ఖాకీ ‘క్రాస్‌చెక్’ | Police 'cross-check' | Sakshi
Sakshi News home page

ఖాకీ ‘క్రాస్‌చెక్’

Published Wed, Jul 30 2014 4:14 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఖాకీ ‘క్రాస్‌చెక్’ - Sakshi

ఖాకీ ‘క్రాస్‌చెక్’

  • ఎల్బీనగర్ డీసీపీ జోన్ పరిధిలో వింత పరిస్థితి
  •  రెండు హత్యలు...మూడు ఠాణాల అధికారులపై ఆరోపణలు
  •  పోలీసులు, నిందితుల పాత్రపై ఇంకా నిగ్గు తేలని నిజాలు
  • సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీనగర్ జోన్ పరిధిలో పోలీసులపై పోలీసులే ‘క్రాస్‌చెక్’ (దర్యాప్తు) చేసుకుంటున్న వింత పరిస్థితి దాపురించింది. ఒక పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు మరో అధికారితో విచారణ జరిపిస్తుండగా...విచారణ అధికారిపై వచ్చిన  ఆరోపణలపై వేరే అధికారితో విచారణ జరిపిస్తుండటం  పోలీసులను నవ్వుల పాల్జేస్తోంది. రియల్టర్ వెంకట్‌రెడ్డి హత్య కేసులో వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తిపై ఆరోపణలు రాగా..
     
    మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులో ఇటు మీర్‌పేట్, అటు ఇబ్రహీంపట్నం పోలీసుల మధ్య ఆరోపణలు రావడంతో ఈ రెండు ఠాణాల నిగ్గు తేల్చేందుకు ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాం దర్యాప్తు చేపట్టారు.
     
    రియల్టర్ హత్య కేసులో సీఐపై ఆరోపణలు...
     
    తన పరిధిలో జరిగిన హత్య కేసును తానే దర్యాప్తు చేసుకోలేని దుస్థితిలో వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి ఉన్నారు. బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన రియల్టర్ వెంకట్‌రెడ్డి ఈనెల 1న అదృశ్యమై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును నిజానికి వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే హతుడి డైరీలో గోపాలకృష్ణమూర్తి అతడిని బెదిరించినట్టు ఉండటంతో ఈ హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు బాధ్యతలను మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి అప్పగించారు. ఇంకా ఈ కేసు కొలిక్కి రాలేదు. దర్యాప్తు స్టేజిలోనే ఉంది.
     
    ఆటో డ్రైవర్ హత్య కేసులో ...
     
    ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులో కూడా గోపాలకృష్ణమూర్తికి ఎదురైన పరిస్థితే మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి తలెత్తింది. ఈ హత్య కేసులో ఇటు మీర్‌పేట పోలీసులు, అటు ఇబ్రహీంపట్నం పోలీసులు వేర్వేరు నిందితులను అరెస్టు చూపించడమే ఇందుకు కారణం. గతనెల 30న మీర్‌పేటలో జంగయ్య హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ముగ్గురిని ఈనెల 16న మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి అరెస్టు చూపించారు. కాగా ఈనెల 19న ఇదే కేసులో వేరే నలుగురిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చూపించారు. ఒకే హత్యను ఇలా వేర్వేరు నిందితులు ఎలా చేస్తారనే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో  ఇబ్రహీంపట్నం, మీర్‌పేట పోలీసులు జంగయ్య హత్య కేసు దర్యాప్తులో అనుసరించిన తీరుపై విచారణ జరపాలని ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాంకు డీసీపీ విశ్వప్రసాద్ బాధ్యతలు అప్పగించారు.
     
    మూడు ఠాణాలపై ఆరోపణలు...
     
    రియల్టర్ వెంకట్‌రెడ్డి, ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులు వనస్థలిపురం, మీర్‌పేట, ఇబ్రహీంపట్నం పోలీసుల మెడకు చుట్టుకున్నాయి. ఈ రెండు హత్యలలో అసలు నిందితులు ఎవరో ఇంకా తేలలేదు. ఆరోపణలు మాత్రం పోలీసులపై రావడంతో తలలు పట్టుకుంటున్నారు. వెంకట్‌రెడ్డి హత్య కేసులో అసలు నిందితులే దొరకలేదు? దీంతో హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయం ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక జంగయ్య హత్య కేసులో మాత్రం రెండు ఠాణాల పోలీసులు వేర్వేరు వ్యక్తుల అరెస్టులు చూపడం వివాదానికి తెరలేపింది. జంగయ్య హత్య కేసులో పోలీసుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు జైలులో ఉన్న నిందితులకు పండుగ చేసుకునేలా ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement