
ఒకరి ఆస్తి 9వేలు.. మరొకరి అప్పు 140 కోట్లు
అసోం ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. అభ్యర్థుల ఆస్తులు, అప్పుల వివరాలను వాళ్లు ఈసీకి దాఖలుచేసిన అఫిడవిట్ల ఆధారంగా చూసినప్పుడు దిమ్మ తిరుగుతోంది.
అసోం ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. అభ్యర్థుల ఆస్తులు, అప్పుల వివరాలను వాళ్లు ఈసీకి దాఖలుచేసిన అఫిడవిట్ల ఆధారంగా చూసినప్పుడు దిమ్మ తిరుగుతోంది. లఖింపూర్ లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రిషికేశ్ బారువా తన ఆస్తి మొత్తం 9వేల రూపాయలు మాత్రమేనని చెప్పారు. నిజంగా అది నిజమే అయితే ఆ 9 వేలతో ఆయన ప్రచారం ఏం చేస్తాడో.. ఎన్నికల్లో ఎలా నిలబడతాడో ఆ పరమాత్ముడికే ఎరుక.
ఇదే రాష్ట్రంలోని తేజ్ పూర్ స్థానానికి పోటీ పడుతున్న మోని కుమార్ సుబ్బా అనే స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 140 కోట్ల రూపాయల అప్పు ఉందట. ఎవరికైనా పదివేలు ఇవ్వాల్సి ఉంటేనే మనం రోజుకు పదిసార్లు తలుచుకుని, ఎలాగోలా ఇచ్చేయాలని ఆందోళన చెందుతుంటాం. అలాంటిది అంత పెద్ద మొత్తంలో అప్పులు ఉండి కూడా మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో నిలబడ్డాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కదా. అయితే.. ఆయన ఆస్తి కూడా ఏమంత తక్కువ కాదు. 306 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందట. అందుకే అందులో సగం మొత్తం అప్పు చేశాడన్నమాట. సుబ్బా ఆస్తి సరిగ్గా రూ.3,06,75,35,137 అని తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నాడు.
తొలిదశ ఎన్నికల్లో అసోం నుంచి మొత్తం 64 మంది పోటీ పడుతుండగా, వాళ్లలో ఒకరి మీద హత్యాయ త్నం కేసు, మరొకరి మీద అత్యాచారం కేసు కూడా ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల ఆస్త్తిపాస్తులను సగటున చూస్తే ఒక్కొక్కరికి రూ. 5.75 కోట్లు ఉన్నట్లు లెక్క అని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.