న్యాయమూర్తులు అప్రమత్తంగా ఉండాలి
మాజీ సీజేఐ చంద్రచూడ్ హితవు
న్యూఢిల్లీ: కోర్టుల తీర్పులను ప్రభావితం చేయడానికి కొన్ని ఒత్తిడి గ్రూప్‌లు ప్రయత్నిస్తున్నాయని, అందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తీర్పులను ప్రభావితం చేయడం ద్వారా సొంత ప్రయోజనాలు సాధించుకోవాలని ఆశిస్తున్న ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యాయమూర్తులకు సూచించారు.
‘‘యూట్యూబ్‌లో 20 సెకండ్ల వీడియో చూసి ప్రజలు అభిప్రాయం ఏర్పర్చుకుంటున్న పరిస్థితి! వారిపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతోంది. అభిప్రాయాలను నిర్దేశిస్తోంది. ఇది ప్రమాదకర పరిణామం’’ అన్నారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, తీసుకున్న నిర్ణయాలకు ఆధారం ఏమిటన్నది తెలుసుకొనే అవకాశం, దానిపై అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉన్నప్పటికీ అది జడ్జిలను టార్గెట్ చేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకంగా కొందరు జడ్జిలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నిజంగా భావవ్యవస్థీకరణ స్వేచ్ఛ అంటే ఇదేనా? అనే ప్రశ్న తలెత్తుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఎన్‌డీటీవీ ఆధ్వర్యంలో జరిగిన సంవిధాన్–75 సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ఎలాంటి ఆంక్షలు, నిరోధకాలు, బాధ్యతలు లేకుండా ఇలా ప్రైవేట్ పౌరుడిగా ఉండడం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 10న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను జస్టిస్ చంద్రచూడ్ సమరి్థంచారు. న్యాయమూర్తులు సైతం నిరభ్యంతరంగా రాజకీయాల్లో చేరవచ్చని, రాజ్యాంగం అందుకు ఎలాంటి అడ్డుకట్టలు వేయడం లేదని పేర్కొన్నారు. క్రికెట్ తనకు చాలా ఇష్టమైన క్రీడ అని చెప్పారు. జస్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్లు అని వ్యాఖ్యానించారు. ఒకప్పటి క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్‌ను అభిమానిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment