Crime thriller story film
-
ఓటీటీకి రియల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను సినీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్‌తోనే చూసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజు రోజుకు కొత్త కొత్త కంటెంట్‌ను ఓటీటీలు అందిస్తున్నాయి. అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా కంటెంట్‌తోనే యధార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త క్రైమ్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే పేరుతో బెర్లిన్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ రహస్యమైన, విచిత్రమైన హత్యల కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ రియల్ క్రైమ్ కథకు జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు. ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే 2012లో జరిగిన చీకటి సంఘటనల గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్‌లైఫ్ కిల్లర్‌లో కేవలం మూడు సీజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్‌లో రిక్ హబ్నర్, ట్రిస్టన్ బమ్, కార్నెలియా వెర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్'. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో జయరాం హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మెగాస్టార్ మమ్ముట్టి కనిపించారు. కాగా.. జయరాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజవ్వగా.. తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తండ్రిగా మెప్పించారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భాగమతి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జయరాం.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. -
డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్'. పులకిత్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దారుణాలను బయటికి తీసే జర్నలిస్ట్ జర్నలిస్ట్ వైశాలీ సింగ్ పాత్రలో భూమి కనిపించనుంది. కాగా.. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యుగ్ రామ్, వంశీ కోటు, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇంటరాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'ది ట్రయల్'. ఈ చిత్రానికి రామ్ గన్నీ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై స్మృతి సాగి, శ్రీనివాస్ కె. నాయుడు నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ కథతో ఈ మూవీని రూపొందించారు. గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌గా ఓటీటీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్కు అవుతోంది. థియేటర్లలో మిస్సయినవారు.. ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు ఓ లుక్ వేసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ పులిమె, సాక్షి ఉత్తాడ, జశ్వంత్ పెరుమాళ్ల, వజీర్ ఇషాన్ కూడా కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. ది ట్రయల్ కథేంటంటే.. 'కథ రీత్యా సబ్ఇన్స్పెక్టర్ రూప, ఆమె భర్త అజయ్ ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపనే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెరకెక్కించారు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న రియల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ టాలీవుడ్ మూవీని దాటేసి!
ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేస్తున్నారు. ముఖ్యంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సాధారణ సినిమాలతో పోలిస్తే.. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. తెలుగులో ఇటీవల రిలీజైన దూత, ది విలేజ్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవలే ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్' ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా టాప్-3లో నిలిచింది. టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ, షారుక్ ఖాన్ జవాన్‌ను, ఆక్వామన్ చిత్రాలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 30 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించారు. -
క్రైమ్ థ్రిల్లర్‌గా ఆది ‘కిరాతక’ మూవీ, ఫస్ట్‌లుక్ విడుదల
ఆది సాయికుమార్, పాయల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కిరాతక’. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఇటీవల ప్రకటించగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం(జూలై 8) ‘కిరాతక’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ స్పష్టం వెల్లించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటివరకు చాలా కథలు విన్నాను. కానీ ఈ థ్రిల్లర్ కథ బాగా నచ్చింది.పెర్ఫామెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే ఆదితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు వీరభద్రమ్, నిర్మాత నాగం తిరుపతిరెడ్డిలకు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ తెలిపింది. నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా విజన్ సినిమాస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.3గా ‘కిరాతక’ మూవీ రూపొందుతోంది. మా హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్ హిట్ కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈమూవీ మేకింగ్ విషయంలో ఎక్కడ తగ్గకుండా నిర్మిస్తున్నాము. డైరెక్టర్ వీరభద్రమ్ కథ వివరించగానే బాగా నచ్చింది. తప్పకుండా మా సినిమా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ జరిపి ఆగస్ట్ 13 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని అన్నారు. అలాగే దర్శకుడు ఎం.వీరభద్రమ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అలాగే దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆది ఇంత వరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. ‘కిరాతక’ మూవీ కథ నచ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో నటించడానికి పాయల్ రాజ్‌పూత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. -
క్రైమ్ థ్రిల్లర్ ఆరంభం
‘ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్’ వంటి హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఓ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు సంపత్ నంది వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన అశోక్ తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. మా బ్యానర్లో ‘ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నా¯Œ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, సంగీతం: అనూప్ క్రియేటివ్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సంపత్ నంది. -
ప్యాన్ ఇండియా మూవీ సిరీస్‌లో...
ఆదీ సాయికుమార్ హీరోగా ఓ ప్యాన్ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రంతో బాలవీర్. యస్ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. యస్.వి.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై యస్.వి.ఆర్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. ఇందులో ఫ్యాంటసీ ఎలిమెంట్స్, వీఎఫ్ఎక్స్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆదీ సాయికుమార్ చేసిన గత చిత్రాలకు భిన్నంగా కామిక్ టచ్‌తో సాగే చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌పై దృష్టి పెట్టాం. ఈ చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సిరీస్‌లో చాప్టర్ 1 త్వరలోనే ప్రారంభం కానుంది. ఆదికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నాం’’ అన్నారు. -
దానవ మానవుల పాతాళ్ లోక్
ఆకాశ హర్మ్యాలలో ఉంటారు కొందరు. నేల మీద ఉంటారు కొందరు. నేలకు దిగువన పాతాళలోకంలో వసిస్తారు కొందరు. పాతాళం అంటే చీకటి. నలుపు. చెడు. హింస. ప్రాణాలకు తెగించి చేసే బతుకు సమరం. కాని పాతాళంలోని బతుకులు ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేల మీద ఉన్నవారు, ఐశ్వర్యపు అంచుల్లో బతికేవారు... వీరు తయారు చేసిన వ్యవస్థేనా దీనికి కారణం. ‘అమెజాన్ ఒరిజినల్స్’లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ చూడ్డానికి పైకి ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. నిజానికి ఇది మూసి ఉంచిన భారతీయ సమాజం. తెలిసీ చీకటిలో ఉంచేసే గుగుర్పాటు సమాజం. ఢిల్లీలో యుమునా నది అందరికీ తెలుసు. కాని ‘యమునా పార్’ (యమునకు ఆవల) ఒక ప్రపంచం ఉంది. అది దిగువ స్థాయి ప్రజల ప్రపంచం. స్లమ్స్ ప్రపంచం. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండే ప్రపంచం. ఆ యమునా పార్లో ‘ఔటర్ యమునా పార్’ పోలీస్ స్టేషనే మన కథాస్థలం. అందులో పని చేసే ఒక సాదాసీదా సర్కిల్ ఇన్స్పెక్టరే మన కథా నాయకుడు. అతని పేరు హాతీరామ్ చౌదరీ. కథ ఏమిటి? ఢిల్లీలో ఉన్న ఒక ప్రఖ్యాత న్యూస్ చానల్ హెడ్ మీద హత్యాయత్నం జరగనుందని పోలీసులకు తెలుస్తుంది. హత్య చేయడానికి పక్క ఊర్ల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు యమునా పార్ లాడ్జ్‌లో దిగి ఉన్నారు. ఆ లాడ్జ్ నుంచి బయట పడి హత్యకు బయలుదేరుతుండగా ఒక్క ఉదుటున వెంబడించి అరెస్ట్ చేస్తారు. జరిగిన హత్యాయత్నం ప్రఖ్యాత జర్నలిస్ట్ మీద. అతనికి ఏదైనా అయి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అసలు ఈ చానల్హెడ్ను చంపడానికి ప్లాన్ చేసిందెవరు? అందుకు సిద్ధమైన ఈ నలుగురు ఎవరు? కేసు హాతీరామ్ చౌదరికి అప్పచెప్పబడుతుంది. అతనికి తోడుగా ఒక కుర్ర ఎస్.ఐని ఇస్తారు. వీరిద్దరూ అంత పెద్ద కేసును సాల్వ్ చేయాలి. చేయగలరా? చేయకూడదనే కొందరి ప్లాన్. అందుకే హాతీరామ్కు అప్పజెప్పారు. ఇప్పుడు హాతీరామ్ ఏం చేయాలి? ఒక్క అవకాశం హాతీరామ్ ఒక సగటు మధ్యతరగతి వాడు. జీవితంలో ఏమీ సాధించలేదు. ఇంట్లో భార్య అతడి ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుంది. హైస్కూలుకు వచ్చిన కొడుకు తన తండ్రి ఒక హీరోలా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఒక పోలీస్ వ్యాన్ వేసుకొని, చిరుబొజ్జ పెంచుకుని చిల్లర తగాదాలు, మొగుడూ పెళ్లాల పంచాయితీలు తీరుస్తూ వచ్చిన హాతీరామ్కు ఇది తన జీవితంలో దొరికిన అత్యంత ముఖ్యమైన అవకాశం అనుకుంటాడు. దీనిని ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఎలా? నలుగురు నిందితులు దొరికారు కాబట్టి వీరి నుంచే ఆధారాలు దొరకాలి. వారిని ఇంటరాగేట్ చేయడం మొదలుపెడతాడు. వారిలో ఒకడిది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్. ఇంకొకడిది పంజాబ్. ఒకడిది మీరట్. ఒకరిది ఢిల్లీ. ఈ నలుగురినీ కలిపింది ఎవరు? హాతీరామ్ తీగలాగుతూ వెళతాడు. మెల్లగా డొంక కదులుతుంది. కథ చివరకు తాను కేసు సాల్వ్ చేసి తీరుతాడు. అంతా మంచే ఉండదు.. ప్రతిదీ చెడే కాదు ఒక హత్యాయత్నం, దాన్ని ప్లాన్ చేసినవారిని పట్టుకోవడం ఇదే కథైతే ఈ సిరీస్ ఇంతమందిని ఆకట్టుకునేది కాదు. కాని ఇది జీవితాలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సమాజ భ్రష్టత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మేడిపండులా కనిపించే వ్యవస్థ కడుపులో ఎంత కుళ్లు ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కులం, మతం, ఆర్థిక అంతరాలు, స్వార్థం... ఇవన్నీ మనిషిని ఎలా మారుస్తాయి ఈ సిరీస్ చెబుతుంది. నేరస్తులు ఎలా తయారవుతారు, ఎందుకు తయారవుతారు, అవడానికి మూలం ఏమిటి ఇది చెబుతుంది. కొందరి పట్ల ఈ దేశంలో ఉన్న వివక్షను, ఛీత్కారాన్ని, అవమానాన్ని చాలా శక్తిమంతంగా చూపిస్తుంది. పోలీసుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మేడల్లో ఉండేవారిలో కూడా మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మంచి చెడు అనేది మనుషుల్లో ఉంటూ మారుతూ ఉండే లక్షణంగా ఈ సిరీస్‌లో కనిపించి ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. కథ గడిచే కొద్దీ ప్రతి పాత్ర మీద ప్రేక్షకుడి అంచనా మారిపోతూ ఉంటుంది. ప్రతి పాత్రను నలుపు తెలుపుల్లో విడగొట్టలేమని తెలుస్తుంది. తరుణ్ తేజ్‌పాల్ పుస్తకంతో ‘తహెల్కాడాట్కామ్’తో తరుణ్ తేజ్‌పాల్ సంచలనం సృష్టించడం అందరికీ తెలుసు. జర్నలిస్టుగా అతను రాసిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ పుస్తకం ఈ సిరీస్ తీయడానికి ఇన్స్పిరేషన్. పాతాళ్లోక్లో చానెల్ హెడ్ చాలా పేరున్నవాడు. పాలకుల మీద చాలా స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఉంటాడు. ఒక సంభాషణలో అతను లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాడని చెబుతారు. కాని అతను కూడా తన ఉనికి కోసం పతనమవడం ఈ సిరీస్ లో మనం చూస్తాం. మీడియా ఎలాంటి తప్పుడు పనులకు తెగబడుతుందో, తన టి.ఆర్.పిల కోసం ఎవరినైనా ఎలా బలి చేయడానికి సిద్ధపడుతుందో ఇందులో చూపిస్తారు. ఈ ప్రొఫెషన్లో ఉండే వ్యక్తుల భార్యలు ఎలాంటి వొత్తిడికి గురవుతారో, ఎంత యాంగ్జయిటీ ఫీలవుతుంటారో ఇందులో చానెల్ హెడ్ భార్య పాత్ర ద్వారా చూపిస్తారు. ఇందులో డి.సి.పి చెప్పే డైలాగ్ ఒకటి ఉంది– ‘చూడటానికి ఈ వ్యవస్థ ఒక చెత్త కుప్పలా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లి చూస్తే ఒక మిషన్ అని అర్థమవుతుంది. ఈ మిషన్‌లో ప్రతి నట్టూ బోల్టు తాము ఏం చేయాలో తెలుసుకొని పని చేస్తుంటాయి. అలా తెలుసుకోని వాటి స్థానంలో కొత్త నట్లూ బోల్టులు వస్తుంటాయి. వ్యవస్థ మాత్రం అలానే నడుస్తుంటుంది’ అని అంటాడతడు. రాజకీయ నాయకులు, పోలీసులు, పెద్ద మనుషులు వీరు ఆడే ఆటలకు పాతాళలోకంలోని సగటు మనుషులు శలభాల్లా నాశనం కావడమే ‘పాతాళ్‌లోక్’ మూల కథాంశం. ఉత్కంఠ రేపే కథనం దాదాపు 40 నిమిషాలు ఉండే ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ నడిచే కొద్దీ తర్వాత ఏం జరుగుతుందా అని కుతూహలం పెరుగుతుంది. కథనం ముందు వెనుకలుగా, పారలల్‌గా నడుస్తూ ఉంటుంది. ఒరిజినల్ లొకేషన్స్‌లో వాస్తవిక ప్రవర్తనతో తీయడం వల్ల ప్రేక్షకుడు తాను ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా భావిస్తాడు. ఇందులో ముఖ్యపాత్ర ధారి, హాతీరామ్గా వేసిన నటుడు జైదీప్ అహ్లావత్ ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్లో నటించాడు. ఈ సిరీస్ అతనికి చాలా పేరు తెచ్చింది. సిరీస్‌లో చేసిన వారందరూ పాత్రలు కారేమో అసలు మనుషులే నటిస్తున్నారేమో అనిపించేలా చేశారు. గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘సేక్రెడ్ గేమ్స్’ క్రైమ్ థ్రిల్లర్‌గా చాలా పెద్ద హిట్ అయ్యింది. అమేజాన్‌లో ‘పాతాళ్ లోక్’ అంతకన్నా ఎక్కువ ప్రశంసలు పొందుతోంది. రచయిత సుదీప్ శర్మ రెండేళ్లు కష్టపడి రాసిన ఈ సిరీస్‌ను హిందీ అర్థమయ్యేవారు తప్పక చూడొచ్చు. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఫాలో అవుతూ చూడాలనుకునేవారూ చూడొచ్చు. పాతాళ్ లోక్ (అమెజాన్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్) ఎపిసోడ్ల సంఖ్య: 9 మొత్తం నిడివి: 6 గం.30 నిమిషాలు రచన: సుదీప్ శర్మ దర్శకత్వం: అవినాష్– ప్రొసిత్ రాయ్ నిర్మాత: అనుష్కా శర్మ – సాక్షి ఫ్యామిలీ -
చవితికి కురుక్షేత్రం
యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘నిబునన్’ చిత్రాన్నే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శ్రీనివాస్ మీసాల వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న ‘కురుక్షేత్రం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నాకు తెలుగు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందుకే.. తెలుగు రిలీజ్ కోసం ఆత్రుతగా ఉన్నా’’ అన్నారు. ‘‘దాదాపు 200కు పైగా థియేటర్స్‌లో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అర్జున్ 150వ సినిమాని మా బ్యానర్లో రిలీజ్ చేయడం హ్యాపీ’’ అన్నారు మీసాల శ్రీనివాస్. ‘‘అర్జున్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించేవన్నీ ‘కురుక్షేత్రం’లో ఉంటాయి. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల. -
నా కారణం నాకు ఉంది
నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్లో టాప్ క్లాస్ యాక్టర్‌గా పేరు పొందారు. అంత పేరు తెచ్చుకున్న ఆయన పక్కన యాక్ట్ చేయడానికి తాప్సీ నిరాకరించారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. నవాజుద్దీన్ సిద్ధిఖీ, తాప్సీలతో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించాలనుకున్నారట దర్శకుడు హనీ త్రెహాన్. కానీ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట తాప్సీ. దీనికి కారణం సిద్ధిఖీతో ఈక్వేషన్ సరిగ్గా లేకపోవటమే అని బాలీవుడ్లో కామెంట్ వినిపించింది. దీనికి సమాధానమిస్తూ – ‘‘మీ (వార్త ప్రచురించిన ఓ వెబ్‌సైట్‌ని ఉద్దేశించి) హెడ్‌లైన్స్ కోసం ఏవేవో కారణాలు రాయొద్దు. ఏదైనా విషయం గురించి సగం సగం తెలిసినప్పుడు సమాచారం అని రాసుకోవాలి. అంతే కానీ అంతా తెలిసినట్టు మా మీద తోసేయడం సరికాదు. యాక్టర్‌గా నాకు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. అన్నింటికీ ‘యస్’ చెప్పాలంటే కష్టం. ఏదైనా సినిమా ఒప్పుకోకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ నేను మాత్రం ‘పర్టిక్యులర్ యాక్టర్‌తో కలసి నటించను’ అనే కారణంతో ఎప్పుడూ నో చెప్పను. హనీ తెహ్రాన్ తన ఫస్ట్ సినిమాకే నన్ను తీసుకోవాలనుకోవటం చాలా హ్యాపీ. నవాజుద్దీన్ సిద్ధిఖీ గారి టాలెంట్ మీద నాకు చాలా గౌరవం ఉంది. త్వరలోనే ఆయనతో యాక్ట్ చేస్తానని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు తాప్సీ. -
క్రైమ్‌కి ఓకే!
అవును... తమన్నా నేరంతో నేస్తం చేయబోతున్నారట. ఆ నేరం పేరు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆ మధ్య విడుదలైన ‘మామ్’లో డిటెక్టివ్‌గా నటించిన నవాజూద్దీన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్’గా బాలీవుడ్లో దూసుకెళుతోన్నారు. ఈయనతో తమన్నా ఎందుకు చేతులు కలిపారంటే? ఓ హిందీ సినిమా కోసం. నవాజుద్దీన్ ముఖ్య పాత్రలో ఓ క్రైమ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో తమన్నా నటించనున్నారని బీ–టౌన్ టాక్. కథ వినగానే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి తమన్నా ఓకే అన్నారట. అయితే ఆమె నటించనున్నది నవాజుద్దీన్ సరసన కాదు. ఓ కీలక పాత్ర అట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఏడేళ్ల క్రితం వివేక్ ఒబెరాయ్‌తో ‘ప్రిన్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన కూకీ వి. గులాటీ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి దర్శకుడు. ప్రస్తుతం హిందీ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. ఇన్సెట్లో ఇసుక మీద హాయిగా సేద తీరుతున్న తమన్నా ఫొటో అక్కడిదే. ఈ ఫొటో చూసి... సముద్ర తీరంలో తమన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు. బాగా ఎక్సర్సైజ్ చేసి, అలసిపోయారు. మామూలుగా ఇక్కడ ఉంటే ఇన్‌డోర్‌లో జిమ్‌లో వర్కవుట్స్ చేసేవారు. ఫ్రాన్స్‌లో మాత్రం అవుట్డోర్ వర్కవుట్స్ చేశారట. అలసిపోయే రేంజ్లో వ్యాయామాలు చేసి, ఇదిగో ఇలా ఇసుక మీద సేద తీరుతున్నారు. ‘‘అవుట్డోర్ ట్రైనింగ్ చాలా బాగుంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా పేర్కొన్నారు. -
హార్రర్ చిత్రంలో నయన
ప్రస్తుతం కోలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా ఎదిగిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నయనతారనే. రాజారాణి చిత్రంలో ఆర్య, జయ్ ఇద్దరు హీరోలు ఉన్నా ఆ చిత్ర కథ నయనతార పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల మాయ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నయనతార నటించగా ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు దాని తరువాత ఆమె నటించిన తనీఒరువన్, నానుమ్ రౌడీదాన్ చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో హ్యాట్రిక్ సాధించిన నయనతార ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా పిలవబడుతున్నారు. తాజాగా మాయ చిత్రం తరహాలో మరో లేడీఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు సర్గుణం సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించి తొలి ప్రయత్నంగా తన శిష్యుడు రాఘవన్ దర్శకత్వంలో మంజపై అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విజయాన్ని అందుకుంది. తాజాగా మరో శిష్యుడి దర్శకత్వంలో నటి నయనతార ప్రధాన పాత్రలో చిత్రం చేయనున్నారు. దీనిగురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మంజపై వంటి సక్సెస్‌ఫు చిత్రం తరువాత ఏ సర్గుణం సినిమాస్ పతాకంపై నయనతార కథానాయకిగా చిత్రం నిర్మించనున్నానని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం కలవాణి నుంచి ఇటీవల తెరకెక్కించిన చండీవీరన్ వరకు తన వద్ద సహాయదర్శకుడిగా పని చేసిన దాస్ రామసామి ఈ చిత్రానికి కథ, ద ర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇది హార్రర్ నేపథ్యంలో సాగే వినోదం మేళవించి క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించే జనరంజక చిత్రంగా ఉంటుందని దర్శకనిర్మాత సర్గుణం అన్నారు.