27 శాతం మంది... పెద్దస్థాయి బాధ్యతలు, నియంత్రణాధికారం ఉన్న ఉద్యోగం ఉత్తమమైనదని భావిస్తున్నారు.
ఉద్యోగం అధమం, వ్యాపారం మధ్యమం, వ్యవసాయం ఉత్తమం... అన్నారు పూర్వీకులు. అయితే ఇప్పుడు ప్రాధాన్యతలు మారిపోయాయి. అధమం అనుకున్న ఉద్యోగాన్ని ఉత్తమంగా భావించేవాళ్లు ఎక్కువయ్యారు. మరి ఇలాంటి ఉత్తమమైన ఉద్యోగాల్లో ఉత్తమోత్తమమైనది ఏది? ఏ ప్రాతిపదికన ఉద్యోగాన్ని అత్యుత్తమమైనదిగా భావించవచ్చు? అనే అంశం గురించి ‘సైకలాజికల్ సైన్స్’ పత్రిక తాజాగా సర్వే జరిపింది. సర్వే ఫలితాల ప్రకారం:
27 శాతం మంది... పెద్దస్థాయి బాధ్యతలు, నియంత్రణాధికారం ఉన్న ఉద్యోగం ఉత్తమమైనదని భావిస్తున్నారు. తాము తీసుకొనే నిర్ణయం ఎక్కువమందిని ప్రభావితం చేసేది అయితే బావుంటుందనేది వీరి అభిప్రాయం. 30 యేళ్లలోపు వాళ్లలో ఇలాంటి తపన అధికంగా ఉంది. వీరిలో 69 శాతం మంది అత్యున్నతస్థాయి బాధ్యత ఉన్న ఉద్యోగాన్ని కోరుకొంటున్నారు.
24 శాతం మంది... భారీస్థాయి జీతం వచ్చేదే ఉత్తమమైన ఉద్యోగం అంటున్నారు. జీతంతోనే వృత్తిపరమైన సంతృప్తి వస్తుందని వీరు అభిప్రాయపడుతున్నారు.
14 శాతం మంది యజమాని-ఉద్యోగి మధ్య సంత్సంబంధాలు ఉండేదే అత్యుత్తమైన ఉద్యోగం అన్నారు. మంచి బాస్ దగ్గర పనిచేయగలగడం అదృష్టమని వీరు అంటున్నారు.
13 శాతంమంది... అదనపు ఆదాయం ఉండాలన్నారు. జీతం కాక అదనంగా సంపాదించుకొనే ఉద్యోగం మంచిదని వీరి అభిప్రాయం.
12 శాతం మంది... ఆఫీస్ పరిస్థితులు, పరిసరాలు వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. స్టాఫ్ అంతా స్నేహితుల్లా ఉంటే ఆ ఉద్యోగాన్ని సాఫీగా చేయొచ్చన్నది వీరి అభిప్రాయం.
10 శాతం మంది... పనివేళల గురించి మాట్లాడుతున్నారు. నైటీ డ్యూటీ లేకపోవడం, ఏడెనిమిది గంటలే పనిచేయాల్సిన జాబ్ అయితే చాలని, తక్కువ జీతం అయినా ఇలాంటి జాబ్ మంచిదని భావిస్తున్నాం అనీ చెబుతున్నారు.
చివరిగా, వీరంతా ఏకాభిప్రాయానికి వచ్చిన అంశం ఏమిటంటే - మనశ్శాంతి, ఆత్మసంతృప్తి ఉన్న ఉద్యోగమే అత్యుత్తమమైనదని..!