మీడియాకి తన గోడు వినిపించుకుంటున్న బాధితురాలు
బరంపురం (ఒడిశా): యువతి తపస్విని దాస్, వైద్యుడు సుమిత్ సాహుల వివాహబంధం రోజురోజుకూ జటిలమవుతోంది. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఒకే ఇంట్లో కొంతకాలం కలసిమెలసి జీవించారు. ఉన్నట్టుండి తపస్వినిని ఉన్నచోటనే ఉంచి సుమిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్త రాక కోసం కొన్నాళ్ల పాటు వేచి చూసినా ఆమెకు నిరాశ తప్పలేదు. దీంతో మోసం చేశాడని భావించిన యువతి, బరంపురంలోని బ్రాహ్మనగర్ రెండో లైన్‌లోని భర్త ఇంటిని చేరుకుని ధర్నాకి దిగింది.
తన భర్త తనకు కావాలని అభ్యర్థిస్తూ పెళ్లి బట్టలతో నిరసన చేపట్టింది. ఈ క్రమంలో ఆమెకి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో బాధితురాలు కోర్టుని ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల విచారణ చేపట్టిన బరంపురం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టు భార్యతో కలిసి ఉండాలని సుమిత్‌ని ఆదేశించింది. వారి వైవాహిక జీవితంలో వేరొకరు జోక్యం చేసుకోరాదని, భార్యాభర్తలిద్దరూ వేరేచోట ఒకే ఇంట్లో కలిసి ఉండాలని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు సుమిత్ భార్యతో కలిసి ఉండేందుకు అంగీకరించాడు.
చదవండి: (ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై..)
గ్రామంలో 144 సెక్షన్..
మళ్లీ 6 రోజుల క్రితం భార్యని వదిలి సుమిత్ వెళ్లిపోవడంతో యువతి తన అత్తవారింటి ఎదుట మళ్లీ నిరసనకు దిగింది. తీవ్రమైన చలిలో వంటా వార్పు అక్కడే చేసుకుని, ఉంటున్న ఆమె పడుతున్న కష్టం చూసి, స్థానికులు చలించిపోయారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా సుమిత్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇంటి ప్రధాన గేటు బద్దలు కొట్టి ఆ ఇంట్లో ఉన్న వారితో ఘర్షణకు దిగారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆమె వెంట ఉంటామని హెచ్చరించారు. ఇరువర్గాల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను సద్దుమణిగించారు. ప్రస్తుతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment