ఉన్నత విద్యామండలిలో ఫైళ్ల విభజన
అంగీకరించిన టీ-సర్కారు
దీనిపై రెండు రాష్ట్రాల నుంచి 8 మంది అధికారులతో కమిటీ
ఇరు రాష్ట్రాల విద్యా మంత్రుల భేటీలో నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధీనంలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన ఫైళ్ల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఏపీ ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్న భవనంలో చోటు కల్పించే విషయంలో మాత్రం అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి ఏపీకి చెందిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఫైళ్లు తమకు ఇవ్వడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం గంటా శ్రీనివాసరావుతో కలసి గవర్నర్‌ను కలసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి....నరసింహన్ సూచన మేరకు తన చాంబర్‌లో గంటా శ్రీనివాసరావుతో భేటీఅయ్యారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలి విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సెలింగ్ నిర్వహణకు ఫైళ్లు, సిబ్బంది ఏపీ కౌన్సిల్‌కు అవసరం ఉన్నందున ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఇందుకు రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున అధికారులతో కమిటీ వేయాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. ఆ కమిటీ ఫైళ్లను పరిశీలించి విభజించనుంది. సమావేశం అనంతరం కడియం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వారికి కౌన్సెలింగ్ సజావుగా జరిగేందుకు ఈ మేరకు అంగీకరించినట్లు తెలిపారు.ఇందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. పదో షెడ్యూలులోని మిగితా అంశాలపై తరువాత మరోసారి సమావేశం అవుతామని, అవసరమైతే ముఖ్యమంత్రులు, గవర్నర్ సమావేశమై చర్చిస్తారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మరోవైపు వరంగల్ ఎన్‌ఐటీలో తమకు సీట్ల విషయమై త్వరలో హైదరాబాద్ రానున్న కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చిస్తామని గంటా పేర్కొనగా ఏపీలో మరో ఎన్‌ఐటీ కావాలని అడగాలంటూ కడియం చమత్కరించారు.