Atal pension scheme
-
రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?
ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. -
పన్ను చెల్లింపుదారులకు షాక్, 'ఏపీవై' పథకంలో చేరకుండా కేంద్రం నిషేధం!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1, ఆ తర్వాత నుంచి ఏపీవైలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు. చదవండి👉 ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ? దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. -
కనీస రాబడులతో వినూత్న పెన్షన్ పథకం
ముంబై: వినూత్నమైన పెన్షన్ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్ఆర్డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ ఉత్పత్తి తీసుకువచ్చే విషయంలో యాక్చుయరీలు సాయమందించాలని బంధోపాధ్యాయ కోరారు. యాక్చుయరీల నుంచి వచ్చే సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగే సమయంలో సభ్యులకు అధిక రేట్లతో కూడిన పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్‌ను అందించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు. మార్కెట్ ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లకు అనుగుణంగా ఉండే భిన్నమైన యాన్యుటీ ఉత్పత్తుల అవసరం ఉందన్నారు. క్రమానుగతంగా కావాల్సినంత వెనక్కి తీసుకునే ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) మాదిరి యాన్యుటీ ప్లాన్లు కావాలన్నారు. పెన్షన్ ఎంత రావచ్చన్న అంచనాలను ప్రస్తుత, నూతన చందాదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు బంధోపాధ్యాయ చెప్పారు. -
పేదల కోసం జనసురక్ష
- తక్కువ ప్రీమియంతో బీమా - ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా - రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా - రూ.వెయ్యి ప్రీమియంతో - అటల్ పెన్షన్ యోజనతక్కువ ప్రీమియంతో బీమా - ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా - రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా - రూ.వెయ్యి ప్రీమియంతో అటల్ పెన్షన్ యోజన న్యూఢిల్లీ: ప్రజలందరికీ బీమా సౌకర్యం ఉండేలా జైట్లీ మూడు పథకాలను బడ్జెట్లో ప్రకటించారు. దామాషా ప్రకారం చూస్తే దేశంలోని ఎక్కువమంది ప్రజలు ఎలాంటి బీమా పథకం లేకుండానే ఉన్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన విజయవంతమైనట్లే.. భారతీయులందరికీ సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రమాద, జీవిత బీమా, పెన్షన్ పథకాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వీటిలో మొదటిది ‘ప్రధానమంత్రి సురక్షా బీమా’. దీని కింద ఏడాదికి కేవలం రూ.12 అంటే నెలకు రూపాయి చొప్పున ప్రీమియం కడితే రూ.2 లక్షల ప్రమాద మరణ బీమా వర్తిస్తుంది. ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు బీమా కింద లభిస్తుంది. జైట్లీ ‘అటల్ పెన్షన్’ పథకాన్నీ ప్రకటించారు. ఏడాదికి కనీసంగా రూ.వెయ్యి చొప్పున ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే, లబ్ధిదారులు చెల్లించే మొత్తానికి ప్రభుత్వం 50% పెన్షన్‌గా చెల్లిస్తుంది. 2015 డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. జైట్లీ ప్రకటించిన మూడో పథకం జీవిత బీమాకు సంబంధించిన ‘ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన’. ఈ పథకం సహజ, ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు గల వారు ఏడాదికి రూ.330 (అంటే, రోజుకు రూపాయి కంటే తక్కువ) ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ బీమా కింద లబ్ధిదారులకు రూ.2 లక్షలు చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకూ వరాలు దేశంలో 80 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు దాదాపు కోటి మంది వరకు ఉన్నారని జైట్లీ అన్నారు. వీరిలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వీరిలోనూ ఎక్కువమంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారేనన్నారు. ఇలాంటి సీనియర్ సిటిజన్లకు వయసు కారణంగా వచ్చే వివిధ వైకల్యాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామన్నారు. వృద్ధాప్యం లో ఏ ఒక్కరూ బాధ పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఎస్సీలకు రూ. 30,851 కోట్లు, ఎస్టీలకు రూ.19,980 కోట్లు, మహిళలకు రూ. 79,258 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పారసీల నాగరికత, సంస్కృతిలను కాపాడటానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, 2015-16లో జరిగే ‘ది ఎవర్ లాస్టింగ్ ఫ్లేమ్’ ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు.