న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి అంతక్రితం త్రైమాసికంతో(సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్) పోల్చితే 2.15 శాతం పెరిగి రూ.128.41 లక్షల కోట్లకు చేరింది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రభుత్వ రుణ నిర్వహణ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. గణాంకాల ప్రకారం, ఈ విలువలు రెండు త్రైమాసికాల్లో రూ.1,25,71,747 కోట్ల నుంచి రూ.1,28,41,996 కోట్లకు ఎగశాయి.
పబ్లిక్ డెట్ వాటా 91.60 శాతం
మొత్తం రుణాల్లో(కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన) పబ్లిక్ డెట్ వాటా ఈ కాలంలో 91.15 శాతం నుంచి 91.60 శాతానికి ఎగసింది. ఇందులో డేటెడ్ సెక్యూరిటీల విషయానికి వస్తే సమీక్షా కాలంలో వాణిజ్య బ్యాంకుల వాటా 37.82 శాతం నుంచి 35.40 శాతానికి తగ్గింది. డిసెంబర్ 2021 చివరి నాటికి బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్‌ల వాటాలు వరుసగా 25.74%, 4.33 శాతాలుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరినాటికి 2.91 శాతంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ షేర్ 2021 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 3.08 శాతానికి చేరింది. ఆర్‌బీఐ వాటా 16.98 శాతం నుంచి 16.92 శాతానికి స్వల్పంగా తగ్గింది. దాదాపు 25 శాతం డేటెడ్ సెక్యూరిటీల కాల వ్యవధి 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంది.
ఆర్‌బీఐ పాలసీకి 'ఈల్డ్' మద్దతు
ఇక సమీక్షా కాలంలో బాండ్స్‌పై ఈల్డ్(వడ్డీ) కదలికలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సరళతర ద్రవ్య పరపతి విధానానికి మద్దతు నిచ్చాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో 10-సంవత్సరాల బెంచ్‌మార్క్ సెక్యూరిటీస్‌పై ఈల్డ్స్ 6.22 శాతం నుంచి స్వల్పంగా 6.45 శాతానికి పెరిగింది. అంటే త్రైమాసికంలో దాదాపు 23 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎగసింది. ఆర్‌బీఐ తన పాలసీ రెపో రేటును(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు) 4 శాతం వద్దే యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఈల్డ్ కదలికలు భరోసాను ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ అభిప్రాయపడుతోంది. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ సరళతర ఆర్థిక విధానాల కొనసాగించాలని భావిస్తోంది.
(చదవండి: మరో అంతర్జాతీయ కంపెనీకి సీఈవోగా భారత సంతతి వ్యక్తి!)
Comments
Please login to add a commentAdd a comment