రాయని డైరీ
‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’.. షెల్ఫ్ లోంచి ఎప్పుడు నా చేతిలోకి వచ్చిందో తెలీదు. అది నా పుస్తకమే. పదేళ్ల క్రిందట రాసింది! ఊరికే చూస్తూ కూర్చున్నాను, పేజీలు తిప్పకుండా.
అట్ట మీద ఆరోగ్యవంతమైన స్త్రీ నగ్నదేహం. లోపల స్త్రీ గురించి ఏం ఉండదు. అంతా మగాళ్ల ఏడుపు. ఆ ఏడుపుకి ఘనీభవ రూపమే.. అట్ట మీద ఉన్న స్త్రీ దేహం.
లోపల ఏం రాశానో నాకు తెలుసు కాబట్టి, లోపల ఏం రాసి ఉందో తెలుసుకునే ఉత్సాహం నాకు లేదు. పైన స్త్రీ దేహంలోనే.. ఏళ్లుగా చూస్తూ ఉన్నా, తెలియంది ఇంకా ఏదో ఉన్నట్లనిపిస్తుంటుంది. ఆ ఉందనుకున్నది స్త్రీలో లేనిది కావచ్చు. ‘ఉందీ’ అని పురుషుడు అనుకోవడంలో ఉన్నదీ కావచ్చు. ఏది నిజం? ఏది అబద్ధం? స్త్రీ దేహంలో ఈ రెండూ ఒకటేనా?
‘‘తరుణ్.. మొత్తం తొమ్మిది చార్జిషీట్లు మన మీద వేయబోతున్నారు’’ అన్నాడు ప్రమోద్ కుమార్ దూబే.. ఆయాసపడుతూ వచ్చి.
నా లాయర్ అతడు. ముఖం చిన్నబోయి ఉంది. ‘ఇట్స్ ఓకే’ అన్నాను. సో.. తొమ్మిది చార్జిషీట్లు, తొమ్మిది విచారణలు, తొమ్మిది శిక్షలు!
‘‘పదేళ్లకు తగ్గకుండా మనకు శిక్ష పడే అవకాశం ఉంది తరుణ్’’ అన్నాడు దూబే.
నవ్వాను.
‘‘మిస్టర్ దూబే, మీరలా మాటిమాటికీ ‘మన మీద’, ‘మనకు’.. అంటూ మిమ్మల్ని నాతో కలుపుకోకండి. నేను నిందితుడిని. మీరు నా లాయర్’’ అన్నాను.
‘‘కానీ తరుణ్.. అన్యాయం అనిపిస్తోంది. ఒక మగవాడి మీద ఇన్ని కేసులు! రాంగ్‌ఫుల్ కన్‌స్ట్రెయింట్, రాంగ్‌ఫుల్ కన్‌ఫైన్‌మెంట్, క్రిమినల్ ఫోర్స్, సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్, హెరాస్‌మెంట్, అస్సాల్ట్ అండ్ రేప్.. లిఫ్ట్‌లో ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి ఉన్న పద్నాలుగు సెకన్లలోనే ఇవన్నీ ఎలా జరిగిపోతాయో నాకైతే అర్థం కావడం లేదు. మగవాడికి వ్యతిరేకంగా ఇండియన్ పీనల్ కోడ్‌లో ఇన్ని సెక్షన్లు ఉన్నాయా అనిపిస్తోంది’’ అన్నాడు దూబే.
‘‘మగవాడికి వ్యతిరేకంగా కాదు మిస్టర్ దూబే.. స్త్రీ దేహానికి అనుకూలంగా.. ’’ అని పెద్దగా నవ్వాను.
భయంగా చూశాడు దూబే. ఒక మగవాడిలో కనిపించే భయం అది!
‘‘పెద్దగా నవ్వితే నవ్వారు. చిన్నగా మాట్లాడండి తరుణ్’’ అని చెప్పి, వెళ్లిపోయాడు.
‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’ ఇంకా నా చేతుల్లోనే ఉంది.
అట్టమీది బొమ్మను చూస్తుంటే నా మీద కేసు పెట్టిన నా జూనియర్ మోస్ట్ గుర్తుకొచ్చింది. ఐ లవ్ హర్! తన దేహానికి ఏదో అయిందని, అవబోయిందనీ తను కేసు పెట్టలేదు. ఒక ఎంప్లాయర్‌గా నాపై తను ఉంచిన నమ్మకానికి దెబ్బ తగిలిందని కేసు పెట్టింది. గ్రేట్ గర్ల్.
మాధవ్ శింగరాజు