liabilities
-
కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్) 3.4 శాతం మేర పెరిగి రూ.171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్–డిసెంబర్) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్ డెట్ (బాండ్లు, సెక్యూరిటీల రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది. ‘‘మధ్యంతర బడ్జెట్లో అంచనాలకంటే తక్కువ రుణ సమీకరణ ప్రతిపాదనలు, జీడీపీలో ద్రవ్యలోటును 5.1 శాతానికి పరిమితం చేయడం, 2025–26 నాటికి 4.5 శాతానికి తగ్గించే చర్యలను ప్రకటించడంతో దేశీ బాండ్ ఈల్డ్ మార్చి త్రైమాసికంలో నెమ్మదించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, స్థిరమైన ద్రవ్యోల్బణం కూడా ఇందుకు సహకరించాయి’’అని ఆర్థిక శాఖ వివరించింది. మరోవైపు ఇదే కాలంలో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.33 శాతం గరిష్ట స్థాయిని తాకినట్టు గుర్తు చేసింది. ద్రవ్యలోటు 3 శాతమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే చివరి నాటికి ద్రవ్యలోటు మొత్తం ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలో 3 శాతంగా ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల (ఏప్రిల్, మే) కాలంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడం తెలిసిందే. సాధారణంగా ప్రవర్తనా నియామావళి అమల్లో ఉన్న కాలంలో కొత్త ప్రాజెక్టులపై వ్యయాలకు కేంద్రం దూరంగా ఉంటుంది. ఇదే ద్రవ్యలోటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల కాలంలో ద్రవ్యలోటు మొత్తం ఏడాదికి బడ్జెట్ అంచనాల్లో 11.8 శాతంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య అంతరాన్నే ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో ద్రవ్యలోటు 5.1 శాతంగా (రూ.16,85,494 కోట్లు) ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా. మే చివరికి ద్రవ్యలోటు రూ.50,615 కోట్లుగా ఉన్నట్టు సీజీఏ తెలిపింది. ఇక మొదటి రెండు నెలల్లో నికర పన్ను ఆదాయం రూ.3.19 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో పన్నుల ఆదాయం లక్ష్యంలో ఇది 12.3 శాతానికి సమానమని పేర్కొంది. మొత్తం వ్యయాలు ఏప్రిల్, మే చివరికి రూ.6.23 లక్షల కోట్లుగా ఉండగా, బడ్జెట్ అంచనాల్లో ఇది 13.1 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతంగా ఉండడం గమనార్హం. -
Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..?
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని తెలిపారు. అలాగే తనకు రూ.263 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 2018తో పోల్చితే ఈసారి ఆస్తుల విలువ 67 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. తన వద్ద ఓ కారు, రెండు ఖరీదైన వాచ్‌లు, 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్లు కన్నడ పీసీసీ చీఫ్ వెల్లడించారు. అలాగే తనపై 19 కేసులు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. వీటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షాజియా తర్రానుమ్ తన ఆస్తుల విలువ రూ.1,629 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో బీజేపీ నేత ఎంటీబీ నాగరాజ్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.1,607 కోట్లు అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. చదవండి: లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు. -
కేంద్ర రుణ భారం రూ.147 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థికశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ఈ పరిమాణం 145.72 లక్షల కోట్లు. అంటే మొదటి త్రైమాసికం నుంచి రెండవ త్రైమాసికానికి ప్రభుత్వ రుణ భారం ఒక శాతం పెరిగిందన్నమాట. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►మొత్తం రుణ భారంలో సెప్టెంబర్ ముగిసే నాటికి పబ్లిక్ డెట్ (క్లుప్తంగా ప్రభుత్వం తన లోటును తీర్చడానికి అంతర్గత, బాహ్య వనరుల నుండి తీసుకున్న రుణ మొత్తం) వాటా 89.1 శాతం. జూన్ 30 నాటికి ఈ విలువ 88.3 శాతం. దీని పరిధిలోకి వచ్చే డేటెడ్ సెక్యూరిటీల్లో (బాండ్లు) 29.6 శాతం మేర ఐదు సంవత్సరాలకన్నా తక్కువ కాలపరిమితిలో మెచ్యూర్ అవడానికి సంబంధించినది. ►డేటెడ్ సెక్యూరిటీల ద్వారా ప్రభుత్వం రెండవ త్రైమాసికంలో సమీకరించాల్సిన నోటిఫై మొత్తం రూ.4,22,000కోట్లుకాగా, సమీకరించింది రూ.4,06,000 కోట్లు. రీపేమెంట్లు రూ.92,371.15 కోట్లు. ► కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో కమర్షియల్ బ్యాంకుల వెయిటేజ్ సెప్టెంబర్ 38.3 శాతం ఉంటే, జూన్ త్రైమాసికానికి ఈ రేటు 38.04 శాతంగా ఉంది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్ (మూలధన కేటాయింపుల) పరిమాణం మొత్తం రూ.2,90,600 కోట్లు. ప్రైవేట్ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్‌కు రీక్యాపిటలైజేషన్ విలువ రూ. 4,557 కోట్లు. ►2021 సెప్టెబర్ 24 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వల పరిమాణం 638.64 బిలియన్ డాలర్లు అయితే, 2022 సెప్టెంబర్ 30 నాటికి ఈ విలువ 532.66 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► 2022 జూలై 1 నుంచి 2022 సప్టెంబర్ 30 మధ్య డాలర్ మారకంలో రూపాయి విలువ 3.11 శాతం క్షీణించింది. జూలై 1న రూపాయి విలువ 79.09 ఉంటే, సెప్టెంబర్ 30 నాటికి 81.55కు పడింది. -
కేంద్ర ప్రభుత్వంపై చెల్లింపుల భారం రూ.133.22 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వంపై చెల్లింపుల భారం గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.1,33,22,727 కోట్లుగా నమోదయ్యింది. 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే ఈ విలువ 3.74 శాతం పెరిగింది. విలువలో ఇది రూ.1,28,41,996 కోట్లుగా ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన రుణ నిర్వహణా నివేదిక ఈ గణాంకాలను విడుదల చేసింది. మొత్తం రుణాల్లో 92.28 శాతం పబ్లిక్ డెట్ (ఈ రుణ చెల్లింపులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి జరపాలి). 2021 డిసెంబర్ నాటికి ఇది 91.60 శాతం. డేటెడ్ సెక్యూరిటీలకు సంబంధించి చెల్లింపులు 6.33 శాతం నుంచి 6.66 శాతానికి చేరింది. క్రూడ్ ఆయిల్ ధరలు త్రైమాసికంగా బ్యారల్‌కు 104.40 నుంచి 129.26 డాలర్లకు చేరిందని నివేదిక పేర్కొంది. -
పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణ భారం.. అప్పు ఎన్ని లక్షల కోట్లు తెలుసా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి అంతక్రితం త్రైమాసికంతో(సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్) పోల్చితే 2.15 శాతం పెరిగి రూ.128.41 లక్షల కోట్లకు చేరింది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రభుత్వ రుణ నిర్వహణ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. గణాంకాల ప్రకారం, ఈ విలువలు రెండు త్రైమాసికాల్లో రూ.1,25,71,747 కోట్ల నుంచి రూ.1,28,41,996 కోట్లకు ఎగశాయి. పబ్లిక్ డెట్ వాటా 91.60 శాతం మొత్తం రుణాల్లో(కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన) పబ్లిక్ డెట్ వాటా ఈ కాలంలో 91.15 శాతం నుంచి 91.60 శాతానికి ఎగసింది. ఇందులో డేటెడ్ సెక్యూరిటీల విషయానికి వస్తే సమీక్షా కాలంలో వాణిజ్య బ్యాంకుల వాటా 37.82 శాతం నుంచి 35.40 శాతానికి తగ్గింది. డిసెంబర్ 2021 చివరి నాటికి బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్ల వాటాలు వరుసగా 25.74%, 4.33 శాతాలుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరినాటికి 2.91 శాతంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ షేర్ 2021 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 3.08 శాతానికి చేరింది. ఆర్బీఐ వాటా 16.98 శాతం నుంచి 16.92 శాతానికి స్వల్పంగా తగ్గింది. దాదాపు 25 శాతం డేటెడ్ సెక్యూరిటీల కాల వ్యవధి 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంది. ఆర్బీఐ పాలసీకి 'ఈల్డ్' మద్దతు ఇక సమీక్షా కాలంలో బాండ్స్‌పై ఈల్డ్(వడ్డీ) కదలికలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సరళతర ద్రవ్య పరపతి విధానానికి మద్దతు నిచ్చాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో 10-సంవత్సరాల బెంచ్‌మార్క్ సెక్యూరిటీస్‌పై ఈల్డ్స్ 6.22 శాతం నుంచి స్వల్పంగా 6.45 శాతానికి పెరిగింది. అంటే త్రైమాసికంలో దాదాపు 23 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎగసింది. ఆర్బీఐ తన పాలసీ రెపో రేటును(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు) 4 శాతం వద్దే యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఈల్డ్ కదలికలు భరోసాను ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ అభిప్రాయపడుతోంది. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ సరళతర ఆర్థిక విధానాల కొనసాగించాలని భావిస్తోంది. (చదవండి: మరో అంతర్జాతీయ కంపెనీకి సీఈవోగా భారత సంతతి వ్యక్తి!) -
ప్రభుత్వంపై చెల్లింపుల భారం..రూ.116.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వంపై చెల్లింపుల భారం 2021 మార్చి ముగిసే నాటికి రూ.116.21 లక్షల కోట్లని శుక్రవారం ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. అంతక్రితం డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే (రూ.109.26 లక్షల కోట్ల నుంచి) ఈ పరిమాణం 6.36 శాతం ఎగసింది. మొత్తం చెల్లింపుల భారంలో ప్రభుత్వ రుణం వాటా 88.10 శాతమని గణాంకాలు పేర్కొన్నాయి. -
వ్యాక్సిన్ విదేశాలకు ఎందుకంటే..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బుధవారం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నా యని తెలిపారు. సీరం సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ మేధో హక్కులు ఆస్ట్రాజెనెకాతో ముడిపడి ఉన్నాయన్నారు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీకి అవసరమవుతున్న ముడి పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమం లో మొత్తం డోసులను కేవలం భారతీయులకే ఉపయోగించడం కుదరదని, మేధోపర హక్కుల రీత్యా, ఇతర దేశాల నుంచి పొందిన సాయం రీత్యా కొన్ని డోసులను ఎగుమతి చేయాల్సి ఉంటుందన్నారు. కోవిషీల్డ్ మేధోపర హక్కులు వేరే సంస్థతో ముడిపడి ఉందన్నారు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అడిగినట్లు సీరం సంస్థ వ్యాక్సిన్ ఫార్ములను ఇతరులకు అందించే అవకాశం లేకుండా పోయిందన్నారు. చదవండి: (ఆందోళన అవసరం లేదు.. నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదు) ఇప్పటి వరకూ 1.07 కోట్ల డోసులను ఇతర దేశాలకు సాయం అందజేశామని, 78.5 లక్షల డోసులు ఏడు ఇరుగుపోరుగు దేశాలకు పంపినట్లు తెలిపారు. మరో 2 లక్షల డోసులు ఐక్యరాజ్య సమితికి పంపినట్లు తెలిపారు. దాని ద్వారా పేద దేశాలకు సాయం అందుతుందన్నారు. వాస్తవాలు తెలియకుండా వ్యాక్సిన్ ఎగుమతుల గురించి రాజకీయం చేయవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ను కోరారు. 5.50 కోట్ల డోసులను ఉత్పత్తి సంస్థలు కమర్షియల్, లైసెన్సింగ్ ఒప్పందాల కింద విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ఎగుమతి చేసిన టీకాల్లో ఇవే 84 శాతమన్నారు. -
పున్నారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?
30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొనిæ ఆత్మహత్య పాలైన ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కోపూరి పున్నారావు(50) ఇంట్లోనే పురుగులమందు తాగి సత్తెనపల్లిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017 మే 17న చనిపోయారు. సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నది. ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని.. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. అప్పట్లో మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో అప్పు రూ. 5 లక్షలకు పెరిగింది. తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు భూమి గకూడా లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ప్రభు త్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు. – ఓ. వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు -
జిల్లా కోర్టు పీపీగా లేపాక్షినాయుడు
అనంతపురం లీగల్: అనంతపురం జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది (పీపీ)గా లేపాక్షినాయుడు బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. బెళుగుప్ప మండలానికి చెందిన లేపాక్షి నాయుడు 1993 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2002 నుంచి 2006 వరకు నాలుగో జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరించిన లేపాక్షినాయుడును పలువురు న్యాయవాదులు అభినందించారు. -
అప్పుపై పీటముడి
► రూ.17 వేల కోట్ల రుణంపై కిరికిరి ►తెలంగాణ, ఏపీ మధ్య కుదరని సయోధ్య ►పరిష్కారానికి కేంద్ర హోం శాఖకు లేఖ సాక్షి, హైదరాబాద్ తెలంగాణ, ఏపీ మధ్య చివరకు మిగిలిన అప్పుల పంపిణీపై పీటముడి పడింది. మొత్తం రూ.1.66 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి అకౌంటెంట్ జనరల్ లెక్కల ప్రకారం గతేడాది మొదట్లోనే రూ.1.49 లక్షల కోట్ల మేరకు పంపిణీ ప్రక్రియ ముగిసింది. మిగతా రూ.17 వేల కోట్ల పంపిణీపై ఇప్పటికీ సయోధ్య కుదరలేదు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు ఇటీవల ఏపీ రాజధాని అమరావతికి వెళ్లి చర్చలు జరిపినా ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో అప్పుల పంపకం కొలిక్కి రాలేదు. ఇది రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదం కావటంతో పరిష్కార బాధ్యతను కేంద్ర హోం శాఖకు అప్పగించాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. సమైక్య రాష్ట్రంలో చేసిన అప్పుల సంగతి తేల్చాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాదే లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వమూ ఈ మేరకు లేఖ రాయవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ వివాదం? నాబార్డు, హడ్కో, వివిధ బ్యాంకులు, రుణ సంస్థల నుంచి తీసుకున్న భారీ అప్పుల పంపిణీ తొలి విడతలోనే జరిగింది. కొన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరిట తీసుకున్న రూ.17 వేల కోట్ల పంపిణీ మాత్రం మిగిలింది. వీటికి సంబంధించి ఏ రాష్ట్రంలోని ప్రాజెక్టు/అభివృద్ధి పనికి అప్పు తీసుకుంటే అంతమేరకు రుణాన్ని ఆ రాష్ట్రమే భరించాలన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఉదాహరణకు హదరాబాద్లోని హుస్సేన్‌సాగర్ అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్డుకు తీసుకున్న అప్పును చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిర్దేశిత ప్యాకేజీలు, పనులకు తీసుకున్న అప్పులున తమ ఖాతాలో వేసేందుకు అభ్యంతరం లేదని, కానీ అనామతు పద్దులో ఉన్న మిగతా అప్పుతో కలిపి మొత్తం 42 శాతం మించకూడదని వాదిస్తోంది. విభజన చట్టం ప్రకారం మొత్తం అప్పుల వాటాలో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ భరించాలంటోంది. అయితే, తమ పరిధిలోని ప్రాజెక్టులు, ప్యాకేజీల అప్పులను పంచుకునేందుకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం మొత్తం అప్పుల వాటా 42 శాతం మించొద్దన్న షరతును తిరస్కరించింది. దాంతో ప్రక్రియ ఆగిపోయింది. డిస్కంల అప్పు రూ.3,200 కోట్లు తెలంగాణ డిస్కంల నుంచి తమకు రూ.3,200 కోట్లు రావాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ మొత్తం చెల్లించిచాకే అప్పుల విషయం తేల్చుదామంటూ ఇటీవలి అధికారుల చర్చల్లోనూ మెలిక పెట్టింది. కానీ అప్పులకు డిస్కంలకు సంబంధం లేదని, ఆ విషయాన్ని డిస్కం అధికారులతోనే తేల్చుకోవాలని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. నాంపల్లిలోని ట్రెజరీ ఆఫీసును పంచండి హైదరాబాద్ నాంపల్లిలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ట్రెజరీ ఆఫీసును పంచాలని, అందులో తమకు వాటా ఉందని ఏపీ ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల బీమాపై వచ్చిన వడ్డీతో దీన్ని నిర్మించారు. ఉద్యోగుల పంపిణీ తర్వాత ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా బీమా ఖాతాను రాష్ట్రాలు పంచుకున్నాయి. అదే మాదిరిగా అప్పటి వడ్డీతో కట్టిన భవనంలోనూ తమకు వాటా పంచివ్వాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. కానీ విభజన చట్టం ప్రకారం భౌగోళికంగా తమ ప్రాంతంలో ఉన్న ఆస్తులు తమకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పస్టం చేసింది. దీనిపైనా పీటముడి పడింది. -
రూ.3వేల కోట్ల రెవెన్యూ లోటు: యనమల
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.లక్ష 47వేల కోట్ల అప్పుల్లో ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఈ ఏడాది రూ.24వేల కోట్ల వరకూ అప్పు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఆదాయం ఆశించినంతగా లేదని, రూ.3వేల కోట్లు రెవెన్యూ లోటుందన్నారు. తాత్కాలిక రాజధానికి అనుకున్నదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని యనమల తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఊగిసలాడుతోందని యనమల తెలిపారు. త్వరలోనే దానిపై ప్రకటన వస్తుందన్నారు. అలాగే స్విస్ ఛాలెంజ్ సీజ్ కవర్ గురించి తానేమీ మాట్లాడనని, ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. పట్టణాల్లో సమ్ల్ ఏరియాలు లేకుండా చేయాలని యోచిస్తున్నామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశించినంతగా లేవన యనమల తెలిపారు. ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల నుంచి అనుకున్నంత ఆదాయం రావడం లేదన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు యనమల తెలిపారు. -
శాంతిభద్రతలపై రాజీ లేదు
సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌చంద్ సిటీబ్యూరో: సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా నవీన్ చంద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువ అవుతామని చెప్పారు. నేరగాళ్లను వదలబోమని హెచ్చరించారు. కాగా శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్లలో జరిగే కేసులు, పాలనపరమైన అంశాలను సిబ్బంది ఇక సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌కు రిపోర్టు చేస్తారు. ఇదిలావుండగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ఒకటి రెండురోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
తలరాత మార్చుదాం...
బాధ్యతలు పెరిగితే భారం పెరిగినట్టుగా అనిపిస్తుంది. బాధ్యతల్ని ప్రేమిస్తే అసలు భారమే అనిపించదు. ఇంకొకరి భారం దించడంలో గొప్ప ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ ఉన్న బాధ్యత మన మీద ఉంది. సహన అంటే సహనశక్తి ఉన్న మనిషి. పదేళ్ల నుంచి ఓ జబ్బు వల్ల సహన పెద్ద భారం మోస్తోంది. రండి... ఆ భారం దించుదాం. ఈ తలరాతను మార్చుదాం. అరుదైన ఓ వింత వ్యాధి ఈ నిరుపేద చిన్నారిని నరకయాతన పెడుతోంది. రోజురోజుకు పెరుగుతోన్న తల పరిమాణం ఆమెను అనుక్షణం అచేతనం చేస్తోంది. యాభై లక్షల మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే ‘అక్విడక్టల్ హైడ్రో సెఫలస్’అనే జబ్బు రోజుకు కొంత చొప్పున తలను పెంచుతూ మిగిలిన శరీర అవయవాలను కదలలేని స్థితికి తీసుకువెళుతోంది. పేదరికం, బిడ్డ ఆరోగ్యం బాగయ్యే పరిస్థితి లేకపోవటంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. బిడ్డల మంచిచెడూ పట్టించుకోలేని స్థితిలో తండ్రి ఉన్నాడు. దీంతో ఈ చిన్నారి, ఆమె ముగ్గురు అక్కా చెల్లెళ్ల బాధ్యతలను తాత, నానమ్మ తీసుకున్నారు. నలుగురినీ కంటికి రెప్పల్లా చేసుకుంటున్నారు. ఈ చిన్నారినైతే మరీనూ. కంటికి రెప్పే వేయకుండా కాపాడుకుంటున్నారు. అత్యాధునిక వైద్యంతో శస్త్ర చికిత్స చేస్తే తప్ప పెరుగుతున్న తల పరిణామం తగ్గదని వైద్యులు తేల్చేయటంతో పూట గడవటమే గగనమైన ఈ నిరుపేదలు.. ఆదుకునే వారి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎవరో ఒకరు తమ కష్టాన్ని తీర్చేందుకు వస్తారన్న నమ్మకంతో కాలం గడుపుతున్నారు. కష్టాల కడలి సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్ వడ్డెరబస్తీకి చెందిన సైదులు, సుజాతలకు నలుగురు ఆడపిల్లలు. వారిలో మూడవ కూతురు సహన. ముద్దుపేరు సాధన. పదేళ్ల వయసున్న సహన పుట్టుకతోనే అక్విడక్టల్ హైడ్రో సెఫలస్కి గురైంది. గాంధీ, నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు సహనకు ఐదేళ్ల వయసులో వైద్యపరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స చేసినా ఫలితం ఏ మాత్రం ఉంటుందో చెప్పలేమన్నారు. చేతిలో చిల్విగవ్వ లేక, చిన్నారి ఆరోగ్యం బాగుపడుతుందన్న భరోసానిచ్చేవారు కనిపించకపోవటంతో సహనను ఇంటికి తీసుకువచ్చారు. తండ్రి సైదులు భవన నిర్మాణ పనికి కూలీగా వెళ్లి గాయపడ్డాడు. అప్పట్నుంచీ ఏ పనీ చేయలేని స్థితిలో ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీంతో పరిస్థితి మరింత దుర్భరమైపోయింది. బిడ్డ అనారోగ్యం, భర్త పని చేయలేకపోవడం, ఇంట్లో అందరికి కడుపులు నింపలేని దుస్థితిలో సహన త ల్లి సుజాత తట్టుకోలేకపోయింది. ఈ కష్టాలన్నింటికీ చావే పరిష్కారమనుకున్న సుజాత నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెక్కలు తెగిన పక్షులయ్యారు నలుగురు ఆడపిల్లలు. కన్నీరే సమాధానం ఇలా ఏ దిక్కు లేని ఈ పిల్లలకు తాత లింగయ్య, నానమ్మ లక్ష్మమ్మలే దిక్కయ్యారు. ఆ తర్వాత వృద్ధాప్యంతో లింగయ్య ఇంటికే పరిమితమయ్యాడు. నానమ్మ లక్ష్మమ్మ మాత్రం కుటుంబపోషణ కోసం నాలుగిళ్లలో పనిమనిషిగా చేరి, తన మనుమరాళ్లయిన స్వాతి, సంధ్య, మేఘనలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తోంది. తల భారంతో నడవటం కాదుకదా, కనీసం కూర్చోలేని సహనకు రోజంతా సపర్యలు చేస్తోంది. అన్ని విషయాలను చక్కగా గుర్తుపెట్టుకుని మాట్లాడుతుండే సహన నేల మీద నుండి కనీసం లేచే పరిస్థితి లేదు. భోజనం మొదలుకుని స్నానం వరకు నానమ్మ లక్ష్మమ్మ చేయించాల్సిందే. సహన భవిష్యత్తు విషయమై లక్షమ్మను కదలిస్తే కన్నీరే సమాధానమైంది. - ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ పెద్ద చదువులు చదువుతా స్కూల్కెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉంది. యాక్టర్ మహేష్‌బాబును కలవాలని ఉంది. ఎప్పుడూ ఇంట్లోనే పడుకుని ఉండటం చాలా కష్టంగా ఉంది. అమ్మ కూడా లేదు. ఈ వయసులో నానమ్మను చాలా బాధ పెడుతున్నాను. - సహన చికిత్సకు మార్గముంది అక్విడక్టల్ హైడ్రోసెఫలస్ అనే జబ్బు మెదడుకు సంబంధించింది. శరీరంలో నీటి ప్రసరణ ఎలా ఉంటుందో మెదడులోనూ అలాగే ఉంటుంది. మెదడులో కొన్ని రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఇలా నీరు చేరి తల పెద్దదవుతూ ఉంటుంది. దీన్ని వెంట్రిక్యులొస్టొమీ చికిత్స ద్వారా నయం చేయచ్చు. 70 శాతం పైనే సక్సెస్ రేటు ఉంటుంది. దీనికి రెండులక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. శస్త్రచికిత్స అనంతరం కూడా మందులు వాడాలి. - డా. ప్రవీణ్ అంకతి సీనియర్ న్యూరోసర్జన్, గ్లోబల్ హాస్పిటల్ సహనను ఆదుకోవాలంటే.. నిరుపేద చిన్నారి సహనను బతికించేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. సహన శస్త్ర చికిత్స లేదా ఆమె కుటుంబానికి అండగా ఉండాలనుకునే వారు 9505504787 లేదా 9010008796కు సంప్రదించవచ్చు. లేదా సహన, లింగయ్యల పేరున ఉన్న అకౌంట్ నెంబర్ 1102210026081 ‘దేనా బ్యాంక్, ఓయూ జామై ఉస్మానియా, సికింద్రాబాద్ (బ్యాంక్ కోడ్ 1106566322)కు జమ చేయొచ్చు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతాళలేక పండగపూట ఓ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున సూర్యాపేట నియోజకవర్గంలోని చిదేముల్‌లో జరిగింది. చిదేముల్‌కు చెందిన దారావత్ దేవ్(55)కు ఆరు ఎకరాల పొలం ఉంది. భూమి సాగు కోసం.. పిల్లల పెళ్లిళ్ల కోసం ఆరు లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పు తీర్చేందుకు ఈ ఏడాది తనకున్న పొలంతో పాటు.. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంట వేశాడు. సరైన వర్షాలు లేక పంట ఎండిపోయింది. అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో రెండెకరాల పొలం అమ్మి మూడు లక్షలు అప్పుతీర్చాడు. కానీ.. రుణాల వత్తిడి తగ్గలేదు.. దీంతో మనస్ధాపం చెందిన ధరావత్ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కాపాడి. ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రగాయాల పాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. ధరావత్ కు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురికి పెళ్లి కాగా.. మరో పెళ్లీడుకొచ్చిన ఆమ్మాయి ఉంది. -
పాలు, కూరగాయలమ్ముకుని బతుకుతున్నాం
►ఏపీ సీఎం తనయుడు నారా లోకేశ్ వ్యాఖ్య ►బాబు పేరిట ఆస్తులు రూ.42.40 లక్షలే అని ప్రకటన ►భువనేశ్వరి పేరుతో రూ.33.07 కోట్ల ఆస్తులు ►తన పేరుతో రూ.7.67కోట్లు, బ్రహ్మణి పేరిట ►రూ.4.77కోట్ల ఆస్తులున్నాయన్న లోకేశ్ ►ఏడాదిలో నలభై శాతం తగ్గిన బాబు ఆస్తుల విలువ! ►గతేడాది రూ.70.69 లక్షలు ఉండగా ఈ సారి 42.40 లక్షలే! సాక్షి, హైదరాబాద్: తమ కుటుంబం పాలూ, కూరగాయలు అమ్ముకుని బతుకుతోందని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్. ఈ వ్యాపారంతో తాము సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో శనివారం లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేశారు. తన తండ్రి చంద్రబాబు ఆస్తుల విలువ రూ.42.40 లక్షలని, త ల్లి భువనేశ్వరి ఆస్తిరూ. 33.07 కోట్లు, తన ఆస్తి రూ. 7.67 కోట్లు, భార్య బ్రహ్మణి ఆస్తి రూ.4.77 కోట్లని తెలిపారు. నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తుల విలువ రూ.1.37 కోట్లని చెప్పారు. తాము నిర్వహించే హెరిటేజ్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 913 కోట్లని చెప్పారు. అది ఏటా రూ. 30 కోట్ల లాభాలు ఆర్జిస్తోందన్నారు. ఏడాదిలో నలభై శాతం తగ్గిన విలువ! లోకేశ్ ప్రకటన ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆస్తుల విలువ దాదాపు నలభై శాతం తగ్గింది. బంజారాహిల్స్‌లోని ఇళ్లు, సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం కలిపి చంద్రబాబు ఆస్తి గతేడాది రూ.70.69 లక్షలు ఉండగా ఈ సారి రూ.42.40 లక్షలుగా చూపించారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో గత సంవత్సరం రూ. 45.96 లక్షలు ఉండగా ఈ సారి ఆ మొత్తం 25.29 లక్షలకు తగ్గింది. పంజాగుట్టలోని భవనం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములు వగైరా అన్నీ కలిపి భువనేశ్వరి ఆస్తులు గత ఏడాది కంటే దాదాపు రూ.2.47 కోట్లు పెరిగాయి. లోకేష్ నికర ఆస్తులు గత ఏడాది కంటే పెరిగాయి. ఈ సారి ఆయన ఆస్తుల విలువ రూ.7.67కోట్లు (గత ఏడాది రూ. 3.57కోట్లు)కు చేరింది. మొత్తం ఆస్తులు కూడా గత ఏడాది కంటే రూ.13.47 కోట్లు పెరిగాయి. గత ఏడాది మహారాష్ర్టలోని రాయగఢ్ జిల్లాలో 8.426 ఎకరాల వ్యవసాయ భూమి విలువ రూ.58.69 లక్షలుగా చూపారు. అయితే ఈసారి ఆ భూమి వివరాలను ఆస్తుల్లో చూపలేదు. శనివారం వెల్లడించిన ఆస్తుల్లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణంలోని ఫాంహౌస్‌ను పొందు పరిచారు. దీని విలువ రూ. 2.21 కోట్లుగా చూపారు. ఆస్తులు ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రివర్గంలో ఉన్న వారిపై ఆరోపణలు వస్తున్నాయని మీరే (మీడియా) చెప్తున్నారు, ఆరోపణల ఆధారంగా మంత్రివర్గం నుంచి తొలగించలేం కదా... అన్నారు. వాటిలో వాస్తవాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆరోపణల ఆధారంగా మంత్రివర్గ సభ్యులపై చర్య తీసుకోవాల్సి వస్తే కేంద్రంలోని మోదీ మంత్రివర్గంలో కూడా ఎవ్వరూ మిగలరని లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షల పేరుతో యువతను రెచ్చగొట్టి ఆస్తులు ధ్వంసం చేస్తామంటే అనుమతి ఎలా ఇస్తాం... దీక్షల పేరుతో బస్సుల దహనం, ఆస్తుల ధ్వంసం వంటి చర్యలకు పాల్పడతారని ప్రభుత్వానికి సమాచారం ఉందని లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్లే దీక్షకు అనుమతి ఇవ్వలేదని, రోడ్డుపై దీక్ష చేస్తాం, ట్రాఫిక్ స్తంభింపచేస్తామంటే అనుమతి ఇవ్వటం కష్టం కదా అని అన్నారు. వారం పది రోజుల్లో పార్టీ కార్యవర్గాన్ని నియమిస్తామని, హెరిటే జ్ కంపెనీని ఆఫ్రికా, ఆసియా దేశాల్లో విస్తరిస్తామని ఆ కంపెనీ తరపున తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని లోకేశ్ అన్నారు. -
నా ఆస్తులు 12.39 కోట్లు, అప్పులు 4.72 కోట్లు
-
ఇదీ.. వారి పంథా
విధుల్లో కఠినంగా వ్యవహరించే కలెక్టర్ కరుణ పాలనాదక్షుడిగా జేసీ ప్రశాంత్‌కు గుర్తింపు ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తిగా కమిషనర్ సర్ఫరాజ్.. ‘‘వరంగల్ జిల్లా కలెక్టర్‌గా రావడం పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది.. వరంగల్ వాసులు ప్రజల పక్షాన పోరాడితే పూర్తిస్థారుు సహకారం అందిస్తారు. జిల్లాలో పనిచేసిన రోజులు మరచి పోలేను. జిల్లా నుంచే నాకు మంచి గుర్తింపు వచ్చింది. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తా.. సంక్రాంతి పండుగ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తా..’’అని నూతన కలెక్టర్ కరుణ ‘సాక్షి’కి సోమవారం ఫోన్లో తెలిపారు. - హన్మకొండ అర్బన్ హన్మకొండ అర్బన్ / వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పర్యటన... ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. ప్రభుత్వ పథకాల అమలులో బట్టబయలైన లోపాలతో జిల్లా అధికారుల పనితీరును ఆయన గుర్తించారు. తెలంగా ణ రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దే క్రమంలో అధికారుల వ్యవహార శైలి కేసీఆర్‌ను నివ్వెరపరిచింది. నాలుగో రోజు పర్యటన ముగించుకున్న సీఎం హైదరాబాద్‌కు వెళ్లా రో.. లేదో.. ఐఏఎస్ బదిలీలు చేపట్టి తన మార్క్‌ను ప్రదర్శించారు. ఏకంగా జిల్లాలోని ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. కలెక్టర్ కిషన్, జేసీ పౌసుమిబసును జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా బదిలీ చేయగా... అన్ని దిక్కు లా విమర్శలు ఎదుర్కొన్న కార్పొరేషన్ కమిషనర్ సువర్ణ పండాదాస్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్త, పాత అధికారుల పంథాపై ప్రజలు చర్చించుకుంటున్నారు. వాకాటి కరుణ ప్రొఫైల్ జిల్లాలో కరుణ 2009 ఫిబ్రవరి 26 నుంచి 2012 అక్టోబర్ 9 వరకు జా రుుంట్ కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లాలో కలెక్టర్ శ్రీధర్ బదిలీ తరువాత సు మారు 20రోజులు కలెక్టర్‌గా(ఎఫ్ఏసీ) కూడా విధులు నిర్వర్తించారు. బల్దియా కమిషనర్‌గా, ‘కుడా’ వీసీ గా, జిల్లా పరిషత్ సీఈఓగా ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాపై పూర్తిస్థారుు పట్టు జిల్లా పాలనపై పూర్తి పట్టున్నకరుణను ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌గా నియమించడం వల్ల పాలన సాఫీగా సాగుతుందనే అభిప్రాయాలు అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతున్నారుు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న ఆహార భద్రత కార్డులు, ప్రభుత్వ భూముల వివరాలు సేకరణ, అర్హులకు ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ వంటి కార్యక్రమాల విషయంలో కొత్త కలెక్టర్ కరుణకు పూర్తి గా అవగాహన ఉంది. జిల్లాలోని ముఖ్యమైన అన్ని రకాల ప్రభుత్వ స్థలాల, ఆక్రమణపై పూర్తిగా పట్టుంది. జిల్లాలో 2010లో రెవెన్యూ రికార్డుల నవీకరణ, మ్యూటేషన్ వంటి కార్యక్రమాలు మిషన్ మోడ్‌లో చేపట్టారు. ప్రభుత్వ భూము ల వివరాలు పూర్తిగా సేకరించి ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బందికి జీపీఆర్ఎస్ పరిజ్ఞానాన్ని సెల్ఫోన్లో నిక్షిప్తంచేసి భూముల కొలతలు వేయించారు. నగరంలో విలువైన భూములకు హద్దులు పాతించారు. దేవాల యాల భూములకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారు. జిల్లాలో పౌర సరఫరాల వ్యవస్థను గాడిన పెట్టేందు కు రేషన్ షాపుల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. పెద్దమొత్తాల్లో జరిమానాలు విధించారు. గ్యాస్ సరఫరాలోనూ ఇదే పద్ధతి అవలంబించారు. జిల్లాలో జేసీగా పనిచేసిన కా లంలో 2010, 2012లో మేడారం జాతర విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారు. సకల జనుల సమ్మెకాలంలో ఉద్యోగులు 42 రోజులపాటు ఉద్యమంలో ఉంటే... జిల్లాలో ప్రజాపంపిణీకి వ్యవస్థకు ఇబ్బంది రాకుండా చూశారు. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంప్రస్తుతం రో డ్డుపై నుంచి కనిపిస్తోందంటే.. అందులో పూర్తి కృషి కరుణదనే చెప్పాలి. ఏటూరునాగారం ఇసుక క్వారీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో ఇసుక తరలింపులో గ్రామస్తులను భాగస్వాములను చేసి చరిత్ర సృష్టించారు. జిల్లా నుంచి బదిలీపై గ్రామీణాభివృద్ధి శాఖకు వెళ్లిన కరుణ రాష్ట్ర విభజన సమయంలో అక్కడే ఉన్నారు. అనంతరం తెలంగాణకు అలాట్ అరుు ప్రస్తుతం కలెక్టర్‌గా వస్తున్నారు. స్వరాష్ట్రంలో జిల్లా తొలి కలెక్టర్‌గా కిషన్ గుర్తింపు జిల్లాలో 2013 జూలె 2 నుంచి కలెక్టర్‌గా ఉన్న గంగాధర కిషన్ సుమారు ఏడాదిన్నర పాటు పనిచేశారు. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో జిల్లాకు కలెక్టర్‌గా ఉండి స్వరాష్టంలో తొలి కలెక్టర్‌గా గుర్తింపు పొందారు. జిల్లా ఉద్యోగ సంఘాలను సంఘటితం చేసి ఓరుగల్లు సేవా ట్రస్టు ఏర్పాటు చేశారు. ట్రస్ట్ తొలి కార్యక్రమంగా కలెక్టర్ నివాసం ముందు అమరవీరుల కీర్తి స్తూపం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఇక పరిపాలనా పరంగా జిల్లాలో ఆయన కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. కలెక్టర్, ఎస్పీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచే మేడారం జాతర, కుటుంబ సర్వే, పింఛన్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయి ఫలి తాలు సాధించలేక పోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి రెండు పర్యాయాలు వచ్చిన సమయంలో జిల్లా యంత్రాంగం పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. నిన్నమొన్నటి పర్యటనలో అధికారుల పనితీరుపై సీఎం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ బదిలీ ఖాయమని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో సమాచారం తెలియడంతో సోమవారం ఉదయం రిలీవ్ అయ్యారు. ప్రశాంత్ పాటిల్ ప్రొఫైల్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పా టిల్ ప్రాథమిక విద్య నుంచి బీఈ సివిల్ ఇంజనీరింగ్ వరకు మహారాష్ట్ర ముంబైలోని థానేలో చదివారు. ఐఏ ఎస్ లక్ష్యాన్ని సాధించారు. తల్లి సుశీ ల, తండ్రి జీవన్‌రావు ఏకైక కుమారుడు పాటిల్. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రశాంత్ పాటిల్ జూన్, 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు ఐఏఎస్ శిక్షణ పొందారు. జూన్ 2012 నుండి 13వరకు కర్నూలులో ట్రెయినీ సబ్ కలెక్టర్‌గా శిక్షణ పొం దారు. 2013 సెప్టెంబర్ 4న ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 16 నెలలపాటు ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా, ఆరు మాసాలుగా ఉట్నూరు ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో వరంగల్ జేసీగా పదోన్నతి పొందారు. పాటిల్‌కు భార్య జ్యోతి, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. పరిపాలనా దక్షుడిగా పాటిల్... ప్రస్తుతం జిల్లాకు జేసీగా వస్తున్న ప్రశాంత్ పాటిల్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓగా బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాటిల్‌కు ఆ జిల్లాలో మంచి పరి పాలనాదక్షుడు, సౌమ్యుడుగా గుర్తింపు ఉంది. పాటిల్‌ను సబ్‌కలెక్టర్‌గా కాకున్నా.. పీఓగా జిల్లాలోనే కొనసాగించాలని అక్కడ ప్రజలు, రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. సాదాసీదాగా పౌసుమిబసు జిల్లాకు జేసీ కరుణ, ప్రద్యుమ్న తర్వాత అదే స్థానంలో జిల్లాకు వచ్చిన పౌసుమిబసు 2013 అక్టోబర్ 9న విధుల్లో చేరారు. విధుల్లో చేరిన నాటి నుంచి పరిపాలనపై పెద్దగా పట్టుసాధించలేక పోయారని ప్రచారం సాగింది. సాదాసీదా విధుల నిర్వహణకే పరిమితమయ్యారు. ఉన్న పనులు పక్క న పెట్టడం మినహా... కొత్తగా చేపట్టినవి లేవనే చెప్పాలి. పనిచేసిన కాలంలో చైల్డ్ కేర్ లీవ్ పేరుతో ఆమె రెండు నెలలపాటు సెలవుపై వెళ్లారు. సర్ఫరాజ్ అహ్మద్ ప్రొఫైల్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తరప్రదే శ్‌కు చెందినవారు. కాన్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన 2008 సివిల్స్‌లో 26వ ర్యాంకు సాధిం చారు. 2009 బ్యా చ్లో ఐఏఎస్ శిక్షణ అనంతరం.. గుంటూరులో ట్రెరుునీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2011 సెప్టెంబర్‌లో ము లుగు సబ్ కలెక్టర్‌గా, 2012 ఆగస్టులో బదిలీపై ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో తన వివాహ నిమిత్తం సెలవుపై వెళ్లిన సర్ఫరాజ్ అదేనెల 17 న తిరిగి విధుల్లో చేరారు. వారం తిరక్కముందే వెలువడ్డ బ దిలీ ఉత్తర్వులతో కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా వెళ్లారు. ముక్కుసూటి అధికారిగా గుర్తింపు రెండేళ్లకు పైగా పనిచేసిన వరంగల్ జిల్లాలో సర్ఫరాజ్ ము క్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కు తలొగ్గకుండా విధులు నిర్వర్తించేవారని గుర్తింపుపొందా రు. ఇసుక రీచ్‌ల వేలం విషయంలో తన మాట విననందు కు.. జిల్లాకు చెందిన అప్పటి కేంద్ర మంత్రి బలరాంనాయ క్.. సర్ఫరాజ్ బదిలీకి పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. ఐటీడీఏ పీఓగా పనిచేసిన కాలం లో ట్రాన్స్‌కో సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సర్ఫరాజ్‌పై వివాదం తలెత్తింది. అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఈ విషయంలో కలుగజేసుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. అప్పట్లోనే కమిషనర్‌గా నగర పాలక సంస్థకు వస్తారని ప్రచారం జరిగినా... కరీంనగర్ జేసీగా వెళ్లారు. ప్రస్తుత బదిలీల్లో మళ్లీ జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌గా వస్తున్న కరుణ జేసీగా ఉన్నప్పుడు సర్ఫరాజ్ ములుగు సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. పండాదాస్ పాలనలో మసకబారిన ప్రతిష్ట ప్రస్తుత నగర పాలక సంస్థ కమిషనర్ సువర్ణపాండాదాస్ గతంలో జిల్లాలోని ములుగు సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. యువ అధికారి కమిషనర్‌గా రావడంతో పరిపాలన గాడిన పడుతుందని అంతా భావించారు. కానీ.. కార్పొరేషన్లో పాలన అస్తవ్యస్తంగా మారడంతోపాటు బల్దియూ ప్రతిష్ట తగ్గుతూ వచ్చింది. సమగ్రకుటుంబ సర్వే, పింఛన్ల పంపిణీ, ఆహారభద్రత కార్డుల విషయాల్లో కార్పొరేషన్ పనితీరుపై జనం దుమ్మెత్తి పోశారు. సీఎం కేసీఆర్ పర్యటన సమయంలోనూ ఇదేతీరు కొనసాగింది. గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న సీఎం... కమిషనర్ బదిలీకి అప్పుడు సంకేతాలిచ్చారు. ఇప్పటికీ కమిషనర్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. -
టీటీడీ ఈవో బాధ్యతల స్వీకారం
మాజీ ఈవోకు ఆత్మీయ వీడ్కోలు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులైన సాంబశివరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన మొదట తిరుమలలో స్వామిని దర్శించుకున్నారు. అక్కడ టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. ఈవో ఎంజీ. గోపాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం బదిలీపై వెళుతున్న తాజా మాజీ ఈవో ఎంజీ.గోపాల్‌కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. వీరిద్దరినీ అన్ని విభాగాల సంఘాలు, అనుబంధ దేవాలయాల ఉద్యోగులు, వేదపండితులు నిలువెత్తు పూలమాలతో ఘనంగా సన్మానించారు. - సాక్షి, తిరుమల/తిరుపతి సిటీ -
మన సరోవరం
చూసొద్దాం రండి నగర జలసిరిగా.. సిటీవాసులకు విహార విడిదిగా తళతళ మెరిసే హుస్సేన్‌సాగర్‌కు ఘనకీర్తి ఉంది. జంటనగరాలను కలిపే ట్యాంక్‌బండ్, తటాకం నడిబొడ్డున జిబ్రాల్టర్ రాతిపై ఏర్పాటు చేసిన బుద్ధుని ఏకశిలా ప్రతిమ.. జలాలపై దూసుకుపోయే బోట్లు.. సిటీ సరోవరానికి కంఠాభరణంగా వెలిసిన నెక్లెస్ రోడ్డు.. ఇవన్నీ ఎందరికో కాలక్షేపం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఏటా సిటీలో అంగరంగ వైభవంగా సాగే వినాయక నిమజ్జనోత్సవం.. హుస్సేన్‌సాగర్ కు మరింత అందాన్నిస్తోంది. హుస్సేన్‌సాగర్‌కు నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. కుతుబ్‌షాహీ ప్రభువైన ఇబ్రహీం కులీ కుతుబ్‌షా పాలనలో 1562 ప్రాంతంలో హుస్సేన్ సాగర్‌ను నిర్మించారు. హైదరాబాద్‌కు 32 కిలోమీటర్ల ఎగువన మూసీనదికి ఉన్న బల్కాపూర్ చానల్ గుండా సాగర్‌కు జలాలు విడుదలయ్యేవి. ఎనిమిది చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న ఈ భారీ తటాకంపై సుమారు ఒకటిన్నర మైలు పొడవున్న ట్యాంక్‌బండ్ నిర్మించారు. సాగర్ జలాలను క్రమబద్ధీకరించేందుకు సికింద్రాబాద్ వైపు నాలుగు స్లూయిస్‌లున్నాయి. ఈ తటాక నిర్మాణ బాధ్యతలు ఇబ్రహీం కుతుబ్‌షా ప్రభువు తన అల్లుడు హుస్సేన్‌షాకు అప్పగించాడు. 3 ఏళ్ల 7 నెలల 19 రోజులలో రెండున్నర లక్షల రూపాయల వ్యయంతో ఈ చెరువును నిర్మించారు. నాలుగేళ్లు దాటినా చెరువులోకి చుక్క నీరు చేరుకోకపోవడంతో ఇబ్రహీం కుతుబ్‌షా మూసీ నుంచి నీరు వచ్చేలా కాలువలు తవ్వించమని ఆదేశించారు. దాంతో హుస్సేన్‌సాగర్ తొలిసారి జలకళ సంతరించుకుంది. హుస్సేన్‌సాహెబ్ చెరువు.. హుస్సేన్‌షా వలీ నేతృత్వంలో ఏర్పాటైన చెరువు కావడంతో స్థానికులు దీన్ని హుస్సేన్‌సాహెబ్ చెరువుగా పిలిచేవారు. ఒకరోజు ట్యాంక్‌బండ్ ప్రాంతానికి వ్యాహ్యాళికి వెళ్లిన ఇబ్రహీం కుతుబ్‌షా అక్కడున్న స్థానికులతో ఈ చెరువు పేరేమిటి ? అని అడిగారట. ‘హుస్సేన్‌సాహెబ్ చెరువు’ అని తడుముకోకుండా జవాబు రావడంతో కుతుబ్‌షా అవాక్కయ్యారట. దాంతో తన పేరున మరో చెరువు ఉండాలని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మరో చెరువు తవ్వించాడు. అందుకు తానే స్వయంగా చెరువుకు తగిన నమూనా రూపొందించారట కూడా. జంటనగరాల ప్రజల దాహార్తిని హుస్సేన్‌సాగర్ చాలా కాలం తీర్చింది. కోఠిలోని బ్రిటిష్ రెసిడెంట్లకు సైతం సాగర్ నుంచే మంచి నీటి సరఫరా జరిగేది. 1921లో ఉస్మాన్‌సాగర్ నిర్మాణం చేపట్టే వరకు తాగునీటికి హుస్సేన్‌సాగరే ప్రధాన వనరుగా ఉంది. సికింద్రాబాద్ వైపున ఉన్న బోట్స్ క్లబ్ దేశంలో అత్యుత్తమమైనదిగా ప్రసిద్ధి చెందింది. మార్పు కోరుకుందాం.. గతం ఎంత ఘనమైన.. మానవ తప్పిదాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చేశాయి. ఒకప్పుడు మంచినీటితో కళకళలాడిన ఈ తటాకం.. ఇప్పుడు కలుషిత జలాలతో కంపుకొడుతోంది. సాగర్ పరిసర ప్రాంతాల్లో ముక్కుమూసుకుని నడవాల్సి వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం సాగర్ ప్రక్షాళనపై వేగవంతంగా స్పందించడం సాగర్ ప్రియులకు శుభవార్తే. ఇందుకోసం రూపొందిస్తున్న ప్రణాళికలు పక్కాగా కార్యరూపం దాలిస్తే.. మన హుస్సేన్ సాగర్‌కు పూర్వవైభవం వస్తుంది. ఈ మార్పు తొందరగా రావాలని కోరుకుందాం.. !! మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి
అభినందన సభలో బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రి హోదాలో తొలిసారి నగరానికి రాక శంషాబాద్ విమానాశ్రయం నుంచి కార్యకర్తల ఘనస్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి పద్మారావు సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిచేస్తామని తెలిపారు.మోదీ కేబినెట్లో కార్మిక,ఉపాధి శాఖ లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... దత్తాత్రేయకు కీలక శాఖను కేటాయించినందుకు తెలంగాణ ప్రజలు, కార్యకర్తల తరఫున ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. బీజేఎల్పీనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు దత్తాత్రేయకు ప్రధాని మోదీ అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, నేతలు ఎస్వీ శేషగిరిరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తులు చెప్పని 401 మంది ఎంపీలు
జాబితాలో సోనియా గాంధీ, అద్వానీ, రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, ఉమాభారతి, నితిన్ గడ్కారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్... వీరంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 26 నాటికి మొత్తం 401 వుంది ఎంపీలు తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాల్సి ఉందని సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు లోక్‌సభ సెక్రటేరియెట్ బదులిచ్చింది. నిబంధనల ప్రకారం ఎంిపీగా ప్రమాణం చేసిన 90 రోజుల్లోగా సభ్యులు తమ ఆస్తుల వివరాలను తెలపాలి. ఆస్తుల వివరాలు తెలియజేయని ఎంపీలలో 209 మంది బీజేపీ వారే. కాంగ్రెస్ నుంచి 31, టీఎంసీ 27, బీజేడీ 18, టీడీపీ 14, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. అక్రమ సంపాదన కాదు: సదానందగౌడ బెంగళూరు: ఎన్నికల తర్వాత తన ఆస్తి భారీగా పెరిగిందని, ఇదంతా అక్రమ సంపాదనే అని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని రైల్వే మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. మంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆస్తి విలువ పెరిగినంత మాత్రాన అదంతా అక్రమ సంపాదన అనడం సరికాదన్నారు. ఎన్నికల అనంతరం ఫెడరల్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు అప్పు తీసుకున్నానని, బెంగళూరు న్యూ బీఈఎల్ రోడ్‌లోని తన బహుళ అంతస్తుల భవనంలో కిరాయిదారుల నుంచి రూ.2 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నానని వెల్లడించారు. ఇందువల్ల ఎన్నికల అనంతరం తన ఆస్తి విలువ పెరిగిందే కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. -
ఆర్థిక ప్రణాళిక.. 30కి ముందే
ఏది చేసినా.. ముప్పయ్‌ల ముందే. ఎందుకంటే చాలామందికి అసలైన బరువు, బాధ్యతలు ముప్పయ్‌ల తర్వాతే మొదలవుతాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సొంత ఇల్లూ, కారు వగైరా కలల సాకారానికి కూడబెట్టుకోవడం ఇలా ఒకదాని తర్వాత మరొకటి వచ్చి పడిపోతుంటాయి. ఈ చట్రంలో చిక్కుకున్న తర్వాత కీలకమైన బీమా మొదలైన ఆర్థికపరమైన జాగ్రత్తలపై దృష్టి పోదు. ఒకవేళ వెళ్లినా.. ఇప్పుడెక్కడ కుదురుతుంది.. తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసేస్తుంటారు. కాబట్టి, ముప్పయ్‌ల ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, క్రమశిక్షణ అలవర్చుకుంటే ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు. అలాంటి వాటిల్లో కొన్నింటి గురించి ఈ కథనం.. టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా .. కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా కల్పించేందుకు ఉపయోగపడే అచ్చమైన జీవిత బీమా పాలసీలు.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు. తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ ఇస్తుంటాయి. అయితే, వయస్సుతో పాటు తీసుకునే కవరేజీని బట్టి కట్టాల్సిన ప్రీమియంలూ పెరుగుతుంటాయి. కనుక, లేటు వయస్సులో కాకుండా కాస్త ముందుగానే టర్మ్ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియాలతో సరిపోతుంది. అదే ఆన్‌లైన్‌లోనైతే పాలసీ మరింత చౌకగా లభిస్తుంది. ఉదాహరణకు 28 ఏళ్ల వ్యక్తి ముప్పై ఏళ్ల వ్యవధి కోసం 50 లక్షల బీమా పాలసీ ఆన్లైన్లో తీసుకుంటే ఏడాదికి సుమారు రూ. 5,550 కడితే సరిపోతుంది. అదే ముప్పై అయిదేళ్ల వ్యక్తి పాతికేళ్ల వ్యవధికి అదే పాలసీ తీసుకోవాలంటే ఏటా రూ. 7,150 కట్టాల్సి వస్తుంది. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య బీమా పాలసీలు తప్పనిసరిగా మారుతున్నాయి. కాస్త ముందుచూపుతో అవసరానికి అనుగుణమైన కవరేజీని ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి వల్ల ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ క్రమశిక్షణ.. ఇన్వెస్ట్మెంట్ సాధనాల గురించి తెలుసుకోవడం, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే అలవాటును అలవర్చుకోవడం.. ఇరవైలలో నేర్చుకోవాల్సిన ఆర్థిక క్రమశిక్షణ పాఠాల్లో కొన్ని. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంత ముందుగా మొదలుపెడితే లక్ష్యం సాధించడం అంత సులువవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఫండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు, రిస్కు సామర్ధ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవచ్చు. రిస్కులు పెద్దగా ఇష్టపడని వారు ఎఫ్డీలు, పీఎఫ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్కులు లేకుండా నిలకడైన రాబడి అందించే సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంటు కూడా ఒకటి. అత్యంత తక్కువగా రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేసేందుకు ఇందులో వీలుంటుంది. కాబట్టి ఏ ఆదాయవర్గానికి చెందిన వారైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయం పెరిగే కొద్దీ పన్నుల పరిధిలోకి వచ్చినా.. పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్లపై కొన్ని మినహాయింపులూ పొందడానికి వీలుంటుంది. అదే, కాస్త రిస్కు తీసుకోగలిగిన వారు దీర్ఘకాలికంగా ఎక్కువ రాబడులు ఇవ్వగలిగే సత్తా ఉన్న స్టాక్మార్కెట్లవైపు చూడొచ్చన్నది నిపుణుల సలహా. ఖర్చులపై అదుపు.. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి దశలోనూ బడ్జెట్ చాలా కీలకమైనది. కానీ, అప్పుడప్పుడే ఆదాయాలు కళ్లకి కనిపించే ఇరవైలలో నచ్చినది కొనడం తప్ప పొదుపు, బడ్జెట్ మొదలైనవి పెద్దగా పట్టవు. అయితే, ఏది అవసరం ఏది అనవసరం అన్నది తెలుసుకోవడం, ఖర్చులను అదుపు చేసుకోవడం ఎంత ముందుగా నేర్చుకుంటే అంత మంచిది. బడ్జెట్ ప్రాధాన్యాన్ని గుర్తెరగడం ముఖ్యం. బడ్జెటింగ్ కోసం, ఖర్చులను ట్రాక్ చేసేందుకు స్మార్ట్ఫోన్లలో ప్రస్తుతం ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనీవైజ్, మైయూనివర్స్, మనీలవర్ తదితర యాప్స్ ఇందుకు ఉపయోగపడతాయి. అత్యవసర నిధి.. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ముంచుకు వస్తుందో చెప్పలేం. సంక్షోభం తలెత్తకుండా ఆపడం మన చేతుల్లో ఎలాగూ ఉండదు కాబట్టి వచ్చినప్పుడు కనీసం ఎదుర్కొనడానికి సరిపడా డబ్బయినా చేతిలో ఉంచుకోగలగాలి. అందుకే అత్యవసర నిధి అంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. కనీసం, ఆరు నుంచి ఎనిమిది నెలల ఖర్చులకు సరిపడేంత మొత్తం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. -
గడప దాటకుండానే గడించండి...
కాస్తంత నైపుణ్యం .. మరికాస్త సమర్ధత ఉంటే చాలు ఇంటి నుంచి కదలకుండా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రస్తుతం మార్గాలనేకం ఉన్నాయి. టైమ్ మేనేజ్మెంట్ గురించి తెలిస్తే ఇటు ఇంటి బాధ్యతలు అటు వ్యాపార బాధ్యతల మధ్య సమతూకం పాటించడం అంత కష్టం కాదు. చక్కగా చేసుకోగలిగితే పెద్దగా పెట్టుబడితో పనిలేకుండానే .. చెప్పుకోతగ్గ స్థాయిలో ఆదాయం అందించే చిన్న స్థాయి వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని.. కుకింగ్ క్లాసులు నోరూరించే, రుచికరమైన వివిధ రకాల వంటకాలు.. ప్రయోగాలు చేయడంలో మీరు ఎక్స్‌పర్టా? అందరి వహ్వాలు అందుకుంటుంటారా. అలాంటప్పుడు మీ నైపుణ్యాన్ని కేవలం వంటగదికే పరిమితం చేయకండి. మీకు తెలిసిన విద్యను ఇంకొందరికి నేర్పించే ప్రయత్నం చేయండి. కుకింగ్ క్లాస్ల్లాంటివి నిర్వహించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా ఎక్కడెక్కడి వంటల గురించి తెలుసుకునే వీలు ఉంటోంది. అలాంటి వాటిపై ఆసక్తి కూడా పెరుగుతోంది. కాబట్టి దీన్ని మీరు వ్యాపారావకాశంగా మార్చుకునే వీలుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రకాల్లో కొంగొత్త వంటకాలను పరిచయం చేయండి. కుదిరితే వంటకాల తయారీ ప్రక్రియను వీడియోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు. తమిళనాడుకు చెందిన డెభ్భై ఏళ్ల బామ్మగారు ఇదే పనిచేస్తున్నారు కూడా. తాను చేసే వంటకాలను కుటుంబసభ్యులతో వీడియోలు తీయించి యూట్యూబ్‌లో ఉంచుతారు. ప్రస్తుతం ఆ బామ్మగారికి దేశ విదేశాల్లో బోల్డంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. టేస్ట్‌కు తగ్గట్లు కస్టమైజేషన్ కొన్ని మినహాయించి చాలామటుకు ఉత్పత్తులను ఎలా ఉంటే అలా కొనేయకుండా తమ అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చే యించి తీసుకునేందుకు (కస్టమైజేషన్) కొనుగోలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. విక్రేతలు కూడా ప్రత్యేకంగా ఆయా కస్టమర్లు కోరుకున్నట్లు తగిన మార్పులు చేసి అందిస్తున్నారు. ఆభరణాలు, వాల్ ఆర్ట్, ఫ్యాబ్రిక్స్, దుస్తులు, టీ-షర్టులు, పిల్లల దుస్తులు, ఇతర యాక్సెసరీలు లాంటివాటిల్లో కస్టమైజేషన్కి ప్రాధాన్యం పెరిగింది. కనుక, ఇలాంటి సర్వీసులు అందించగలిగితే మంచి ఆదాయమార్గం అందుకోవచ్చు. నర్సరీ.. ప్రస్తుతం నగరవాసుల్లో మొక్కల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. పచ్చదనంపై ఆసక్తి ఉన్న పక్షంలో దీన్ని కూడా వ్యాపారావకాశంగా మల్చుకోవచ్చు. కాస్త జాగా అందుబాటులో ఉంటే చిన్నపాటి నర్సరీ లాంటిది ప్రారంభించవచ్చు. మొక్కలు ఒక మోస్తరు స్థాయికి ఎదిగిన తర్వాత రిటైల్‌గా గానీ లేదా వ్యాపార సంస్థలకు గానీ విక్రయించేసేయొచ్చు. వీలైతే ఒక వెబ్సైట్ పెట్టి.. మీ దగ్గరున్న మొక్కలు, విక్రయించే ఇతరత్రా ఉత్పత్తులు మొదలైన వాటి వివరాలు అందులో ఉంచడం ద్వారా ఆన్లైన్లో కస్టమర్లను కూడా సంపాదించుకోవచ్చు. మేకప్ సర్వీసులు... మేకప్, ఫ్యాషన్, సౌందర్య సాధనాలపై మీకు మంచి అభిరుచి ఉంటే దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. వివాహాల్లో పెళ్లికూతుళ్ల అలంకరణకు సంబంధించిన సర్వీసులు అందించవచ్చు. ఇందుకోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. కొండొకచో ఇతరత్రా వెబ్సైట్లలో ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మెహందీ, సంగీత్ వంటి ఫంక్షన్లు పరిపాటిగా మారిపోతున్నాయి కనుక.. తర్వాత దశలో ఆ సర్వీసులు కూడా అందించవచ్చు. వెడ్డింగ్ ప్లానింగ్... ఫంక్షన్లంటే బోలెడంత హడావుడి ఉంటుంది. అన్నింటిని సమర్థంగా చూసుకోగలిగితేనే ఏ మాట రాకుండా ఉంటుంది. ఇలాంటి వాటిని నిర్వహించగలిగే సామర్థ్యాలు, నైపుణ్యాలు మీలో ఉంటే .. వెడ్డింగ్ ప్లానింగ్వంటి సర్వీసులు అందించవచ్చు. ఏమేం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా నిర్వహించవచ్చు ఇలాంటి వన్నీ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. మిగతా సన్నిహితులు ఎవరికైనా కూడా ఇలాంటి ఆసక్తి ఉంటే వారితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ తరహా ప్లానర్లకు డిమాండ్ బాగానే ఉంటోంది. వెబ్ డిజైనింగ్.. డీటీపీ.. ఇంటర్నెట్ ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో అంతా ఆన్లైన్ బాటపడుతున్నారు. కనుక, వెబ్ డిజైనింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు మీకు ఉంటే వాటిని వినియోగించుకుని ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, అవసరమైన సాఫ్ట్వేర్ ఉంటే చాలు ఇంటి దగ్గర్నుంచే వెబ్ డిజైనింగ్ సేవలు అందించవచ్చు. చిన్న చిన్న సంస్థలు ఇలాంటి జాబ్స్‌ను ఫ్రీలాన్సర్లకు ఔట్సోర్సింగ్ చేస్తుంటాయి కూడా. వాటి దగ్గర్నుంచి ప్రాజెక్టులు తీసుకుని, క్లయింట్ల కోసం వెబ్సైట్లను అందించవచ్చు. ఇక తక్కువ పెట్టుబడితో మొదలెట్టగలిగే వ్యాపారాల్లో డీటీపీ (డెస్క్‌టాప్ పబ్లిషింగ్) కూడా ఒకటి. ప్రతీ సంస్థకు ఏదో ఒక సందర్భంలో లెటర్హెడ్లు, కేటలాగ్స్, బ్రోచర్లు మొదలైనవి అవసరం పడుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులు దక్కించుకోగలిగితే డీటీపీ సేవల ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దుస్తుల డిజైనింగ్.. బొటిక్... మహిళలకు అత్యంత అనువైన ఉపాధి అవకాశాల్లో ఇది ఒకటి. సాధారణంగానే మహిళలకు ఫ్యాషన్‌పై మంచి టేస్ట్ ఉంటుంది. యాక్సెసరీలు, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ మొదలైన వాటిపై అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే దుస్తుల డిజైనింగ్ వ్యాపకంగా ఎంచుకోవచ్చు. అలాగే, చేతితో తయారు చేసిన యాక్సెసరీస్‌ని కూడా రూపొందించవచ్చు. సాధ్యపడితే తమ సొంత బొటిక్‌ను ఏర్పాటు చేయొచ్చు. -
త్వరలో ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పుల విభజన
42:58 నిష్పత్తిలో విభజనకు చర్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఇటీవల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తమకు సిబ్బందిని కేటాయించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించింది. ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు సేవలందించే పదో షెడ్యూలులో ఉన్న ఏపీ ఉన్న త విద్యామండలిని విభజనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఆస్తులు, అప్పులను 42: 58 నిష్పత్తిలో ఈ విభజన చేపట్టాలని భావిస్తోంది. అలాగే ఏపీ మండలిలోని సిబ్బందిని కూడా విభజించి తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కేటాయించే అంశంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియను ఏపీ ఉన్నత విద్యా మండలి చూస్తోంది. ఇక వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. త్వరలోనే తెలంగాణలో ఉన్నత విద్యామండలి, తెలంగాణ యూనివర్సిటీల చట్టాలను రూపొందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
ఖాకీ ‘క్రాస్‌చెక్’
ఎల్బీనగర్ డీసీపీ జోన్ పరిధిలో వింత పరిస్థితి రెండు హత్యలు...మూడు ఠాణాల అధికారులపై ఆరోపణలు పోలీసులు, నిందితుల పాత్రపై ఇంకా నిగ్గు తేలని నిజాలు సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీనగర్ జోన్ పరిధిలో పోలీసులపై పోలీసులే ‘క్రాస్‌చెక్’ (దర్యాప్తు) చేసుకుంటున్న వింత పరిస్థితి దాపురించింది. ఒక పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు మరో అధికారితో విచారణ జరిపిస్తుండగా...విచారణ అధికారిపై వచ్చిన ఆరోపణలపై వేరే అధికారితో విచారణ జరిపిస్తుండటం పోలీసులను నవ్వుల పాల్జేస్తోంది. రియల్టర్ వెంకట్‌రెడ్డి హత్య కేసులో వనస్థలిపురం ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తిపై ఆరోపణలు రాగా.. మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులో ఇటు మీర్పేట్, అటు ఇబ్రహీంపట్నం పోలీసుల మధ్య ఆరోపణలు రావడంతో ఈ రెండు ఠాణాల నిగ్గు తేల్చేందుకు ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాం దర్యాప్తు చేపట్టారు. రియల్టర్ హత్య కేసులో సీఐపై ఆరోపణలు... తన పరిధిలో జరిగిన హత్య కేసును తానే దర్యాప్తు చేసుకోలేని దుస్థితిలో వనస్థలిపురం ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి ఉన్నారు. బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన రియల్టర్ వెంకట్‌రెడ్డి ఈనెల 1న అదృశ్యమై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును నిజానికి వనస్థలిపురం ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే హతుడి డైరీలో గోపాలకృష్ణమూర్తి అతడిని బెదిరించినట్టు ఉండటంతో ఈ హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు బాధ్యతలను మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి అప్పగించారు. ఇంకా ఈ కేసు కొలిక్కి రాలేదు. దర్యాప్తు స్టేజిలోనే ఉంది. ఆటో డ్రైవర్ హత్య కేసులో ... ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులో కూడా గోపాలకృష్ణమూర్తికి ఎదురైన పరిస్థితే మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి తలెత్తింది. ఈ హత్య కేసులో ఇటు మీర్‌పేట పోలీసులు, అటు ఇబ్రహీంపట్నం పోలీసులు వేర్వేరు నిందితులను అరెస్టు చూపించడమే ఇందుకు కారణం. గతనెల 30న మీర్‌పేటలో జంగయ్య హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ముగ్గురిని ఈనెల 16న మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి అరెస్టు చూపించారు. కాగా ఈనెల 19న ఇదే కేసులో వేరే నలుగురిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చూపించారు. ఒకే హత్యను ఇలా వేర్వేరు నిందితులు ఎలా చేస్తారనే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఇబ్రహీంపట్నం, మీర్‌పేట పోలీసులు జంగయ్య హత్య కేసు దర్యాప్తులో అనుసరించిన తీరుపై విచారణ జరపాలని ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాంకు డీసీపీ విశ్వప్రసాద్ బాధ్యతలు అప్పగించారు. మూడు ఠాణాలపై ఆరోపణలు... రియల్టర్ వెంకట్‌రెడ్డి, ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులు వనస్థలిపురం, మీర్‌పేట, ఇబ్రహీంపట్నం పోలీసుల మెడకు చుట్టుకున్నాయి. ఈ రెండు హత్యలలో అసలు నిందితులు ఎవరో ఇంకా తేలలేదు. ఆరోపణలు మాత్రం పోలీసులపై రావడంతో తలలు పట్టుకుంటున్నారు. వెంకట్‌రెడ్డి హత్య కేసులో అసలు నిందితులే దొరకలేదు? దీంతో హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయం ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక జంగయ్య హత్య కేసులో మాత్రం రెండు ఠాణాల పోలీసులు వేర్వేరు వ్యక్తుల అరెస్టులు చూపడం వివాదానికి తెరలేపింది. జంగయ్య హత్య కేసులో పోలీసుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు జైలులో ఉన్న నిందితులకు పండుగ చేసుకునేలా ఉంది. -
నా దగ్గర డబ్బుల్లేవు, కూర్చోడానికి కుర్చీలేదు
'నా దగ్గర డబ్బుల్లేవు, కూర్చోడానికి కుర్చీలేదు' ఈ మాటలు అన్నది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ చేస్తానన్న బాబు ఇప్పుడు మాత్రం ఏ పని చేయడానికి అయినా డబ్బులు చాలా ముఖ్యమని చెప్పుకు రావటం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ పంట రావాలంటే ఆరు నెలలు పడుతుందని... తన పరిస్థితి కూడా అంతే అని అన్నారు. బెల్టు షాపులు లేకుండా సంతకం చేస్తామని, ఎక్కడైనా ఉంటే లేకుండా చూసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. బెల్టు షాపుల కారణంగా ఉపాధి కోల్పోయినవారికి రుణాలు మంజూరు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దివాలా తీయించారని, అప్పులు మాత్రమే ఉన్నాయని, ఆదాయం మాత్రం లేదని చెప్పుకొచ్చారు. -
వేతనాలివ్వండి మహాప్రభో!
వీఆర్ఏల అరణ్యరోదన వేతనాల విడుదలపై తాత్సారం అల్లాడుతున్న 1,720 కుటుంబాలు గుడ్లవల్లేరు : జిల్లాలోని ఉన్నతాధికారులకు గ్రామానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా వారి భాగస్వామ్యం తప్పనిసరి. గ్రామపంచాయతీ పరిధిలో పన్నులు వసూలుచేయడం దగ్గరనుంచి గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారులకు వారి సంపూర్ణ సహకారం కావాల్సిందే. వారే గ్రామసేవకులు(వీఆర్ఏ). ఇంతప్రాధాన్యత గల బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరు మాత్రం నిత్యం ఆకలికేకలతో అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 1,720మంది వీఆర్ఏలకు వేతనాల సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తోంది. 010పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వానికి పట్టడం లేదు. వీఆర్ఏల వేతనాల్ని ప్రభుత్వం నెలనెలా కాకుండా రెండు నెలలకు ఒకసారి ఇవ్వటాన్ని బాధిత వీఆర్ఏ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో నెలకు రూ.3,500 ఇచ్చే వేతనాన్ని రూ.6,100 పెంచారే కానీ అమలు కావటం లేదు. గత నెల వేతనాలు ఇంతవరకూ వీఆర్ఏలక ుఅందలేదని ఆ సంఘం నేతలు ఆవేదనకు గురవుతున్నారు వెంటనే తమ వేతనాలను విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆందోళనలు తీవ్రతరం... క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖకు చెందిన పనుల విషయంలో రోజంతా వెట్టిచాకి రీ చేయించుకుంటున్నారు. పల్లెల్లో ఆ శాఖకు దిక్సూచిలా ఉపయోగపడే మా వేతనాల్నే ప్రభుత్వం నిలిపివేయడం దారుణం. వేతనాలు ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. - ఆలూరి రంగా, గుడ్లవల్లేరు మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు పస్తులున్నా పట్టించుకునేదెవరు? మా వీఆర్ఏల కుటుంబాలు పస్తులుంటున్నాయంటున్నా పట్టించుకునే నాధుడే కనబడడం లేదు. గత ప్రభుత్వం 010పద్దు ద్వారా పెరిగిన వేతనాల్ని పంపక పోవటమే మా వీఆర్ఏలకు శాపంగా మారింది. జిల్లాలో 1,720కుటుంబాల వారు ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. - యంగల రాజు, జిల్లా వీఆర్ఏల సంఘం ప్రధాన కార్యదర్శి వెట్టిచాకిరీ... తక్కువ వేతనం వస్తున్న వీఆర్ఏలు పనుల్లో మాత్రం మగ్గిపోతున్నారు. క్షేత్ర స్థాయిలో భూమి శిస్తు వసూళ్లు, భూమి కొలతలు, పంటల లెక్కలు, జనన మరణాలను గ్రామాల్లో సేకరించడం, అధికారుల పర్యటనలు, సభలు, సమావేశాలు, జాతర్లకు బందోబస్తు నిర్వహించడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన గ్రామీణ ప్రాథమిక సమాచారాన్ని అందించటంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ఇంత చేసినా వీరికి గౌరవ వేతనంతోనే సరిపెడుతున్నారు. -
13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు!
విశాఖ రూరల్: జిల్లా కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఎన్.యువరాజ్ ఈ నెల 13న లేదా 15న బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వుడా వైస్‌చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న యువరాజ్ ప్రస్తుతం సెలవుపై తమిళనాడులో ఉన్నారు. ఆయన ఈ నెల 12న జిల్లాకు రానున్నారు. వీలైనంత వరకు ఈ నెల 13వ తేదీన కలెక్టర్‌గా చార్జ్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆరోజు కాని పక్షంలో 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ప్రస్తుత కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ కూడా 13నే రిలీవ్ కానున్నట్టు సమాచారం. -
శివశివా.. నాగపడగలెట్టా ?
నాలుగు రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు రూ.100 కోట్ల వెండి కరిగింపునకు బ్రేక్ రాహుకేతు పూజలెలా చేయూలి? కొత్త ఈవోకు తొలిరోజే ఇక్కట్లు శ్రీకాళహస్తి: దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో శ్రీకాళహస్తి రాహుకేతు క్షేత్రంలో నాగపడగల కొరత తీరేలా లేదు. దీంతో ఆలయాధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాహుకేతు పూజలకు వినియోగించే నాగపడగలు ఇక నాలుగు రోజులకు (75కేజీలు) సరిపడేంత మాత్రమే ఉన్నాయి. దీంతో అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆదేశాలను ధిక్కరించలేక.. ఇటు నాగపడగలను రాహుకేతు పూజలకు ఎలా అందించాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సుమారు రూ. 100 కోట్ల వెండి నిల్వలు ఉన్నాయి. కాగా వారం రోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న ముక్తేశ్వరరావు ముక్కంటి ఆలయంలోని 16 టన్నుల వెండి నిల్వలను హైదరాబాద్‌లో కరిగించాలని, నాగపడగల అవసరాలు, ఆలయంలో ఉత్సవ వాహనాల మరమ్మతులు, నూతన ఉత్సవ వాహనాల ఏర్పాటుకు పోగా మిగిలిన వెండిని విక్రయించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు రోజుల క్రితం ఈవోగా ఉన్న రామచంద్రారెడ్డి నిల్వ ఉన్న వెండిని హైదరాబాద్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఆయన బదిలీ అయ్యారు. తిరుపతి ఆర్జేసీగా పని చేస్తున్న శ్రీనివాసరావు ఆదివారం నూతన ఈవో గా బాధ్యతలు చేపట్టారు. కాగా వారం క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యలు చేపట్టిన అనురాధ ఆలయంలోని వెండి నిల్వల్లో ఒక్క కేజీని కూడా కరిగించరాదని, ఆలానే ఉంచాలని శనివారం రాత్రి ఉత్తర్వులు పంపారు. దీంతో రూ.100 కోట్ల వెండి నిల్వలకు బ్రేక్ పడింది. అయితే వెండిని కరిగించి నాగపడగలు తయారు చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఆలయంలోని మింట్‌లో లేవు. హైదరాబాద్‌లో వెండిని కరిగించి ముద్దలు చేసి ఆలయానికి తీసుకు వస్తే స్థానికంగా ఉన్న మింట్‌లో నాగపడగలు తయారు చేయడానికి అవకాశం ఉంది. ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండి కాకపోయినా కనీసం నాగపడగలకు అవసరమైన వెండినైనా హైదరాబాద్‌లో కరిగించడానికి దేవాదాయశాఖ అనుమతి ఇస్తే నాగపడగల కొరత తీరుతుంది. అయితే ఒక్క కేజీ కూడా కరిగించరాదని ఆదేశాలు ఇవ్వడంతో రాహుకేతు పూజలకు నాగపడగల ఇక్కట్లు తప్పేలా లేవు. నాగపడగలకు సమయం ఇలా.. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఆలయాధికారులు 2500 కేజీల వెండిని హైదరాబాద్‌లోని మింట్‌లో కరిగిస్తారు. అక్కడి నుంచి వెండి ముద్దలను ఆలయానికి తీసుకువస్తే ఇక్కడ నాగపడగలు తయారు చేస్తారు. హైదరాబాద్‌లోని మింట్‌లో రోజుకు 700 నుంచి 800 కేజీల వెండిని మాత్రమే కరిగించడానికి అవకాశం ఉంది. ఈ లెక్కన 2500 కే జీల కరిగింపునకు మూడు రోజుల సమయం పడుతుంది. ఇక ఆ వెండి ముద్దలను నాగపడగలుగా చేయడానికి ఆలయంలోని మింట్‌లో మరో మూడు రోజులు పడుతుంది. అలాగే హైదరాబాద్‌కు తీసుకు పోవడానికి ఒక్కరోజు, కరిగించిన ముద్దలను శ్రీకాళహస్తికి తీసుకురావడానికి మరో రోజు సమయం పడుతుంది. మొత్తం మీద ఎనిమిది రోజుల సమయం కావాల్సి ఉంది. అయితే ఆలయంలో నాలుగు రోజులకు సరిపడా మాత్రమే నాగపడగలు ఉన్నాయి. దీంతో నూతనంగా ఈవో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ఆదివారం నాగపడగలకు అవసరమైన వెండి కరిగింపునకు అనుమతి ఇవ్వాలని పదేపదే దేవాదాయశాఖ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆలయ ఈవోలను కాపాడడం కోసమేనా? ఆలయంలోని వెండిని కరిగించరాదనే ఆదేశాలు గతంలో ఈవోలను కాపాడడం కోసమేనా? అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఆలయంలో పదేళ్లుగా రూ.100 కోట్ల వెండి నిల్వలు ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన పలువురు ఈవోలు నిల్వ ఉన్న వెండిని కరిగించి నాగపడగలు చేయకుండా చెన్నైలో నాగపడగలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. వెండి కొనుగోలుపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నాగపడగల తయారీలో వెండిశాతం 90 నుంచి 95 శాతం ఉంటేనే వినియోగించాల్సి ఉంది. ప్రస్తుతం మింట్‌లో తయారు చేస్తున్న నాగపడగల్లోనూ అదే నియమాలు (90-95 శాతం వెండి) పాటిస్తున్నారు. అయితే చెన్నైలో భారీ మొత్తంలో అప్పట్లో పలువురు ఈవోలు కొనుగోలు చేసిన వెండిలో 60 నుంచి 65శాతం మాత్రమే వెండి ఉండేలా కోనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని ఈవోలు నోక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండిని కరిగిస్తే సంవత్సరాల వారీగా ఈవోలు కొనుగోలు చేసిన నాగపడగల్లో వెండి శాతం బయటపడుతుంది. దీంతో ఈవోలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ఉద్దేశంతో దేవాదాయ శాఖాధికారులు వెండిని కరిగించకుండా నిలుపుదల చేశారని తెలుస్తోంది. రూ.100 కోట్ల వెండి నిల్వలు కరిగించకుండా విక్రయించి, అవసరమైన నాగపడగలు కొనుగోలు చేస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం దే వాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు మొత్తం వెండిని హైదరాబాద్‌లో కరిగించాలని ఆదేశాలు జారీచేస్తే, ఆయన పదవీ విరమణతో కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనురాధ ఒక్క కేజీ వెండి కూడా కరిగించరాదని ఆదేశాలు పంపడం విమర్శలకు దారితీస్తోంది. కొరత రానివ్వం రాహుకేతు పూజలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాగపడగల కొరత రానివ్వం. పూజలకు అవసరమైన నాగపడగలు 75 కేజీలు ఉన్నాయి. నాలుగైదు రోజులు ఇబ్బంది లేదు. దేవాదాయశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి నాగపడగల కోసం వెండిని కరిగించడం కోసం అనుమతి తీసుకుం టాం. పూజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాసరావు, ఆలయ ఇన్చార్జి ఈవో -
ఇదేం తీరు చంద్రబాబూ
అప్పుడే నీ బుద్ధి బయటపడుతోంది తీపికబురు చెబుతావనుకుంటే తీసేస్తామంటావా? రాజకీయాలు చేస్తున్నామనడం సాకు కాదా? ఆగ్రహోదగ్రులవుతున్న ఆదర్శ రైతులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిక బుచ్చెయ్యపేట : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు తన బుద్ధిని బయటపెట్టుకుంటున్నారని, తొలి మంత్రి వర్గ సమావేశం తర్వాత తీపి కబురు చెబుతారని ఆశిస్తే ఆదర్శ రైతుల్ని తొలగిస్తామని ఆయన ప్రకటించడం ఎంతవరకు సమంజసమని సంఘం జిల్లా అధ్యక్షుడు బి.ఆదినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఆదర్శ రైతుల వ్యవస్థను తొలగిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బుచ్చెయ్యపేట మండలంలోని వివిధ గ్రామాల ఆదర్శ రైతులతో శుక్రవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ఆదర్శ రైతులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. ఆదర్శ రైతుల్లో అన్ని పార్టీల వారూ ఉన్నారని గుర్తు చేశారు. రుణాలెవరూ చెల్లించవద్దని, బ్యాంకు వాళ్లు వస్తే తిరగబడాలని, రుణమాఫీపై తొలిసంతకం చేస్తానని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలిచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టాక రుణమాఫీపై కమిటీవేసి కాలయాపన చేయడంతోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో నిరంతర విద్యాకేంద్రాల ప్రేరక్‌లను నియమిస్తే వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని తొలగించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పైగా వెయ్యి రూపాయలున్న గౌరవ వేతనాన్ని రూ.3 వేలుకు పెంచి వైఎస్ ఆదుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వం 1269వ నంబర్ జీవో ప్రకారం ఆదర్శ రైతుల్ని నియమించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల మంది, జిల్లాలో 1600 మంది ఆదర్శ రైతులున్నారని, వారిని రోడ్డున పడేయవద్దని కోరారు. రైతులకు, సాగుకు అనుసంధాన కర్తలుగా ఉన్న ఆదర్శ రైతులను క్రమబద్ధీకరించి వారి గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే ఆదర్శ రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
మంత్రిగా రామన్న బాధ్యతల స్వీకరణ
ఆదిలాబాద్ : తెలంగాణ తొలి రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం 4.15 గంటల ప్రాంతంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల సమక్షంలో మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేశారు. జిల్లా ఎమ్మెల్యేలు ఐకే రెడ్డి, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, కోవ లక్ష్మి, రాథోడ్ బాపురావు, రేఖా శ్యాంనాయక్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ నేత బాలూరి గోవర్ధన్‌రెడ్డి, నాయకులు గోక మహేందర్‌రెడ్డి, తదితరులు మంత్రికి అభినందనలు తెలిపారు. వారితోపాటు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిందర్రెడ్డితో కలిసి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు ఎస్.అశోక్, తాలుకా అధ్యక్షుడు నవీన్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ప్రభాకర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డి.కిష్టు, తదితరులు అభినందనలు తెలిపారు. -
మరో దఫా పదవీయోగం
అయ్యన్నను నాలుగోసారి వరించిన మంత్రి పదవి మరోమారు చరిత్ర పుటల్లోకి నర్సీపట్నం అభివృద్ధిపై ఆశగా ఎదరుచూస్తున్న ప్రజానీకం ఆనందంలో పార్టీ వర్గాలు స్థానిక ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుకు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పదవి లభించడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో మూడు దఫాలుగా మంత్రిగా, ఒకమారు ఎంపీగా పనిచేసిన అయ్యన్న మరోమారు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నియోజకవర్గం అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : దేశం పార్టీ ఆవిర్భావం 1983 నుంచి నర్సీపట్నం శాసనసభకు పోటీచేస్తున్న అయ్యన్న మొదటి దశలోనే విజయం సాధించి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం బర్తరఫ్ చేశాక 1985లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు, ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్నపాత్రునికి సాంకేతిక విద్యాశాఖ, యువజన సర్వీసులు మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. తిరిగి 1994 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యన్నను ఆర్అండ్బీ శాఖ వరించింది. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. రెండేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో సైతం అయ్యన్నపాత్రుడు ఆర్అండ్బీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పార్టీ అయ్యన్నను అనకాపల్లి ఎంపీగా పోటీకి దింపింది. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత అయ్యన్నను అటవీశాఖ మంత్రి పదవి వరించింది. ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజ యం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆది నుంచి గంటా రాకను వ్యతిరేకిస్తున్న అయ్యన్న సాక్షాత్తూ విశాఖలో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలోనే తన వాదంపై గళం విప్పారు. ఈ విధం గా కొన్ని సమయాల్లో అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా వ్యవహరించిన అయ్యన్నకు మంత్రి పదవి రాదనే వదంతులు వ్యాపిం చాయి. దానికి భిన్నంగా ఆదివారం చంద్రబాబుతో పాటు అయ్యన్న కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయ్యన్నకు పంచాయతీరాజ్ లేక అటవీశాఖ మంత్రి బాధ్యతలు కేటాయిస్తారని ప్రచారంలో ఉంది. నాలుగోసారి మంత్రిగా ప్రమాణం చేసిన అయ్యన్నతో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని స్థానికులు అనందం వ్యక్తం చేస్తున్నారు. -
పచ్చధనం పరవళ్లు
మద్యం, డబ్బు పంపకాలకు రంగం సిద్ధం బంధువులు, ముఖ్యులకు పంపిణీ బాధ్యతలు కర్ణాటక నుంచి మద్యం దిగుమతి జిల్లాలో అత్యధిక నియోజకవర్గాల్లో గెలుపు తమది కాదని నిర్ణయించుకున్న తెలుగుతమ్ముళ్లు చివరి ప్రయత్నంగా ప్రలోభాల పర్వానికి తెరలేపారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి స్టాకు పెట్టుకోవటం, డబ్బులు పోలీసుల కన్నుగప్పి ఎలా పంపిణీ చేయాలి? అనే వ్యూహరచనల్లో ఉన్నారు. డబ్బుల కట్టలు రవాణా చేయకుండానే గ్రామ స్థాయిలో తమకు నమ్మకమైన వారికి, ఆర్థికలావాదేవీలు నిర్వహించే వ్యాపారస్తులకు, మిల్లర్లకు చెప్పి రైతులకు, గ్రామస్తులకు ఓట్లకు డబ్బులు పంచేందుకు నెట్వర్కును టీడీపీ అభ్యర్థులు, నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ అభ్యర్థుల తరఫున వారికి చెందిన ముఖ్యులు, బంధువులు ఈ రంగంలోకి దిగారు. ఈ తరహా ప్రయత్నా లు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే మొదలైంది. శాంతిపురం మండలంలో కర్ణాటక నుంచి ఒక లారీ మద్యం దిగుమతి చేసుకుని గ్రామాల్లో రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు మద్యం తెప్పించాలంటే నిఘా ఎక్కువగా ఉంటుందని ముందే తెలుగుతమ్ముళ్లు మద్యం తెప్పించి దాచినట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పొరుగున ఉన్న కర్ణాటక నుంచి మద్యం ఎలా తెప్పించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. డబ్బుల పంపిణీని కూడా వికేంద్రీకరించి, ముఖ్యంగా వైఎస్సార్సీపీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాల్లో ఎక్కువగా ఓటుకు రూ.2000 వరకు పంచి ఓట్లు రాబట్టాలనే లక్ష్యంతో టీడీపీ అభ్యర్థులు, వారి తరఫున అనుచరులు సమాలోచనలు జరుపుతున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఏకంగా ఎంపీ లాడ్స్‌తో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన వీధిదీపాలకు తన పేరు ముద్రించి,ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలకు చేరిన డబ్బులు తెలుగుదేశం అభ్యర్థులు ఓట్లు కొనుగోలు చేయాలనే తలంపుతో ఇప్పటి నుంచే డబ్బులు సిద్ధం చేసుకుం టున్నారు. రహస్య స్థలాల్లో, నమ్మకమైనవారి వద్ద డబ్బుల కట్టలు దాచుతున్నారు. ఎక్కువ చోట్ల వికేంద్రీకరించి డబ్బులను ఎక్కడికక్కడే పంపిణీ చేసే విధంగా, ఎన్నికలు ముగిసిన తరువాత ఈ పది రోజుల వడ్డీతో కలిపి తమ తరఫున డబ్బులు పంపిణీ చేసినవారికి చెల్లించే విధంగా టీడీపీ అభ్యర్థులు లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నారు. అర్ధరాత్రుల్లో, తెల్లవారుజామున పోలీసు చెక్‌పోస్టులను తప్పించి గ్రామ రహదారుల్లో డబ్బులు రవాణా చేస్తున్నారు. ఇప్పటికే డబ్బులను గ్రామాలకు తరలించేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో మండలాలవారీగా తమ ఉద్యోగులను టీడీపీ అభ్యర్థి గల్లా అరుణకుమారి ఇందుకోసమే ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. ఒక పంచాయతీకి ఒక ఉద్యోగి దగ్గరుండి తెలుగుదేశం నాయకులతో కలిసి ఆ గ్రామస్తులకు కావాల్సిన డబ్బులు, బహుమతులు, ఇతర సామగ్రి, మద్యం పంపిణీ వ్యవహారాలు పర్యవేక్షించే విధంగా చేస్తున్నట్లు చెబుతున్నారు. గల్లా ఫ్యాక్టరీకి చెందిన నమ్మకస్తులు, వారి సామాజికవర్గానికి చెందిన వారినే ఈ పనికి ఉపయోగిస్తున్నారు. -
ఒకరి ఆస్తి 9వేలు.. మరొకరి అప్పు 140 కోట్లు
అసోం ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. అభ్యర్థుల ఆస్తులు, అప్పుల వివరాలను వాళ్లు ఈసీకి దాఖలుచేసిన అఫిడవిట్ల ఆధారంగా చూసినప్పుడు దిమ్మ తిరుగుతోంది. లఖింపూర్ లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రిషికేశ్ బారువా తన ఆస్తి మొత్తం 9వేల రూపాయలు మాత్రమేనని చెప్పారు. నిజంగా అది నిజమే అయితే ఆ 9 వేలతో ఆయన ప్రచారం ఏం చేస్తాడో.. ఎన్నికల్లో ఎలా నిలబడతాడో ఆ పరమాత్ముడికే ఎరుక. ఇదే రాష్ట్రంలోని తేజ్ పూర్ స్థానానికి పోటీ పడుతున్న మోని కుమార్ సుబ్బా అనే స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 140 కోట్ల రూపాయల అప్పు ఉందట. ఎవరికైనా పదివేలు ఇవ్వాల్సి ఉంటేనే మనం రోజుకు పదిసార్లు తలుచుకుని, ఎలాగోలా ఇచ్చేయాలని ఆందోళన చెందుతుంటాం. అలాంటిది అంత పెద్ద మొత్తంలో అప్పులు ఉండి కూడా మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో నిలబడ్డాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కదా. అయితే.. ఆయన ఆస్తి కూడా ఏమంత తక్కువ కాదు. 306 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందట. అందుకే అందులో సగం మొత్తం అప్పు చేశాడన్నమాట. సుబ్బా ఆస్తి సరిగ్గా రూ.3,06,75,35,137 అని తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నాడు. తొలిదశ ఎన్నికల్లో అసోం నుంచి మొత్తం 64 మంది పోటీ పడుతుండగా, వాళ్లలో ఒకరి మీద హత్యాయ త్నం కేసు, మరొకరి మీద అత్యాచారం కేసు కూడా ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల ఆస్త్తిపాస్తులను సగటున చూస్తే ఒక్కొక్కరికి రూ. 5.75 కోట్లు ఉన్నట్లు లెక్క అని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. -
ఖర్చుకైనా... పొదుపుకైనా ‘చమురు’ వదిలిస్తారు..!
రాజిరెడ్డిది ప్రైవేటు ఉద్యోగం. చిన్న వయసులోనే బాధ్యతలు మీద పడ్డాయి. చదువు కూడా ఒకదశలో ఆగిపోయింది. అయితేనేం! ఉద్యోగం చేస్తూ... ఉన్నత చదువులు కూడా చదివాడు. అదే సమయంలో పక్కా ప్లానింగ్‌తో చక్కటి ఇండిపెండెంట్ ఇల్లు కూడా సొంతం చేసుకున్నాడు. చిన్న వయిసులోనే ఓ ఇంటివాడయ్యాడు. ఆ యువకుడి కథే ఈ వారం ఫైనాన్షియల్ టార్గెట్. చూడ్డానికి ఎడారి. నిండా చమురు నిక్షేపాలు. వాటితో కాసుల సేద్యం చేసే అబుదాబి, దుబాయ్, షార్జా వంటి ఏడు ఎమిరేట్స్ సమాఖ్యే యూఏఈ. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చాక 1970లలో ఈ సమాఖ్య ఏర్పడింది. చమురు నిల్వలతో పుష్కలంగా ఆదాయం వస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వాలు తమ పౌరులకు ఇళ్ల నుంచి విద్య దాకా ప్రతి దానికీ పభుత్వం సబ్సిడీలు ఇస్తున్నాయి. స్వదేశీయుల కన్నా విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వారి జనాభాయే ఇక్కడ అధికం. అయితే, ఆదాయ పన్ను మాత్రం లేదిక్కడ. ఖర్చు: చాలామంది ఎమిరేటీలు (ఎమిరేట్స్ పౌరులు) ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు చాలా తక్కువ. తమ పౌరుల పదవీ విరమణ అవసరాలపై ప్రభుత్వం బాగా శ్రద్ధ చూపిస్తోంది. పౌరులకు కావాల్సిన ఇతరత్రా అవసరాలనూ పట్టించుకుంటోంది. ఉదాహరణకు.. తక్కువ ఆదాయం వచ్చే ఎమిరేటీల వివాహాల కోసం ప్రత్యేకంగా యూఏఈ మ్యారేజ్ ఫండ్ ఉంది. ఇది పౌరుల వివాహాలకు 19,000 డాలర్ల దాకా గ్రాంటు కింద అందిస్తుంది. ఇల్లు మొదలుకుని కార్ల దాకా ప్రతీదీ సబ్సిడీ మీదే లభిస్తుంది. దీంతో వీరికి చేతినిండా డబ్బులుంటున్నాయి. దీన్ని విలాసాలకు ఖర్చు పెట్టేవారు కొందరైతే... మరీ కాస్మోపాలిటన్ జీవన విధానం కోరుకునే ఎమిరేటీలు... క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తూ, భారీగా వ్యక్తిగత రుణాలనూ తీసుకుంటున్నారు. సంక్షేమం: సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఉదారంగానే ఉంటోంది. సాధారణంగా ఉద్యోగుల పెన్షన్ నిధికి కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంటుంది. ఉదాహరణకు అబుదాబిలో పింఛను నిధికి ఉద్యోగులు తమ జీతంలో 5 శాతం ఇస్తే, వారు పని చేసే కంపెనీ మరో 15 శాతం, ప్రభుత్వం ఇంకో 6 శాతం నిధులను ఇస్తుంది. అంటే... నెలకు జీతంలో 26 శాతం పొదుపు చేస్తున్నట్లే. అందుకే ఎమిరేటీలకు రిటైర్మెంట్ తరవాత పెద్దగా ఇబ్బందులుండవు. పెట్టుబడులు: ఎమిరేటీలు తమ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వెల్లడించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ.. షేర్లు, బాండ్లు, ఇతర దేశాల్లో రియల్ ఎస్టేట్ వంటి సాధనాల్లో బాగానే ఇన్వెస్ట్ చేస్తారు. పెపైచ్చు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు యూఏఈ ప్రత్యేకంగా సార్వభౌమ వెల్త్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫండ్లలో ఇది కూడా ఒకటి. వివిధ దేశాల్లో వివిధ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. -
ఏది మంచి ఉద్యోగం?
ఉద్యోగం అధమం, వ్యాపారం మధ్యమం, వ్యవసాయం ఉత్తమం... అన్నారు పూర్వీకులు. అయితే ఇప్పుడు ప్రాధాన్యతలు మారిపోయాయి. అధమం అనుకున్న ఉద్యోగాన్ని ఉత్తమంగా భావించేవాళ్లు ఎక్కువయ్యారు. మరి ఇలాంటి ఉత్తమమైన ఉద్యోగాల్లో ఉత్తమోత్తమమైనది ఏది? ఏ ప్రాతిపదికన ఉద్యోగాన్ని అత్యుత్తమమైనదిగా భావించవచ్చు? అనే అంశం గురించి ‘సైకలాజికల్ సైన్స్’ పత్రిక తాజాగా సర్వే జరిపింది. సర్వే ఫలితాల ప్రకారం: 27 శాతం మంది... పెద్దస్థాయి బాధ్యతలు, నియంత్రణాధికారం ఉన్న ఉద్యోగం ఉత్తమమైనదని భావిస్తున్నారు. తాము తీసుకొనే నిర్ణయం ఎక్కువమందిని ప్రభావితం చేసేది అయితే బావుంటుందనేది వీరి అభిప్రాయం. 30 యేళ్లలోపు వాళ్లలో ఇలాంటి తపన అధికంగా ఉంది. వీరిలో 69 శాతం మంది అత్యున్నతస్థాయి బాధ్యత ఉన్న ఉద్యోగాన్ని కోరుకొంటున్నారు. 24 శాతం మంది... భారీస్థాయి జీతం వచ్చేదే ఉత్తమమైన ఉద్యోగం అంటున్నారు. జీతంతోనే వృత్తిపరమైన సంతృప్తి వస్తుందని వీరు అభిప్రాయపడుతున్నారు. 14 శాతం మంది యజమాని-ఉద్యోగి మధ్య సంత్సంబంధాలు ఉండేదే అత్యుత్తమైన ఉద్యోగం అన్నారు. మంచి బాస్ దగ్గర పనిచేయగలగడం అదృష్టమని వీరు అంటున్నారు. 13 శాతంమంది... అదనపు ఆదాయం ఉండాలన్నారు. జీతం కాక అదనంగా సంపాదించుకొనే ఉద్యోగం మంచిదని వీరి అభిప్రాయం. 12 శాతం మంది... ఆఫీస్ పరిస్థితులు, పరిసరాలు వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. స్టాఫ్ అంతా స్నేహితుల్లా ఉంటే ఆ ఉద్యోగాన్ని సాఫీగా చేయొచ్చన్నది వీరి అభిప్రాయం. 10 శాతం మంది... పనివేళల గురించి మాట్లాడుతున్నారు. నైటీ డ్యూటీ లేకపోవడం, ఏడెనిమిది గంటలే పనిచేయాల్సిన జాబ్ అయితే చాలని, తక్కువ జీతం అయినా ఇలాంటి జాబ్ మంచిదని భావిస్తున్నాం అనీ చెబుతున్నారు. చివరిగా, వీరంతా ఏకాభిప్రాయానికి వచ్చిన అంశం ఏమిటంటే - మనశ్శాంతి, ఆత్మసంతృప్తి ఉన్న ఉద్యోగమే అత్యుత్తమమైనదని..! -
ఆస్తులు, అప్పుల పంపిణీపై ఆర్థికశాఖ కసరత్తు
-
అప్పుల ఊబిలో తెహల్కా
సంచలన కథనాలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రికకు అదే రీతిలో కష్టాలు వెంటాడుతున్నాయి. లైంగిక వేధింపులకు కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ జైలుపాలు కాగా, యాజమాన్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తెహల్కా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు వార్తలు వెలువడ్డాయి. తమ ఆస్తుల విలువ కంటే ఆస్తిఅప్పుల చిట్టా చాలా ఎక్కువగా ఉన్నట్టు తెహల్కా హోల్డింగ్ కంపెనీ ఆడిటింగ్ నివేదికలో పేర్కొంది. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ తేజ్పాల్పై ఆరోపణలు రాగానే తెహల్కా యాజమాన్యం ఇతర కంపెనీల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. పన్నులు చెల్లించలేదని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరిపే అవకాశముంది. కాగా ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. అనంత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో తెహల్కా పబ్లికేషన్ గ్రూప్ నడుస్తోంది. ఈ కంపెనీ దాదాపు 13 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు సమాచారం. గతేడాది చివరకు అనంత్ మీడియాలో తరుణ్ తేజ్‌పాల్, అతని సోదరి నీనా తేజ్‌పాల్, సతీష్ మెహతా, ప్రవీణ్ కుమార్ డైరెక్టర్లుగా ఉన్నారు.