తలరాత మార్చుదాం...
బాధ్యతలు పెరిగితే భారం పెరిగినట్టుగా అనిపిస్తుంది. బాధ్యతల్ని ప్రేమిస్తే అసలు భారమే అనిపించదు. ఇంకొకరి భారం దించడంలో
గొప్ప ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ ఉన్న బాధ్యత మన మీద ఉంది. సహన అంటే సహనశక్తి ఉన్న మనిషి. పదేళ్ల నుంచి ఓ జబ్బు వల్ల సహన పెద్ద భారం మోస్తోంది. రండి... ఆ భారం దించుదాం. ఈ తలరాతను మార్చుదాం.
అరుదైన ఓ వింత వ్యాధి ఈ నిరుపేద చిన్నారిని నరకయాతన పెడుతోంది. రోజురోజుకు పెరుగుతోన్న తల పరిమాణం ఆమెను అనుక్షణం అచేతనం చేస్తోంది. యాభై లక్షల మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే ‘అక్విడక్టల్ హైడ్రో సెఫలస్’అనే జబ్బు రోజుకు కొంత చొప్పున తలను పెంచుతూ మిగిలిన శరీర అవయవాలను కదలలేని స్థితికి తీసుకువెళుతోంది. పేదరికం, బిడ్డ ఆరోగ్యం బాగయ్యే పరిస్థితి లేకపోవటంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. బిడ్డల మంచిచెడూ పట్టించుకోలేని స్థితిలో తండ్రి ఉన్నాడు. దీంతో ఈ చిన్నారి, ఆమె ముగ్గురు అక్కా చెల్లెళ్ల బాధ్యతలను తాత, నానమ్మ తీసుకున్నారు. నలుగురినీ కంటికి రెప్పల్లా చేసుకుంటున్నారు. ఈ చిన్నారినైతే మరీనూ. కంటికి రెప్పే వేయకుండా కాపాడుకుంటున్నారు. అత్యాధునిక వైద్యంతో శస్త్ర చికిత్స చేస్తే తప్ప పెరుగుతున్న తల పరిణామం తగ్గదని వైద్యులు తేల్చేయటంతో పూట గడవటమే గగనమైన ఈ నిరుపేదలు.. ఆదుకునే వారి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎవరో ఒకరు తమ కష్టాన్ని తీర్చేందుకు వస్తారన్న నమ్మకంతో కాలం గడుపుతున్నారు.
కష్టాల కడలి
సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్ వడ్డెరబస్తీకి చెందిన సైదులు, సుజాతలకు నలుగురు ఆడపిల్లలు. వారిలో మూడవ కూతురు సహన. ముద్దుపేరు సాధన. పదేళ్ల వయసున్న సహన పుట్టుకతోనే అక్విడక్టల్ హైడ్రో సెఫలస్‌కి గురైంది. గాంధీ, నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు సహనకు ఐదేళ్ల వయసులో వైద్యపరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స చేసినా ఫలితం ఏ మాత్రం ఉంటుందో చెప్పలేమన్నారు. చేతిలో చిల్విగవ్వ లేక, చిన్నారి ఆరోగ్యం బాగుపడుతుందన్న భరోసానిచ్చేవారు కనిపించకపోవటంతో సహనను ఇంటికి తీసుకువచ్చారు. తండ్రి సైదులు భవన నిర్మాణ పనికి కూలీగా వెళ్లి గాయపడ్డాడు. అప్పట్నుంచీ ఏ పనీ చేయలేని స్థితిలో ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీంతో పరిస్థితి మరింత దుర్భరమైపోయింది. బిడ్డ అనారోగ్యం, భర్త పని చేయలేకపోవడం, ఇంట్లో అందరికి కడుపులు నింపలేని దుస్థితిలో సహన త ల్లి సుజాత తట్టుకోలేకపోయింది. ఈ కష్టాలన్నింటికీ చావే పరిష్కారమనుకున్న సుజాత నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెక్కలు తెగిన పక్షులయ్యారు నలుగురు ఆడపిల్లలు.
కన్నీరే సమాధానం
ఇలా ఏ దిక్కు లేని ఈ పిల్లలకు తాత లింగయ్య, నానమ్మ లక్ష్మమ్మలే దిక్కయ్యారు. ఆ తర్వాత వృద్ధాప్యంతో లింగయ్య ఇంటికే పరిమితమయ్యాడు. నానమ్మ లక్ష్మమ్మ మాత్రం కుటుంబపోషణ కోసం నాలుగిళ్లలో పనిమనిషిగా చేరి, తన మనుమరాళ్లయిన స్వాతి, సంధ్య, మేఘనలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తోంది. తల భారంతో నడవటం కాదుకదా, కనీసం కూర్చోలేని సహనకు రోజంతా సపర్యలు చేస్తోంది. అన్ని విషయాలను చక్కగా గుర్తుపెట్టుకుని మాట్లాడుతుండే సహన నేల మీద నుండి కనీసం లేచే పరిస్థితి లేదు. భోజనం మొదలుకుని స్నానం వరకు నానమ్మ లక్ష్మమ్మ చేయించాల్సిందే. సహన భవిష్యత్తు విషయమై లక్షమ్మను కదలిస్తే కన్నీరే సమాధానమైంది.
- ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
పెద్ద చదువులు చదువుతా
స్కూల్‌కెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉంది. యాక్టర్ మహేష్‌బాబును కలవాలని ఉంది. ఎప్పుడూ ఇంట్లోనే పడుకుని ఉండటం చాలా కష్టంగా ఉంది. అమ్మ కూడా లేదు. ఈ వయసులో నానమ్మను చాలా బాధ పెడుతున్నాను.
- సహన
చికిత్సకు మార్గముంది
అక్విడక్టల్ హైడ్రోసెఫలస్ అనే జబ్బు మెదడుకు సంబంధించింది. శరీరంలో నీటి ప్రసరణ ఎలా ఉంటుందో మెదడులోనూ అలాగే ఉంటుంది. మెదడులో కొన్ని రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఇలా నీరు చేరి తల పెద్దదవుతూ ఉంటుంది. దీన్ని వెంట్రిక్యులొస్టొమీ చికిత్స ద్వారా నయం చేయచ్చు. 70 శాతం పైనే సక్సెస్ రేటు ఉంటుంది. దీనికి రెండులక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. శస్త్రచికిత్స అనంతరం కూడా మందులు వాడాలి.
- డా. ప్రవీణ్ అంకతి
సీనియర్ న్యూరోసర్జన్, గ్లోబల్ హాస్పిటల్
సహనను ఆదుకోవాలంటే..
నిరుపేద చిన్నారి సహనను బతికించేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. సహన శస్త్ర చికిత్స లేదా ఆమె కుటుంబానికి అండగా ఉండాలనుకునే వారు 9505504787 లేదా 9010008796కు సంప్రదించవచ్చు. లేదా సహన, లింగయ్యల పేరున ఉన్న అకౌంట్ నెంబర్
1102210026081 ‘దేనా బ్యాంక్,
ఓయూ జామై ఉస్మానియా, సికింద్రాబాద్
(బ్యాంక్ కోడ్ 1106566322)కు జమ చేయొచ్చు.