
భద్రాద్రి: చదువు మాన్పించి పెళ్లి చేశారనే మనస్తాపంతో నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్యబంజర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన భూక్యా దేవకి(23) ఈ ఏడాది కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులకు వెళ్తానని పట్టుబట్టినా.. తల్లి ఆరోగ్యం బాగుండడం లేదనే సాకుతో కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పించారు.
ఇదే మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్ బాలరాజుతో మార్చి 28న దేవకికి వివాహం జరిపించారు. కాగా, 16 రోజుల పండుగ నిమిత్తం నూతన వధూవరులను ఈనెల 12న మంగయ్యబంజర్ తీసుకొచ్చారు. 13వ తేదీ అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవకి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను మొదట జూలూరుపాడు ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. తల్లి భూక్యా పద్మ ఫిర్యాదు మేరకు చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment