
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
అక్టోబర్ 1, ఆ తర్వాత నుంచి ఏపీవైలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు.
చదవండి👉 ఇన్‌కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?
దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment