారు.ఈరోజు(మంగళవారం) బీహార్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం నితీష్ మాట్లాడే సమయంలో తేజస్వీ యాదవ్ అడ్డుకున్నారు. ఎన్డీఏ నేతృత్వంలోని మన ప్రభుత్వం బీహార్ ను అభివృద్ధి పధంలో తీసుకెళుతోందని నితీష్ వ్యాఖ్యానించగా, అందుకు తేజస్వీ యాదవ్ అడ్డుతగిలారు.
అసలు బీహార్ కు ఏం చేశారో చెప్పండి అంటూ నిలదీశారు. అందుకు తీవ్రంగా స్పందించిన సీఎం నితీష్.. అంతకుముందు బీహార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే రీతిలో సమాధానమిచ్చారు. ‘ నేను ఏం చేశానో మీ తండ్రి లాలూను అడుగు. మీ తండ్రి రాజకీయంగా ఎదగడానికి నేనే కారణం. మీ నాన్న పొలిటికల్ కెరీర్ ఎదిగింది అంటే అందులో నాది ప్రధాన పాత్ర. మీ నాన్నకు సపోర్ట్ చేయడాన్ని మీ కులంలోని వాళ్లే వ్యతిరేకించే వారు. ఎందుకు అలా చేస్తున్నావ్ అంటూ నన్ను అడిగే వారు. కానీ మీ నాన్నను తయారు చేసింది నేనే. ఇప్పటికీ మీ నాన్నకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను’ అని రిప్లై ఇచ్చారు నితీష్.
దీనికి తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ప్రస్తుత బీహార్ పరిస్థితి గురించి అడిగితే.. 2005 కు ముందు బీహార్ చరిత్ర చెబుతారు నితీష్ అంటూ ఎద్దేవా చేశారు. నితీష్ చెప్పేదానిని బట్టి.. 2005కు ముందు బీహార్ ఉనికే లేదంటారా? అంటూ ప్రశ్నించారు తేజస్వీ. ఈ ప్రభుత్వం ప్రస్తుతం కన్ ఫ్యూజన్ లో ఉందని, రిక్రూట్ మెంట్ కు సంబంధించి గత హామీలనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు అంటూ తేజస్వీ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment