మార్చి క్వార్టర్‌లో 3.4 శాతం పెరుగుదల
2023 డిసెంబర్‌కు రూ.166 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్) 3.4 శాతం మేర పెరిగి రూ.171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్–డిసెంబర్) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్ డెట్ (బాండ్లు, సెక్యూరిటీల రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది.
‘‘మధ్యంతర బడ్జెట్‌లో అంచనాలకంటే తక్కువ రుణ సమీకరణ ప్రతిపాదనలు, జీడీపీలో ద్రవ్యలోటును 5.1 శాతానికి పరిమితం చేయడం, 2025–26 నాటికి 4.5 శాతానికి తగ్గించే చర్యలను ప్రకటించడంతో దేశీ బాండ్ ఈల్డ్ మార్చి త్రైమాసికంలో నెమ్మదించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, స్థిరమైన ద్రవ్యోల్బణం కూడా ఇందుకు సహకరించాయి’’అని ఆర్థిక శాఖ వివరించింది. మరోవైపు ఇదే కాలంలో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.33 శాతం గరిష్ట స్థాయిని తాకినట్టు గుర్తు చేసింది.
ద్రవ్యలోటు 3 శాతమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే చివరి నాటికి ద్రవ్యలోటు మొత్తం ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలో 3 శాతంగా ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల (ఏప్రిల్, మే) కాలంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడం తెలిసిందే. సాధారణంగా ప్రవర్తనా నియామావళి అమల్లో ఉన్న కాలంలో కొత్త ప్రాజెక్టులపై వ్యయాలకు కేంద్రం దూరంగా ఉంటుంది.
ఇదే ద్రవ్యలోటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల కాలంలో ద్రవ్యలోటు మొత్తం ఏడాదికి బడ్జెట్ అంచనాల్లో 11.8 శాతంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య అంతరాన్నే ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో ద్రవ్యలోటు 5.1 శాతంగా (రూ.16,85,494 కోట్లు) ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా. మే చివరికి ద్రవ్యలోటు రూ.50,615 కోట్లుగా ఉన్నట్టు సీజీఏ తెలిపింది.
ఇక మొదటి రెండు నెలల్లో నికర పన్ను ఆదాయం రూ.3.19 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో పన్నుల ఆదాయం లక్ష్యంలో ఇది 12.3 శాతానికి సమానమని పేర్కొంది. మొత్తం వ్యయాలు ఏప్రిల్, మే చివరికి రూ.6.23 లక్షల కోట్లుగా ఉండగా, బడ్జెట్ అంచనాల్లో ఇది 13.1 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతంగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment