- వీఆర్‌ఏల అరణ్యరోదన
- వేతనాల విడుదలపై తాత్సారం
- అల్లాడుతున్న 1,720 కుటుంబాలు
గుడ్లవల్లేరు : జిల్లాలోని ఉన్నతాధికారులకు గ్రామానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా వారి భాగస్వామ్యం తప్పనిసరి. గ్రామపంచాయతీ పరిధిలో పన్నులు వసూలుచేయడం దగ్గరనుంచి గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారులకు వారి సంపూర్ణ సహకారం కావాల్సిందే. వారే గ్రామసేవకులు(వీఆర్‌ఏ). ఇంతప్రాధాన్యత గల బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరు మాత్రం నిత్యం ఆకలికేకలతో అల్లాడిపోతున్నారు.
జిల్లాలోని 1,720మంది వీఆర్‌ఏలకు వేతనాల సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తోంది. 010పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వానికి పట్టడం లేదు. వీఆర్‌ఏల వేతనాల్ని ప్రభుత్వం నెలనెలా కాకుండా రెండు నెలలకు ఒకసారి ఇవ్వటాన్ని బాధిత వీఆర్‌ఏ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో నెలకు రూ.3,500 ఇచ్చే వేతనాన్ని రూ.6,100 పెంచారే కానీ అమలు కావటం లేదు. గత నెల వేతనాలు ఇంతవరకూ వీఆర్‌ఏలక ుఅందలేదని ఆ సంఘం నేతలు ఆవేదనకు గురవుతున్నారు వెంటనే తమ వేతనాలను విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆందోళనలు తీవ్రతరం...
క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖకు చెందిన పనుల విషయంలో రోజంతా వెట్టిచాకి రీ చేయించుకుంటున్నారు. పల్లెల్లో ఆ శాఖకు దిక్సూచిలా ఉపయోగపడే మా వేతనాల్నే ప్రభుత్వం నిలిపివేయడం దారుణం. వేతనాలు ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.
- ఆలూరి రంగా, గుడ్లవల్లేరు మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు
పస్తులున్నా పట్టించుకునేదెవరు?
మా వీఆర్‌ఏల కుటుంబాలు పస్తులుంటున్నాయంటున్నా పట్టించుకునే నాధుడే కనబడడం లేదు. గత ప్రభుత్వం 010పద్దు ద్వారా పెరిగిన వేతనాల్ని పంపక పోవటమే మా వీఆర్‌ఏలకు శాపంగా మారింది. జిల్లాలో 1,720కుటుంబాల వారు ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.
- యంగల రాజు, జిల్లా వీఆర్‌ఏల సంఘం ప్రధాన కార్యదర్శి
వెట్టిచాకిరీ...
తక్కువ వేతనం వస్తున్న వీఆర్‌ఏలు పనుల్లో మాత్రం మగ్గిపోతున్నారు. క్షేత్ర స్థాయిలో భూమి శిస్తు వసూళ్లు, భూమి కొలతలు, పంటల లెక్కలు, జనన మరణాలను గ్రామాల్లో సేకరించడం, అధికారుల పర్యటనలు, సభలు, సమావేశాలు, జాతర్లకు బందోబస్తు నిర్వహించడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన గ్రామీణ ప్రాథమిక సమాచారాన్ని అందించటంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ఇంత చేసినా వీరికి గౌరవ వేతనంతోనే సరిపెడుతున్నారు.