
అప్పుల ఊబిలో తెహల్కా
సంచలన కథనాలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రికకు అదే రీతిలో కష్టాలు వెంటాడుతున్నాయి. లైంగిక వేధింపులకు కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ జైలుపాలు కాగా, యాజమాన్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తెహల్కా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు వార్తలు వెలువడ్డాయి. తమ ఆస్తుల విలువ కంటే ఆస్తిఅప్పుల చిట్టా చాలా ఎక్కువగా ఉన్నట్టు తెహల్కా హోల్డింగ్ కంపెనీ ఆడిటింగ్ నివేదికలో పేర్కొంది. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తరుణ్ తేజ్పాల్పై ఆరోపణలు రాగానే తెహల్కా యాజమాన్యం ఇతర కంపెనీల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. పన్నులు చెల్లించలేదని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరిపే అవకాశముంది. కాగా ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. అనంత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో తెహల్కా పబ్లికేషన్ గ్రూప్ నడుస్తోంది. ఈ కంపెనీ దాదాపు 13 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు సమాచారం. గతేడాది చివరకు అనంత్ మీడియాలో తరుణ్ తేజ్పాల్, అతని సోదరి నీనా తేజ్పాల్, సతీష్ మెహతా, ప్రవీణ్ కుమార్ డైరెక్టర్లుగా ఉన్నారు.