Paatal Lok Web Series Review in Telugu | ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ - Sakshi
Sakshi News home page

దానవ మానవుల పాతాళ్‌ లోక్‌

Published Fri, May 22 2020 5:35 AM | Last Updated on Fri, May 22 2020 4:35 PM

Review of Paatal Lok web series - Sakshi

ఆకాశ హర్మ్యాలలో ఉంటారు కొందరు. నేల మీద ఉంటారు కొందరు. నేలకు దిగువన పాతాళలోకంలో వసిస్తారు కొందరు. పాతాళం అంటే చీకటి. నలుపు. చెడు. హింస. ప్రాణాలకు తెగించి చేసే బతుకు సమరం. కాని పాతాళంలోని బతుకులు ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేల మీద ఉన్నవారు, ఐశ్వర్యపు అంచుల్లో బతికేవారు... వీరు తయారు చేసిన వ్యవస్థేనా దీనికి కారణం. ‘అమెజాన్‌ ఒరిజినల్స్‌’లో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌ సిరీస్‌ చూడ్డానికి పైకి ఉత్కంఠ రేపే క్రైమ్‌ థ్రిల్లర్‌లా ఉంటుంది. నిజానికి ఇది మూసి ఉంచిన భారతీయ సమాజం. తెలిసీ చీకటిలో ఉంచేసే గుగుర్పాటు సమాజం.

ఢిల్లీలో యుమునా నది అందరికీ తెలుసు. కాని ‘యమునా పార్‌’ (యమునకు ఆవల) ఒక ప్రపంచం ఉంది. అది దిగువ స్థాయి ప్రజల ప్రపంచం. స్లమ్స్‌ ప్రపంచం. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండే ప్రపంచం. ఆ యమునా పార్‌లో ‘ఔటర్‌ యమునా పార్‌’ పోలీస్‌ స్టేషనే మన కథాస్థలం. అందులో పని చేసే ఒక సాదాసీదా సర్కిల్‌ ఇన్స్‌పెక్టరే మన కథా నాయకుడు. అతని పేరు హాతీరామ్‌ చౌదరీ.

కథ ఏమిటి?
ఢిల్లీలో ఉన్న ఒక ప్రఖ్యాత న్యూస్‌ చానల్‌ హెడ్‌ మీద హత్యాయత్నం జరగనుందని పోలీసులకు తెలుస్తుంది. హత్య చేయడానికి పక్క ఊర్ల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు యమునా పార్‌ లాడ్జ్‌లో దిగి ఉన్నారు. ఆ లాడ్జ్‌ నుంచి బయట పడి హత్యకు బయలుదేరుతుండగా ఒక్క ఉదుటున వెంబడించి అరెస్ట్‌ చేస్తారు. జరిగిన హత్యాయత్నం ప్రఖ్యాత జర్నలిస్ట్‌ మీద. అతనికి ఏదైనా అయి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అసలు ఈ చానల్‌హెడ్‌ను చంపడానికి ప్లాన్‌ చేసిందెవరు? అందుకు సిద్ధమైన ఈ నలుగురు ఎవరు? కేసు హాతీరామ్‌ చౌదరికి అప్పచెప్పబడుతుంది. అతనికి తోడుగా ఒక కుర్ర ఎస్‌.ఐని ఇస్తారు. వీరిద్దరూ అంత పెద్ద కేసును సాల్వ్‌ చేయాలి. చేయగలరా? చేయకూడదనే కొందరి ప్లాన్‌. అందుకే హాతీరామ్‌కు అప్పజెప్పారు. ఇప్పుడు హాతీరామ్‌ ఏం చేయాలి?

ఒక్క అవకాశం
హాతీరామ్‌ ఒక సగటు మధ్యతరగతి వాడు. జీవితంలో ఏమీ సాధించలేదు. ఇంట్లో భార్య అతడి ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుంది. హైస్కూలుకు వచ్చిన కొడుకు తన తండ్రి ఒక హీరోలా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఒక పోలీస్‌ వ్యాన్‌ వేసుకొని, చిరుబొజ్జ పెంచుకుని చిల్లర తగాదాలు, మొగుడూ పెళ్లాల పంచాయితీలు తీరుస్తూ వచ్చిన హాతీరామ్‌కు ఇది తన జీవితంలో దొరికిన అత్యంత ముఖ్యమైన అవకాశం అనుకుంటాడు. దీనిని ఎలాగైనా సాల్వ్‌ చేయాలి. ఎలా? నలుగురు నిందితులు దొరికారు కాబట్టి వీరి నుంచే ఆధారాలు దొరకాలి. వారిని ఇంటరాగేట్‌ చేయడం మొదలుపెడతాడు. వారిలో ఒకడిది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌. ఇంకొకడిది పంజాబ్‌. ఒకడిది మీరట్‌. ఒకరిది ఢిల్లీ. ఈ నలుగురినీ కలిపింది ఎవరు? హాతీరామ్‌ తీగలాగుతూ వెళతాడు. మెల్లగా డొంక కదులుతుంది. కథ చివరకు తాను కేసు సాల్వ్‌ చేసి తీరుతాడు.

అంతా మంచే ఉండదు.. ప్రతిదీ చెడే కాదు
ఒక హత్యాయత్నం, దాన్ని ప్లాన్‌ చేసినవారిని పట్టుకోవడం ఇదే కథైతే ఈ సిరీస్‌ ఇంతమందిని ఆకట్టుకునేది కాదు. కాని ఇది జీవితాలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సమాజ భ్రష్టత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మేడిపండులా కనిపించే వ్యవస్థ కడుపులో ఎంత కుళ్లు ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కులం, మతం, ఆర్థిక అంతరాలు, స్వార్థం... ఇవన్నీ మనిషిని ఎలా మారుస్తాయి ఈ సిరీస్‌ చెబుతుంది. నేరస్తులు ఎలా తయారవుతారు, ఎందుకు తయారవుతారు, అవడానికి మూలం ఏమిటి ఇది చెబుతుంది.

కొందరి పట్ల ఈ దేశంలో ఉన్న వివక్షను, ఛీత్కారాన్ని, అవమానాన్ని చాలా శక్తిమంతంగా చూపిస్తుంది. పోలీసుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మేడల్లో ఉండేవారిలో కూడా మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మంచి చెడు అనేది మనుషుల్లో ఉంటూ మారుతూ ఉండే లక్షణంగా ఈ సిరీస్‌లో కనిపించి ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. కథ గడిచే కొద్దీ ప్రతి పాత్ర మీద ప్రేక్షకుడి అంచనా మారిపోతూ ఉంటుంది. ప్రతి పాత్రను నలుపు తెలుపుల్లో విడగొట్టలేమని తెలుస్తుంది.

తరుణ్‌ తేజ్‌పాల్‌ పుస్తకంతో
‘తహెల్కాడాట్‌కామ్‌’తో తరుణ్‌ తేజ్‌పాల్‌ సంచలనం సృష్టించడం అందరికీ తెలుసు. జర్నలిస్టుగా అతను రాసిన ‘ది స్టోరీ ఆఫ్‌ మై అసాసిన్స్‌’ పుస్తకం ఈ సిరీస్‌ తీయడానికి ఇన్‌స్పిరేషన్‌. పాతాళ్‌లోక్‌లో చానెల్‌ హెడ్‌ చాలా పేరున్నవాడు. పాలకుల మీద చాలా స్ట్రింగ్‌ ఆపరేషన్లు చేసి ఉంటాడు. ఒక సంభాషణలో అతను లెఫ్ట్‌ ఐడియాలజీ ఉన్నవాడని చెబుతారు. కాని అతను కూడా తన ఉనికి కోసం పతనమవడం ఈ సిరీస్‌ లో మనం చూస్తాం. మీడియా ఎలాంటి తప్పుడు పనులకు తెగబడుతుందో, తన టి.ఆర్‌.పిల కోసం ఎవరినైనా ఎలా బలి చేయడానికి సిద్ధపడుతుందో ఇందులో చూపిస్తారు.

ఈ ప్రొఫెషన్‌లో ఉండే వ్యక్తుల భార్యలు ఎలాంటి వొత్తిడికి గురవుతారో, ఎంత యాంగ్జయిటీ ఫీలవుతుంటారో ఇందులో చానెల్‌ హెడ్‌ భార్య పాత్ర ద్వారా చూపిస్తారు. ఇందులో డి.సి.పి చెప్పే డైలాగ్‌ ఒకటి ఉంది– ‘చూడటానికి ఈ వ్యవస్థ ఒక చెత్త కుప్పలా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లి చూస్తే ఒక మిషన్‌ అని అర్థమవుతుంది. ఈ మిషన్‌లో ప్రతి నట్టూ బోల్టు తాము ఏం చేయాలో తెలుసుకొని పని చేస్తుంటాయి. అలా తెలుసుకోని వాటి స్థానంలో కొత్త నట్లూ బోల్టులు వస్తుంటాయి. వ్యవస్థ మాత్రం అలానే నడుస్తుంటుంది’ అని అంటాడతడు. రాజకీయ నాయకులు, పోలీసులు, పెద్ద మనుషులు వీరు ఆడే ఆటలకు పాతాళలోకంలోని సగటు మనుషులు శలభాల్లా నాశనం కావడమే ‘పాతాళ్‌లోక్‌’ మూల కథాంశం.

ఉత్కంఠ రేపే కథనం
దాదాపు 40 నిమిషాలు ఉండే ప్రతి ఎపిసోడ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ నడిచే కొద్దీ తర్వాత ఏం జరుగుతుందా అని కుతూహలం పెరుగుతుంది. కథనం ముందు వెనుకలుగా, పారలల్‌గా నడుస్తూ ఉంటుంది. ఒరిజినల్‌ లొకేషన్స్‌లో వాస్తవిక ప్రవర్తనతో తీయడం వల్ల ప్రేక్షకుడు తాను ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా భావిస్తాడు. ఇందులో ముఖ్యపాత్ర ధారి, హాతీరామ్‌గా వేసిన నటుడు జైదీప్‌ అహ్లావత్‌ ఇంతకు ముందు గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసెపూర్‌లో నటించాడు. ఈ సిరీస్‌ అతనికి చాలా పేరు తెచ్చింది. సిరీస్‌లో చేసిన వారందరూ పాత్రలు కారేమో అసలు మనుషులే నటిస్తున్నారేమో అనిపించేలా చేశారు. గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ క్రైమ్‌ థ్రిల్లర్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. అమేజాన్‌లో ‘పాతాళ్‌ లోక్‌’ అంతకన్నా ఎక్కువ ప్రశంసలు పొందుతోంది. రచయిత సుదీప్‌ శర్మ రెండేళ్లు కష్టపడి రాసిన ఈ సిరీస్‌ను హిందీ అర్థమయ్యేవారు తప్పక చూడొచ్చు. ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌ ఫాలో అవుతూ చూడాలనుకునేవారూ చూడొచ్చు.


పాతాళ్‌ లోక్‌
(అమెజాన్‌ ఒరిజినల్స్‌ వెబ్‌ సిరీస్‌)
ఎపిసోడ్‌ల సంఖ్య: 9
మొత్తం నిడివి: 6 గం.30 నిమిషాలు
రచన: సుదీప్‌ శర్మ
దర్శకత్వం: అవినాష్‌– ప్రొసిత్‌ రాయ్‌
నిర్మాత: అనుష్కా శర్మ


– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement